






Best Web Hosting Provider In India 2024

Kudumbasthan Review: 8 కోట్ల బడ్జెట్ – 30 కోట్ల కలెక్షన్స్ – తమిళ్ బ్లాక్‌బస్టర్ కామెడీ మూవీ ఎలా ఉందంటే?
Kudumbasthan Review: ఈ ఏడాది తమిళంలో అత్యధిక వసూళ్లను సాధించిన సినిమాల్లో ఒకటైన కుడుంబస్థాన్ ఇటీవలే జీ5 ఓటీటీలో రిలీజైంది. కామెడీ డ్రామాగా తెరకెక్కిన ఈ మూవీలో మణికందన్, శాన్వీ మేఘన హీరోహీరోయిన్లుగా నటించారు.

Kudumbasthan Review: మణికందన్, శాన్వీ మేఘన హీరోహీరోయిన్లుగా నటించిన కుడుంబస్థాన్ ఈ ఏడాది తమిళంలో హయ్యెస్ట్ కలెక్షన్స్ రాబట్టిన సినిమాల్లో ఒకటిగా నిలిచింది. కేవలం ఎనిమిది కోట్ల బడ్జెట్‌తో రూపొందిన ఈ మూవీ 28 కోట్లకుపైగా వసూళ్లను రాబట్టింది. కామెడీ డ్రామా కథాంశంతో తెరకెక్కిన ఈ మూవీకి రాజేశ్వర్ కళిస్వామి దర్శకత్వం వహించాడు. జీ5 ఓటీటీలో తెలుగులోనూ స్ట్రీమింగ్ అవుతోన్న ఈ మూవీ ఎలా ఉందంటే…
నవీన్ మిడిల్ క్లాస్ కష్టాలు…
నవీన్(మణికందన్) ఓ యాడ్ డిజైనింగ్ కంపెనీలో పనిచేస్తుంటాడు. వెన్నెలను(శాన్వీ మేఘన) ప్రాణంగా ప్రేమిస్తాడు. కులాలు వేరు కావడంతో నవీన్, వెన్నెల పెళ్లికి ఇరు కుటుంసభ్యులు ఒప్పుకోరు. పెద్దలకు తెలియకుండా స్నేహితుల సహకారంతో లేచిపోయిపెళ్లిచేసుకుంటారు. నవీన్ ఆదాయమే తమ కుటుంబానికి ఆధారం కావడంతో ఇష్టం లేకపోయినా వెన్నెలను తమ కోడలిగా అంగీకరిస్తారుఅతడి తల్లిదండ్రులు.
స్నేహితుడి కోసం జరిగిన చిన్న గొడవలో నవీన్ ఉద్యోగం పోతుంది. జాబ్ పోయిన సంగతి కుటుంబసభ్యుల దగ్గర దాచిపెడతాడు నవీన్. అప్పులు చేసి ఓ బేకరీ షాప్ ఓపెన్ చేస్తాడు. నవీన్ షాప్‌కు ఎదురుగా మరో పెద్ద బేకరీ ప్రారంభం కావడంతో అతడి బిజినెస్ దివాళా తీస్తుంది.
మరోవైపు అప్పుల వాళ్ల బాధ ఎక్కువైపోతుంది. ఈ సమస్యల వలయం నుంచి నవీన్ ఎలా గట్టెక్కాడు? వెన్నెలతో పాటు తల్లిదండ్రులపై కోపంతో దేశం వదిలి వెళ్లిపోవాలని ఎందుకు అనుకున్నాడు? నవీన్‌ను అతడి బావ రాజేంద్ర ఎలా టార్చర్ పెట్టాడు? అన్నదే కుడుంబస్థాన్ మూవీ కథ.
కథే హీరో…
సినిమాకు కథే హీరో కావాలి. సిట్యూవేషన్ నుంచే కామెడీ పుట్టాలి. అలాంటి సినిమాలే ఆడియెన్స్‌ను మెప్పిస్తాయి. ఎంటర్‌టైన్‌చేస్తాయి. కుడుంబస్థాన్ అందుకు బెస్ట్ ఎగ్జాంపుల్. అలాగని ఇదేం లార్జర్‌దేన్ లైఫ్ కథ కాదు. వందల కోట్లు పెట్టి తీసిన సినిమా అంతకంటే కాదు.
ఇరికించిన కామెడీ…
