





Best Web Hosting Provider In India 2024

Saturday Motivation: రోజూ ఉదయాన్నే మీకోసం మీరు కేటాయించే ఈ రెండు నిమిషాల సమయం మీ జీవితాన్నే మార్చేస్తుంది!
Saturday Motivation: రోజు మొత్తంలో మీకోసం మీరు కొంత సమయాన్ని తప్పక కేటాయించాల్సి ఉంటుంది. ఎందుకంటే ఇతరుల కన్నా ఎక్కువ మిమ్మల్ని మీరు ప్రేమించుకోవడం చాలా అవసరం. మిమ్మల్ని మీరు కాపాడుకోవడం కోసం ఉదయాన్నే తప్పకుండా చేయాల్సిన 5 రకాల పనుల గురించి తెలుసుకోండి. జీవితాన్ని మార్చుకోండి!

రోజు మొత్తంలో మీకోసం మీరు ఏం చేస్తున్నారు అంటే సమాధానం మీ దగ్గర ఉందా? మీరే కాదు ఈ ప్రశ్నకు సమాధానం చాలా మంది దగ్గర లేదు. భర్త లేదా భార్య కోసం, పిల్లల కోసం, ఇతర కుటుంబ సభ్యుల కోసం, ఆర్థిక లావాదేవీల కోసం, వృత్తి వ్యాపారాల కోసం ఇలా అన్నింటి కోసం 24గంటలు మీరు పరితపిస్తూనే కాలాన్ని గడిపేస్తుంటారు. కానీ ఇందులో మీకోసం అంటే కేవలం మీ శారీరక, మానసిక ఆరోగ్యం కోసం మీరు ఏమైనా చేస్తున్నారా? అంటే మౌనంగా ఉండిపోక తప్పదు. ఎందుకంటే ఇలా తమ కోసం తాము సమయం కేటాయించేవాళ్లు చాలా తక్కువ మంది ఉంటారు.
మీరు కూడా ఇలాంటి వారే అయితే మీకంటూ మీరు ప్రత్యేకంగా కాస్త సమయాన్ని కూడా కేటాయించలేకపోతే మీ జీవితంలో మీకు సంతృప్తి లేకుండా పోతుంది. మిమ్మల్ని మీరు ప్రేమించుకోకపోతే నమ్మకాన్ని కోల్పోతారు, ఒత్తిడికి లోనవుతారు. ఫలితంగా నీరసంగా, ఉదాసీనంగా ఉంటారు. ఇప్పటికైనా మారండి. ఎంత బిజీ లైఫ్ గడుపుతున్నా మీ కంటే కొంత సమయాన్ని కేటాయించుకోండి. కనీసం రోజులు రెండు నిమిషాల పాటైనా మిమ్మల్ని మీరు ఇలా ప్రేమించుకోండి. మానసికంగా బలంగా తయారవండి.
30 సెకన్ల పాటు లోతైన శ్వాస:
మీ కోసం మీరు చేయాల్సిన వాటిలో ముఖ్యమైనది మీ ఉదయాన్ని ప్రశాంతంగా, నెమ్మదిగా ప్రారంభించడం. ఇలా చేయడం వల్ల మీరు రోజంతా ప్రశాంతంగా ఉండగలుగుతారు. ఇందుకోసం మీరు ప్రశాంతంగా ఒక చోట కూర్చుని దాదాపు 30 సెకన్ల పాటు లోతైన శ్వాసను తీసుకోండి. 4 సెకన్ల పాటు లోపలికి శ్వాస తీసుకోండి, ఆపై 4 సెకన్లు శ్వాసను ఆపుకోండి, ఆ తర్వాత 4 సెకన్ల పాటు శ్వాసను బయటకు వదిలేయండి. ఈ చిన్న అలవాటు మీకు చాలా ప్రశాంతతనిస్తుంది, మీలోని రకరకాల ఆలోచనలన్నింటినీ కాసేపు పక్కకు నెట్టేస్తుంది. ఒత్తిడిని వెంటనే తగ్గించడానికి, నాడీ వ్యవస్థను సడలించడానికి, రోజును ప్రశాంతంగా, అద్భుతంగా ప్రారంభించడానికి ఇది చాలా బాగా సహాయపడుతుంది.
కృతజ్ఞతా భావాలు పెంచుకోండి:
