



Best Web Hosting Provider In India 2024
AP TG Maoist : వయోభారంలో సారథ్యం.. పట్టు కోల్పోతున్న మావోయిస్టు పార్టీ.. తెలుగు రాష్ట్రాల్లో ప్రశ్నార్థకంగా ఉనికి!
AP TG Maoist : ఏడాది కాలంగా ఛత్తీస్‌గఢ్ అడవులు, తెలంగాణ, ఒడిశా, మహారాష్ట్ర సరిహద్దుల్లో భారీగా ఎదురుకాల్పులు జరిగాయి. అనేకమంది మావోయిస్టు అగ్రనేతలు, సానుభూతిపరులు చనిపోయారు. దీంతో నిషేధిత కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ ఇండియా తన మేథో పునాదిని, సైద్ధాంతిక బలాన్ని వేగంగా కోల్పోతోంది.
తెలుగు నేలపై పుట్టిన వారు కొందరు గత రెండు దశాబ్దాలుగా మావోయిస్టు పార్టీపై ఆధిపత్యం చెలాయించారు. కానీ ప్రస్తుతం పరిస్థితి మారింది. మావోయిస్టు పార్టీకి నాయకత్వం వహించిన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు చెందిన పలువురు అగ్రనేతలు ఎన్కౌంటర్లలో మరణించారు. కొందరు వయోభారంతో నెట్టుకొస్తున్నారు. మరికొందరు అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. ఇంకా ఉన్నత పదవుల్లో ఉన్నవారు.. వృద్ధాప్యంలో ఉండి ఉద్యమాన్ని నడిపించే సామర్థ్యాన్ని కోల్పోతున్నారు.
మనుగడ కోసం పోరాటం..
ప్రస్తుతం మావోయిస్టులు మనుగడ కోసం పోరాటం చేస్తున్నారు. ఛత్తీస్‌గఢ్‌లోని దట్టమైన అడవుల్లో భద్రతా బలగాలతో తీవ్ర పోరు జరుగుతుంది. ఈ నేపథ్యంలో అగ్రనేతలు సురక్షిత ప్రాంతాలకు తరలించడంపై ఎక్కువ దృష్టి సారించారు. మావోయిస్టు సిద్ధాంతంపై అగ్రనేతలు సానుభూతిపరులకు తరగతులు నిర్వహించే సూచనలు కనిపించడం లేదు. ఇదే విషయాన్ని చెబుతున్నారు తెలంగాణ పోలీసు ఉన్నతాధికారి ఒకరు.
హైదరాబాద్‌లో ప్రకటన..
2004 సెప్టెంబరు 21న అప్పటి ఆంధ్రప్రదేశ్‌లో ప్రధాన మావోయిస్టు గ్రూపు అయిన సీపీఐ (మార్క్సిస్ట్-లెనినిస్ట్) పీపుల్స్ వార్, బీహార్, పశ్చిమబెంగాల్ కేంద్రంగా ఉన్న మావోయిస్టు కమ్యూనిస్ట్ సెంటర్ ఆఫ్ ఇండియా (ఎంసీసీఐ) విలీనం ద్వారా.. సీపీఐ (మావోయిస్టు) ఏర్పడింది. ఈ విలీనానికి చర్చలు 2003లోనే ప్రారంభమయ్యాయి. పీపుల్స్ వార్ అగ్రనేతలు దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి నేతృత్వంలో.. అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వంతో చర్చలు జరిపారు. ఆ సమయంలో హైదరాబాద్‌లో సీపీఐ (మావోయిస్టు) ఏర్పాటును ప్రకటించారు.
బలమైన పొలిట్ బ్యూరో..
2004లో సీపీఐ-మావోయిస్టు ఏర్పడినప్పుడు.. 16 మంది సభ్యులతో బలమైన పొలిట్ బ్యూరో ఉంది. ఇది అత్యున్నత నిర్ణయాధికారాలను కలిగి ఉండేది. 34 మంది సభ్యులతో బలమైన కేంద్ర కమిటీ ఉండేది. సీపీఐ (మావోయిస్టు) ఆవిర్భావం సమయంలో కేంద్ర కమిటీతో పాటు పొలిట్ బ్యూరోలో చాలా మంది సభ్యులు ఆంధ్రప్రదేశ్‌కు చెందినవారే. గతంలో పీపుల్స్ వార్‌కు నేతృత్వం వహించిన కరీంనగర్‌కు చెందిన ముప్పాళ్ల లక్ష్మణరావును ప్రధాన కార్యదర్శిగా ఎన్నుకున్నారు.
కీలక బాధ్యతలు..
