



Best Web Hosting Provider In India 2024
Viveka Murder Case : వివేకా హత్యకు గురై ఆరేళ్లు.. నిందితులకన్నా మేమే ఎక్కువ శిక్ష అనుభవిస్తున్నాం : సునీత
Viveka Murder Case : సరిగ్గా ఆరేళ్ల కిందట.. పులివెందులలో సంచలన ఘటన జరిగింది. మాజీమంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్యకు గురయ్యారు. మొదట గుండెపోటు అని ప్రచారం జరిగినా.. ఆ తర్వాత హత్య అని పోలీసులు విర్ధారించారు. కానీ ఇప్పటివరకు ఎవరికీ శిక్ష పడలేదు. తాజాగా ఆయన కుమార్తె సునీత కీలక వ్యాఖ్యలు చేశారు.
వివేకానంద రెడ్డి హత్య జరిగి ఆరేళ్లు అయినా.. న్యాయం జరగడం లేదని ఆయన కుమార్తె సునీత ఆవేదన వ్యక్తం చేశారు. ఒకరు తప్ప మిగిలిన నిందితులు అందరూ బయట తిరుగుతున్నారని.. ఈ కేసులో నిందితులకన్నా తామే ఎక్కువ శిక్ష అనుభవిస్తున్నామని వాపోయారు. ఇన్వెస్టిగేషన్, ట్రయల్‌లో లోపాలు జరిగాయని సునీత ఆరోపించారు.
ఇంకా న్యాయం జరగలేదు..
‘వివేకానంద రెడ్డి హత్యకు గురై ఆరేళ్లయింది. ఈ కేసులో ఇంకా మాకు న్యాయం జరగలేదు. సీబీఐ కోర్టులో ట్రయల్ కూడా ప్రారంభం కాలేదు. నిందితుల్లో ఒకరు తప్ప మిగిలిన వాళ్లంతా బయట తిరుగుతున్నారు. ఈ కేసులో సీబీఐ మళ్లీ దర్యాప్తు మొదలు పెడుతుందని ఆశిస్తున్నాం. సీబీఐ దర్యాప్తు ముందుకు సాగకుండా నిందితులు మేనేజ్ చేస్తున్నారని అనుమానం కలుగుతోంది. ఈ కేసులో సాక్షులు అనుమానాస్పద రీతిలో చనిపోతున్నారు. సాక్షుల వాంగ్మూలాలు వెనక్కి తీసుకోవాలని కొందరు బెదిరిస్తున్నారు’ అని సునీత ఆరోపించారు.
అసలేం జరిగింది..
2019 మార్చి 15న వైఎస్ వివేకానంద రెడ్డి పులివెందులలోని ఆయన ఇంట్లో హత్యకు గురయ్యారు. మొదట గుండెపోటు అనుకున్నా.. పోస్టుమార్టం నివేదికలో హత్య అని తేలింది. ఆయన శరీరంపై అనేక కత్తిపోట్లు గుర్తించారు. ప్రారంభంలో రాష్ట్ర ప్రభుత్వం సిట్ (ప్రత్యేక దర్యాప్తు బృందం)ను ఏర్పాటు చేసింది. కానీ తరువాత ఈ కేసును సీబీఐకి అప్పగించారు. దస్తగిరి అనే వ్యక్తి అప్రూవర్‌గా మారడంతో ఈ కేసులో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి.
అనుమానాస్పద మరణాలు..
ఈ కేసులో వైఎస్ అవినాష్ రెడ్డి, ఆయన తండ్రి భాస్కర్ రెడ్డిపై ఆరోపణలు వచ్చాయి. ఈ నేపథ్యంలో.. ఈ కేసులో అనుమానాస్పద మరణాలు చోటుచేసుకున్నాయి. సాక్షులుగా ఉన్న ఐదుగురు గత ఐదేళ్లలో అనుమానాస్పదంగా చనిపోయారు. వివేకానంద రెడ్డి హత్య కేసులో సాక్షులు, అనుమానితులైన కే.శ్రీనివాసులు రెడ్డి, డ్రైవర్ నారాయణ యాదవ్, కల్లూరి గంగాధర్ రెడ్డి, ఈసీ గంగిరెడ్డి, వైఎస్ అభిషేక్‌రెడ్డి, వాచ్‌మన్ రంగన్నలు మృతి చెందారు.
ఎన్నికల్లో ప్రభావం..
వివేకా హత్య వ్యవహారం.. 2019 ఎన్నికల్లో ప్రభావం చూపిందనే వాదన ఉంది. వైసీపీ అధికారంలోకి వచ్చాక.. నిందులను కాపాడే కుట్ర జరుగుతోందని.. వివేకా కుమార్తె సునీత పలుమార్లు ఆరోపించారు. ఆమె వాదనతో వైఎస్ షర్మిల ఏకీభవించారు. సునీతకు అండగా నిలిచారు. 2024 అసెంబ్లీ ఎన్నికల్లోనూ ఈ కేసు ప్రభావం కనిపించదనే కామెంట్స్ వినిపించాయి. జగన్ రాజకీయ ప్రత్యర్థులు వివేకా హత్యకేసును పాయింట్ చేస్తూ.. విమర్శలు గుప్పించారు.
టాపిక్