మనకున్న చెడ్డ అలవాటు ఏమిటంటే మనకు లభించే వాటిపై మనం దృష్టి పెట్టము. ఎప్పుడూ లేని దాని గురించే ఆరాటపడుతుంటాం. ఉన్నదానితో సంతృప్తి చెందకుండా మరింత ఎక్కువగా పొందేందుకు పోటీలో ఉంటాము. చాలా సార్లు ఈ అలవాటు మనలో ఒత్తిడి, ఆందోళనకు కారణం అవుతుంది. అందుకే రోజూ ఉదయం లేచి 10 సెకన్ల పాటు మీకున్న వస్తువులు, వ్యక్తులు, సౌకర్యాలకు కృతజ్ఞతలు చెప్పండి. అది మీ కుటుంబం అయినా, మీ ఉద్యోగం అయినా లేదా మీకు సంతోషాన్ని కలిగించే ఏదైనా వస్తువు అయినా. ఈ చిన్న కృతజ్ఞతా భావన మీలోని ఒత్తిడిని వెంటనే తగ్గిస్తుంది. మీ విలువను మీకు తెలియజేస్తుంది.
సానుకూల ఆలోచనలు:
మీ జీవితం సానుకూలంగా సాగాలంటే మీరోజును సానుకూలంగా ప్రారంభించాలి. కాబట్టి రోజు కొంత సేపు కూర్చుని రాబోయే రోజు గురించి సానుకూల ఉద్దేశాలను ఏర్పరచుకోండి. మీరు రోజును మెరుగైనదిగా, ఉత్పాదకంగా చేయడానికి ఏం చెయ్యాలో ఆలోచించండి. అంతేకాదు.. మీరు రోజుకు ఒక చిన్న లక్ష్యాన్ని కూడా నిర్దేశించుకోవచ్చు. ఉదాహరణకు- నేను ఈ రోజంతా సంతోషంగా ఉండాలి, ఉత్సాహంగా, ఉత్పాదకంగా గడపాలి అంటూ ఓక పాజిటివ్ కండిషన్ మీద ప్రతి రోజును మొదలు పెట్టండి. ఇలా చేయడం వల్ల మీరు పనిని మెరుగైన విధంగా చేస్తారు. మీరే మీ గురించి చక్కగా ఆలోచిస్తారు. ఈ రకమైన సానుకూల ఉద్దేశాలు మిమ్మల్ని మెరుగైన వ్యక్తిగా తీర్చిదిద్దడంలో సహాయపడతాయి.
ఆరామంగా కూర్చుని ఒక గ్లాసు నీరు త్రాగండి
శరీరం పాటు మనసును కూడా ఆరోగ్యంగా ఉంచుకోవడానికి సరైన హైడ్రేషన్ చాలా అవసరం. అందుకే ఉదయం లేవగానే కనీసం ఒక గ్లాసు నీరు త్రాగాలి. తొందరపడి నీరు త్రాగడానికి బదులుగా ఒక గ్లాసులో నీరు తీసుకొని ప్రశాంతంగా కూర్చోండి, నెమ్మదిగా నీటిని అనుభూతి చెందుతూ త్రాగండి. ఈ సమయంలో కొన్ని సానుకూల ఆలోచనలు చేయండి. , ఈ అలవాటు మీ శరీరాన్ని హైడ్రేట్ చేయడంతో పాటు మనసును కూడా ఒత్తిడి లేకుండా చేస్తుంది. మిమ్మల్ని మరింత ఉత్సాహంగా, అందంగా, ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడుతుంది.
నవ్వుతూ రోజును ప్రారంభించండి
ఉదయం లేచీ లేవగానే పనుల్లో మునిగిపోకుండా కాసేపు మీ కోసం మీరు సమయాన్ని కేటాయించుకోండి. ఆ పని చేయాలి, ఈ పని చేయాలి అని కంగారు పడుతూ రోజును మొదలు పెట్టడం మీకు ఏమాత్రం మంచిది కాదు. ఉదయం లేవగానే మిమ్మల్ని మీరు మెచ్చుకోవాలి, నవ్వుతూ, సంతోషంగా మీ రోజును ప్రారంభించాలి. నవ్వడం వల్ల ఎండార్ఫిన్ అనే హార్మోన్ విడుదల అవుతుంది, ఇది ఒత్తిడిని తగ్గిస్తుంది. ఈ చిన్న అలవాటు మీ శక్తి స్థాయిలను పెంచుతుంది. రాబోయే రోజు కోసం ఒక తాజా, ఒత్తిడి లేని ప్రారంభాన్ని ఇస్తుంది. మిమ్మల్ని మరింత ఉత్సాహవంతులను చేస్తుంది.
సంబంధిత కథనం