చెరుకూరి రాజ్‌కుమార్ అలియాస్ ఆజాద్, మల్లోజుల కోటేశ్వర్ రావు అలియాస్ కిషన్ జీ, నంబాల కేశవరావు అలియాస్ గంగన్న అలియాస్ బస్వరాజ్, సందె రాజమౌళి, కటకం సుదర్శన్ అలియాస్ ఆనంద్, మల్లోజుల వేణుగోపాల్ అలియాస్ భూపతి అలియాస్ సోనూ, తిప్పర్తి తిరుపతి అలియాస్ దేవ్ జీ, మళ్ల రాజిరెడ్డి, పటేల్ సుధాకర్ రెడ్డి, అక్కిరాజు హరగోపాల్ అలియాస్ ఆర్కే, చంద్రమౌళి, వారణాసి సుబ్రమణ్యం. మళ్ల రాజిరెడ్డి అలియాస్ సత్తెన్న, కోబాద్ ఘండి అలియాస్ సలీం.. ఇలా చాలామంది కీలక బాధ్యతలు నిర్వర్తించారు.
తెలుగు రాష్ట్రాల నుంచి..
ఆ తర్వాతి కాలంలో తెలుగు రాష్ట్రాల నుంచి.. జినుగు నరసింహారెడ్డి అలియాస్ జంపన్న, మోడెం బాలకృష్ణ, కడారి సత్యనారాయణ రెడ్డి అలియాస్ కోస, కట్టా రాంచంద్రారెడ్డి అలియాస్ విజయ్ అలియాస్ రాజు, పుల్లూరి ప్రసాద్ రావు, గాజర్ల రవి, పాక హనుమంతు అలియాస్ గణేష్ ఉయికే, గాజర్ల రవి అలియాస్ ఉదయ్, సంజయ్ దీపక్ రావు, తక్కళ్లపల్లి వాసుదేవ రావు వంటి పలువురు నేతలు ఉన్నత పదవుల్లోకి ఎదిగారు.
10 మంది తెలంగాణ వారే..
2021 ఇంటెలిజెన్స్ నివేదిక ప్రకారం.. పొలిట్ బ్యూరో సభ్యులతో కూడిన కేంద్ర కమిటీలో 21 మంది సభ్యులు ఉండగా.. వారిలో తెలంగాణకు చెందిన 10 మంది, ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఇద్దరు ఉన్నారు. అయితే ఈ లెక్క మారుతోందని, అగ్రనాయకత్వాన్ని బలోపేతం చేసేందుకు కొందరు కింది స్థాయి నేతలను కేంద్ర కమిటీలోకి పంపుతున్నట్లు తమకు సమాచారం ఉందని ఇంటెలిజెన్స్ వర్గాలు చెబుతున్నాయి.
మేథో బలం..
తెలుగు మావోయిస్టు నాయకుల్లో ఎక్కువ మంది ఉన్నత విద్యావంతులు ఉన్నారు. పోస్ట్ గ్రాడ్యుయేట్లు, న్యాయవాదులు, పీహెచ్‌డీ పట్టా పొందినవారు ఎంతో మంది. క్రమం తప్పకుండా శిక్షణా తరగతులు నిర్వహించడం ద్వారా.. నాయకులు, కార్యకర్తలలో మార్క్సిజం, లెనినిజం, మావోయిస్టు భావజాల సిద్ధాంతాన్ని పెంపొందించడం ద్వారా వారు మేథో బలాన్ని అందించారు. ఈ విషయాన్ని గతంలో ఎంతోమంది చెప్పారు.
గ్రేహౌండ్స్ ఏర్పాటుతో..
అయితే 2005-2009 మధ్య కాలంలో పోలీసు బలగాలు.. ముఖ్యంగా గ్రేహౌండ్స్ అనే మావోయిస్టు వ్యతిరేక దళం ఆంధ్రప్రదేశ్‌లో మావోయిస్టులపై అణచివేతకు దిగింది. దీంతో తెలుగు రాష్ట్రాల్లో మావోయిస్టు ఉద్యమానికి భారీ ఎదురుదెబ్బ తగిలింది. బలమైన ఇంటెలిజెన్స్ నెట్వర్క్ మద్దతుతో.. భద్రతా బలగాలు ఒకరి తర్వాత ఒకరిని లేకుండా చేశాయి. దీంతో అగ్ర నేతలంతా చత్తీస్‌గఢ్ అడవుల్లోకి, మరికొందరిని ఒడిశాలోకి వెళ్లిపోవాల్సి వచ్చింది.
ప్రాణాలు కోల్పోయారు..