సాదాసీదా మధ్య తరగతి వ్యక్తి జీవితంలోని కష్టాలు, భాదలు, ప్రేమను ఈ మూవీలో చూపించాడు. గుండెబరువెక్కించే సెంటిమెంట్ సీన్స్, సందేశాలు గట్రా చూపించకుండా ఫస్ట్ సీన్ నుంచి శుభం కార్డు వరకు కడుపుబ్బా నవ్విస్తుంది సినిమా. కుడుంబస్థాన్‌లో కావాలనే ఇరికించిన కామెడీ, డబుల్ మీనింగ్ డైలాగ్‌లు, రొమాంటిక్ సీన్లు కనిపించవు. ఫ్యామిలీ మొత్తం చూసేలా చాలా క్లీన్ కామెడీతో ఈ మూవీ సాగుతుంది.
రాజేంద్ర…నవీన్ కాంబో…
నవీన్, వెన్నెల పెళ్లి సీన్‌తోనే సినిమా మొదలవుతుంది. నవీన్ ఫ్రెండ్స్ గ్యాంగ్ చేసే గందరగోళం, రిజిస్టర్ ఆఫీస్‌లోని గొడవ హిలేరియస్‌గా నవ్విస్తాయి. నవీన్, అతడి బావ రాజేంద్రన్ కాంబోలో వచ్చే ప్రతి సీన్ నుంచి ఫన్ బాగా వర్కవుట్ అయ్యింది. నవీన్ ఓటమిని, కష్టాలను చూసి రాజేంద్ర సంతోషపడటం, తన తప్పులు బావ ముందు బయటపడకుండా నవీన్ పడే తిప్పలు కామెడీని పంచుతాయి. నవీన్ స్నేహితుడితో పాటు తాగుబోతు గ్యాంగ్ బాగా వాడుకున్నాడు దర్శకుడు. వారు కనిపించే ప్రతి సీన్‌లో కామెడీ ఓ రేంజ్‌లో పండింది. రాజేంద్ర చైనీస్ పిచ్చితో అతడి భార్య పడే ఇబ్బందులు ఆకట్టుకుంటాయి.
సిట్యూవేషనల్ కామెడీ…
జేబులో డబ్బులు లేక చికెన్ కోసం హీరో కోడి పందాలకు వెళ్లడం, రౌడీ గ్యాంగ్ నుంచి తప్పించుకోవడానికి పబ్లిక్ టాయలెట్‌లో దాక్కోవడం..క్లైమాక్స్‌లో తాగుబోతు గ్యాంగ్ వేసే పంచ్‌లు …చాలా వరకు సిట్యూవేషనల్ కామెడీతోనే కథను దర్శకుడు ముందుకు తీసుకెళ్లిన తీరు బాగుంది. చివరలో డబ్బు ఉంటేనే మనిషికి వాల్యూ ఉంటుందనే ఓ చిన్న మెసేజ్‌ను షుగర్ కోటెడ్‌లా చూపించారు. ఫ్యామిలీ మెంబర్స్ మధ్య ఉన్న అపోహలు తొలగిపోయే సీన్‌ను ఫన్నీగానే రాసుకున్నాడు.
వన్ మెన్ షో…
కుడుంబస్థాన్ మూవీకి మణికందన్ వన్‌మెన్ షోగా నిలిచాడు. తన కామెడీ టైమింగ్‌తో ఆకట్టుకున్నాడు. ఓ హీరోలా కాకుండా నిజంగానే ఓ మిడిల్ క్లాస్ వ్యక్తిని చూసినట్లుగా నాచురల్‌గా అతడి నటన సాగింది. సినిమా మొత్తాన్ని తన భుజాలపై వేసుకొని పరుగులు పెట్టించాడు. రాజేంద్ర పాత్రలో గురుసోమసుందరం కామెడీ ఈ సినిమాకు హైలైట్‌గా నిలిచింది. వెన్నెల గా శాన్వీ మేఘన ఓకే. ఉన్నంతలో మెప్పించింది. హీరో ఫ్రెండ్స్ గ్యాంగ్ ప్రతి ఒక్కరూ తమ పాత్రలకు న్యాయం చేశారు. తాగుబోతుగా కనిపించే హీరో అన్నయ్యది చిన్న పాత్రే అయినా గుర్తుండిపోతుంది.
నాన్‌స్టాప్ కామెడీ…
కుడుంబస్థాన్…క్లీన్ కామెడీ డ్రామా మూవీ. రెండు గంటలు నాన్‌స్టాప్‌గా నవ్విస్తుంది.
సంబంధిత కథనం