



Best Web Hosting Provider In India 2024

AP Farmers : రైతులకు 50 శాతం రాయితీతో వ్యవసాయ యంత్రాలు.. దరఖాస్తు విధానం ఇలా
AP Farmers : రైతులకు 50 శాతం రాయితీతో వ్యవసాయ యంత్రాలు ఇచ్చేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. నెల 26లోపు దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. ఈ యంత్రాలతో రైతులకు ఎంతగానో ప్రయోజనం జరుగుతుందని తెలిపింది. చిన్న సన్నకారు రైతులు అవకాశాన్ని ఉపయోగించుకోవాలని కోరుతోంది.

పీఎం-ఆర్‌కేవీవై, ఎస్ఎంఏఎం పథకాల కింద ప్రస్తుత 2024-25 ఆర్థిక సంవత్సరానికి గాను.. రైతులకు 50 శాతం రాయితీతో యంత్రాలను అందిస్తున్నారు. రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో యంత్రాలను అందించేందుకు ప్రభుత్వం సిద్ధపడింది. జిల్లాకు 1,500 నుండి 1,800 వరకు యంత్రాలు ఇస్తారు. దీనికి కోసం జిల్లాకు రూ.2 కోట్ల నుంచి రూ.3 కోట్ల ఖర్చు చేయనున్నారు.
ఇవీ పరికరాలు..
బ్యాటరీ స్ప్రేయర్లు, ఫుట్ స్ప్రేయర్లు, తైవాన్ స్ప్రేయర్లు, పవర్ ఆపరేటెడ్ స్ప్రేయర్లు, ట్రాక్టర్ ఆపరేటెడ్ స్ప్రేయర్లు, ట్రాక్టర్ డ్రాన్ సీడర్, రోటావీటర్లు, పవర్ వీడర్లు, ట్రష్ కట్టర్లు, పవర్ టిల్లర్లు, దుక్కు సెట్లు, దమ్ము సెట్లు, గొర్రు, నాగళ్లు, బ్లేడు, సీడ్ డ్రిల్స్ అందించనున్నారు. జిల్లాల వారీగా యంత్రాలు, పనిముట్లు అందించడంతో తేడా ఉంటుంది.
డిమాండ్ ఆధారంగా..
ఆయా జిల్లాల రైతులకు ఎక్కువ యంత్రాలు, పనిముట్లు అవసరం అవుతాయో.. వాటిని ఆధారంగానే రైతులకు యంత్రాలు, పనిముట్లు రాయితీపై ఇస్తారు. కొన్ని జిల్లాల్లో కొన్ని రకాల యంత్రాలు, పనిముట్లు ఎక్కవగా వాడితే.. వాటిని వేరొక జిల్లాలో అసలు వాడరు. అలాంటప్పుడు ఎక్కువగా వాడే జిల్లాలకే ఆ యంత్రాలు, పనిముట్లు ఇస్తారు. రైతు సేవా కేంద్రాల్లో సంప్రదించి ఈనెల 26లోపు దరఖాస్తు చేసుకోవాలి.
వీరు కూడా అర్హులే..
ఆర్‌వోఎఫ్ఆర్ భూములను సాగుచేస్తున్న రైతులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఆగ్రో ఇండస్ట్రీస్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ (ఏపీఎస్ఏఐడీసీ) రైతులతో చర్చించి పరికరాల ధరలను నిర్ణయించి లబ్ధిదారులకు అందిస్తుంది. రాయితీ పోను రైతు చెల్లించాల్సిన మొత్తాన్ని ఆన్‌లైన్ పద్ధతిలో యూపీఐ లేదా నెఫ్ట్ ద్వారా చెల్లించాల్సి ఉంటుంది. దరఖాస్తు చేసేటప్పుడు ఓటీపీ కోసం ఆధార్ నెంబర్‌కు అనుసంధానం అయిన ఫోన్ నెంబర్‌ను ఉన్న ఫోన్ అందుబాటులో ఉంచుకోవాలి.
అర్హతలు..
1. చిన్న సన్నకారు రైతులు మాత్రమే అర్హులు
2. గత ఐదేళ్లుగా ప్రభుత్వ పథకాల కింద వ్యక్తిగతంగా లేదా సీహెచ్‌సీ ద్వారా లబ్ధి పొంది ఉండకూడదు.
3. ఈ-పంట నమోదు తప్పనిసరిగా ఉండాలి.
4. అటవీ భూముల సాగుదారులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు.
5. కుటుంబంలో ఒక రైతుకు మాత్రమే ఇస్తారు.
6. ఆ రైతుకు కచ్చితంగా వెబ్‌ల్యాండ్ లేదా ఆర్‌వోఆర్‌లో నమోదు ఉండాలి.
7. ట్రాక్టర్ కలిగిన రైతులకు మాత్రమే వాటికి సంబంధించిన సామన్లు ఇస్తారు.
సమర్పించాల్సిన పత్రాలు..
దరఖాస్తు చేసుకునే రైతులు కొన్ని ధ్రువీకరణ పత్రాలు సమర్పించాల్సి ఉంటుంది.
1. ఆధార్ కార్డు.
2. పట్టాదార్ పాస్ బుక్ నకలు.
3. ట్రాక్టర్‌తో నడిచే వ్యవసాయ పరికరాల కోసం ట్రాక్టర్ రిజిస్ట్రేషన్ పత్రం.
4. ఎస్సీ, ఎస్టీ రైతులు తప్పనిసరిగా కుల ధ్రువీకరణ పత్రం అందజేయాలి.
(రిపోర్టింగ్- జగదీశ్వరరావు జరజాపు, హిందుస్తాన్ టైమ్స్ తెలుగు)
టాపిక్