ఎన్ కౌంటర్లలో ప్రాణాలు కోల్పోయిన తెలుగు మావోయిస్టు అగ్రనేతల్లో సందే రాజమౌళి, చెరుకూరి రాజ్ కుమార్ అలియాస్ ఆజాద్, మల్లోజుల కోటేశ్వర్ రావు అలియాస్ కిషన్ జీ, పటేల్ సుధాకర్ రెడ్డి, ఇటీవల రాంచంద్రారెడ్డి అలియాస్ చలపతి ఉన్నారు. బడే చొక్కారావు అలియాస్ దామోదర్, పాక హనుమంతు అలియాస్ గణేష్ ఉయికే వంటి అగ్రనేతలు ఎన్కౌంటర్లలో మరణించినట్లు వార్తలు వచ్చినప్పటికీ.. అధికారికంగా ధ్రువీకరించలేదు.
ఉనికి తగ్గింది..
కేంద్ర కమిటీ సభ్యులు జినుగు నరసింహా రెడ్డి అలియాస్ జంపన్న, నార్ల రవిశర్మ, వారణాసి సుబ్రహ్మణ్యం, తక్కళ్లపల్లి వాసుదేవ రావు, లంక పాపిరెడ్డి, కోబాద్ ఘండిలు లొంగిపోయారు. వీరిలో కొందరిని పోలీసులు అరెస్టు చేశారు. ఎన్కౌంటర్లు, లొంగుబాట్ల కారణంగా అగ్రనాయకత్వంలో తెలుగువారి ఉనికి తగ్గిందనే వాదన ఉంది.
జంపన్న కామెంట్స్..
ఇప్పటికీ దేశంలోని వివిధ ప్రాంతాల్లో వివిధ బాధ్యతలు నిర్వర్తిస్తున్న తెలుగువారు చాలా మంది ఉన్నారని జంపన్న చెబుతున్నారు. ‘పార్టీ సైద్ధాంతిక బలం విషయంలో తెలుగు నాయకులు ఎంతో కృషి చేశారు. దీంతో ఇప్పటి వరకు ఆలోచనా విధానంలో ఎలాంటి మార్పు రాలేదు. మావోయిస్టు పార్టీ తమ వ్యూహాలను పునఃసమీక్షించుకునే ప్రయత్నం చేస్తోందో లేదో తెలియడం లేదు’ అని జంపన్న అన్నారు.
14 మంది తెలుగు వారు..
చత్తీస్‌గఢ్ పోలీసుల తాజా సమాచారం ప్రకారం.. మావోయిస్టు పార్టీ అగ్రనాయకత్వంలో ఇంకా 14 మంది తెలుగు నాయకులు ఉన్నారు. నంబాల కేశవరావు అలియాస్ బస్వరాజ్, ముప్పాళ్ల లక్ష్మణరావు అలియాస్ గజపతి, మల్లోజుల వేణుగోపాల్ రావు అలియాస్ అభయ్ అలియాస్ సోనూ, మురళి, తిప్పర్తి తిరుపతి అలియాస్ దేవ్ జీ, కడారి సత్యనారాయణ రెడ్డి అలియాస్ కోసా, మోడెం బాలకృష్ణ, పుల్లూరి ప్రసాదరావు. గాజర్ల రవి అలియాస్ ఉదయ్, పాక హనుమంతు అలియాస్ గణేష్ ఉయికే, కొత్త రామచంద్రారెడ్డి అలియాస్ వికల్ప్, టీఎల్ఎన్ చల్లం అలియాస్ ఆనంద్, పుట్ల కల్పన అలియాస్ సుజాత ఉన్నారు.
వయోభారంతో..
ఈ అగ్రనేతల్లో చాలా మంది వయసు పైబడినవారే. వివిధ అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారే. ప్రస్తుత ప్రధాన కార్యదర్శి బస్వరాజ్ వయసు 70 ఏళ్లు. గణపతికి 76 ఏళ్లు. సోనూ, బాలకృష్ణ, పుల్లూరి ప్రసాదరావు, రామచంద్రారెడ్డి వంటి వారంతా అరవై ఏళ్లు పైబడిన వారు కాగా.. మరికొందరి వయసు 50 ఏళ్లు దాటింది. యువనేతలను తీసుకురావాలని ప్రయత్నిస్తున్నారని, కానీ వారెవరూ తెలుగు రాష్ట్రాలకు చెందిన వారు కాదని తెలుస్తోంది. రానున్న కాలంలో ఛత్తీస్‌గఢ్, ఒడిశాలో స్థానిక నాయకత్వం ఆవిర్భవించబోతోందని జంపన్న వ్యాఖ్యానించారు.
టాపిక్