



Best Web Hosting Provider In India 2024

Bandi Sanjay : డ్రగ్స్ కు అడ్డా హైదరాబాద్, పాలకుల నిర్లక్ష్యంతోనే డ్రగ్స్ విక్రయం- కేంద్ర మంత్రి బండి సంజయ్
Bandi Sanjay : కాంగ్రెస్, బీఆర్ఎస్ రెండు ఒక్కటై బీజేపీని దెబ్బతీసేందుకు కుట్ర చేస్తున్నాయని కేంద్ర మంత్రి బండి సంజయ్ ఆరోపించారు. డీలిమిటేషన్ పై కేంద్రం ఇంకా ఏ నిర్ణయం తీసుకోనప్పటికీ బీజేపీని బదనాం చేసేందుకు కాంగ్రెస్, బీఆర్ఎస్ ప్రయత్నిస్తున్నాయని తెలిపారు.

Bandi Sanjay : హైదరాబాద్ డ్రగ్స్ కు అడ్డగా మారిందని కేంద్ర హోంశాఖ బండి సంజయ్ ఆరోపించారు. డ్రగ్స్ పై ప్రభుత్వం ఉక్కుపాదం మోపాలని డిమాండ్ చేశారు. డ్రగ్స్ కేసును సీబీఐకి అప్పగిస్తే కేంద్రం డ్రగ్స్ ను సమూలంగా నిర్మూలించే చర్యలు చేపడుతుందని స్పష్టం చేశారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ రెండూ ఒక్కటై బీజేపీని బదనాం చేసే కుట్ర చేస్తున్నాయని ఆరోపించారు.
కరీంనగర్ లో బేటి బచావో, బేటి పడావో కార్యక్రమం కింద ప్రభుత్వ పాఠశాలలో చదివే వంద మంది పిల్లలకు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కలెక్టర్ పమేలా సత్పతి, సీపీ గౌస్ ఆలంతో కలిసి సైకిళ్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం భేటీ బచావో బేటి పడావో తీసుకొచ్చిందన్నారు. కేంద్రం మహిళలకు ప్రాధాన్యత ఇవ్వడంతో మగవారితో సమానంగా మహిళలకు అవకాశాలు లభిస్తున్నాయని తెలిపారు.
ఆడపిల్ల లేని ఇల్లు శోభను, కళను, భరోసాను ఇవ్వలేవన్నారు. పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో 9వ తరగతి నుంచి టెన్త్ కు పోయే ప్రతి అమ్మాయికి ఎంపీ లాడ్స్ నుంచి సైకిల్ పంపిణీ చేస్తామని, ప్రతి హాస్టల్ కు సీఎస్ఆర్ నిధులతో వాషింగ్ మిషిన్ పంపిణీ చేస్తానని తెలిపారు. హైదరాబాద్ తర్వాత కరీంనగర్ లో ఉన్న స్పోర్ట్స్ స్కూల్ లో సౌకర్యాలు మెరుగు పర్చేందుకు సీఎస్ఆర్, ఎంపీ ల్యాండ్స్ కేటాయిస్తానని హామీ ఇచ్చారు.
చిన్న పిల్లలతో డ్రగ్స్ విక్రయాలు
ఇంజినీరింగ్ మెడికల్ డిగ్రీ కళాశాలలు డ్రగ్స్ అడ్డాలుగా మారి, చిన్నపిల్లలచే డ్రగ్స్ గంజాయి విక్రయిస్తున్నారని కేంద్ర మంత్రి బండి సంజయ్ ఆందోళన వ్యక్తం చేశారు. పాలకుల నిర్లక్ష్యం వల్లే డ్రగ్స్ గంజాయి విక్రయాలు జరుగుతున్నాయని ఆరోపించారు. డ్రగ్స్ అమ్మే వారిపై వారికి సహకరించే వారిపై కఠిన చర్యలు తీసుకునేలా పోలీసులకు స్వేచ్ఛ ఇవ్వాలని కోరారు. డ్రగ్స్ అనర్థాలకు దారి తీస్తుందన్నారు.
ఈ విషయాన్ని కొందరు రాజకీయంగా ఆలోచిస్తున్నారని, అనర్థాలకు దారి తీసే డ్రగ్స్ పై ప్రభుత్వం రాజకీయాలకు అతీతంగా ఆలోచించాలని కోరారు. ప్రభుత్వానికి చేతకాకుంటే సిబిఐ అప్పగిస్తే కేంద్ర చర్యలు తీసుకుంటుందన్నారు. డ్రగ్స్ పై ఇప్పటికే హైకోర్టులో పిల్ రెడీగా ఉందన్నారు. డ్రగ్స్ గంజాయి పై పాలకులు కాంగ్రెస్ అయినా బీజేపీ అయినా బీఆర్ఎస్ అయినా ఎవరు అధికారంలో ఉదాసీనంగా వ్యవహరించకుండా ఉక్కుపాదం మోపాలని కోరారు.
బీఆర్ఎస్ ను పెంచి బీజేపీని దెబ్బతీసే కుట్ర
కాంగ్రెస్, బీఆర్ఎస్ రెండు ఒక్కటై బీజేపీని దెబ్బతీసేందుకు కుట్ర చేస్తున్నాయని బండి సంజయ్ ఆరోపించారు. అందులో భాగమే జగదీశ్ రెడ్డి సస్పెన్షన్ అని స్పష్టం చేశారు. కరీంనగర్ లో మీడియాతో మాట్లాడిన కేంద్ర మంత్రి బండి సంజయ్, ఆ రెండు పార్టీలే రహస్య భేటీలు జరుపుతూ, డైవర్షన్ పాలిటిక్స్ కు పాల్పడుతున్నాయని ఆరోపించారు. డీలిమిటేషన్ పై కేంద్రం ఇంకా ఏ నిర్ణయం తీసుకోనప్పటికీ కేంద్రాన్ని బదనాం చేసేందుకు ఆ రెండు పార్టీలు ప్రయత్నిస్తున్నాయని తెలిపారు. డీలిమిటేషన్ పై ఎలాంటి నిర్ణయం జరిగినప్పుడు దక్షిణాధి రాష్ట్రాలకు అన్యాయం ఎలా జరుగుతుందని ప్రశ్నించారు. కేసీఆర్ ఇట్లనే అబద్ధాలు ప్రచారం చేస్తే ప్రజలు గద్దె దింపి ఫామ్ హౌస్ కు పరిమితం చేసిన విషయాన్ని గుర్తుంచుకోవాలని సూచించారు.
కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అతి త్వరలోనే ఇంటికి పంపించడం ఖాయమని జోస్యం చెప్పారు. 6 గ్యారంటీలపైన, ప్రజా సమస్యలపై చర్చించే దమ్ములేక ప్రజలను దృష్టి మళ్లించేందుకు పొలిటికల్ డ్రామా ఆడుతున్నారని విమర్శించారు. ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే ప్రజా సమస్యలపై అసెంబ్లీలో చర్చించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల 10 లక్షల ఎకరాల పంట ఎండిపోయిందని, అయినా ప్రభుత్వం పట్టింపులేని ధోరణితో వ్యవహరిస్తోందని విమర్శించారు. ఎండుతున్న పంటలకు కాపాడేందుకు, పంట నష్టపోయిన రైతులకు పరిహారం ఇచ్చి ఆదుకునే చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు.
గంగవ్వతో కేంద్ర మంత్రి బండి సంజయ్ భేటీ
జగిత్యాల జిల్లా మల్యాల మండలంలో పలు అభివృద్ధి పనులకు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ శంకుస్థాపన చేశారు. 1 కోటి 2 లక్షల వ్యయంతో నూతనంగా నిర్మించిన పలు సీసీ రోడ్లను పరిశీలించారు. మండలంలోని బల్వంతాపూర్ లో నిర్మించిన అంతర్గత సీసీ రోడ్డును ప్రారంభించారు. గంగాధర మండలంలోని పలు గ్రామాల్లో నిర్మించిన సీసీ రోడ్లను పరిశీలించారు. అందులో భాగంగా ఉప్పర మల్యాలలో నూతనంగా నిర్మించిన సీసీ రోడ్డును బండి సంజయ్ ప్రారంభించారు.
ఈ సందర్భంగా భారీ ఎత్తున స్థానికులు, బీజేపీ కార్యకర్తలు అక్కడికి తరలివచ్చారు. సంజయ్ తో కలిసి ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం బీజేపీ కార్యకర్తలతో కలిసి లంబాడీపల్లికి వెళ్ళిన బండి సంజయ్ అనంతరం స్థానికులతో కలిసి బీజేపీ కార్యకర్త నివాసంలో భోజనం చేశారు. లంబాడిపల్లికి చెందిన బిగ్ బాస్ సెలెబ్రెటీ గంగవ్వ ఇంటికి వెళ్ళారు బండి సంజయ్. గంగవ్వతో భేటీ అయి ఆమె యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ముత్యంపేటకు చేరుకుని హిందూ సామ్రాట్ ఛత్రపతి శివాజీ మహారాజ్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు.
రిపోర్టింగ్: కె.వి.రెడ్డి ఉమ్మడి కరీంనగర్ జిల్లా కరస్పాండెంట్ హిందుస్థాన్ టైమ్స్ తెలుగు.
సంబంధిత కథనం
టాపిక్