Wife and Husband: మహబూబాబాద్‌లో భార్యాభర్తల మధ్య ఘర్షణ.. ఒకరిపై ఒకరు కత్తులతో దాడి.. భార్య మృతి.. భర్త పరిస్థితి విషమం..

Best Web Hosting Provider In India 2024

Wife and Husband: మహబూబాబాద్‌లో భార్యాభర్తల మధ్య ఘర్షణ.. ఒకరిపై ఒకరు కత్తులతో దాడి.. భార్య మృతి.. భర్త పరిస్థితి విషమం..

 

Wife and Husband: మహబూబాబాద్ జిల్లాలో దారుణం జరిగింది. తాగిన మైకంలో గొడవ పడిన భార్యాభర్తలు ఒకరిపై ఒకరు పదునైన కత్తితో దాడి చేసుకున్నారు. దీంతో క్షణికావేశానికి గురైన భర్త.. భార్య గొంతుకోయగా, ఆమె అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది.

 
మహబూబాబాద్‌లో మద్యం మత్తులో భార్యాభర్తల పరస్పర దాడి
 

Wife and Husband: మద్యం మత్తులో భార్యాభర్తలు ఒకరిపై దాడి చేసుకోవడంతో భార్య ప్రాణాలు కోల్పోయిన ఘటన మహబూబాబాద్‌లో జరిగింది. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన భర్త ఆసుపత్రిలో కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతున్నాడు. మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ మండలం హున్యా తండాలో ఆదివారం వెలుగులోకి వచ్చింది.

 

మహబూబాబాద్‌లో జరిగిన ఘటనపై స్థానికులు తెలిపిన ప్రకారం పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.. హున్యా తండాకు చెందిన భూక్య బుజ్జీ (44), భూక్య రాము (48) భార్యాభర్తలు. స్థానికంగా వ్యవసాయం, కూలీ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. వారికి ఒక కొడుకు, కూతురు ఉండగా.. కుమారుడైన అశోక్ హైదరాబాద్ లోని ఒక ప్రైవేటు సంస్థలో కార్మికుడిగా పని చేస్తుండగా.. కూతురు సౌందర్యను మహబూబాబాద్ జిల్లా గార్ల మండలం రాంపురం శివారులో ఉన్న పులిగడ్డ తండాకు చెందిన వ్యక్తికి ఇచ్చి వివాహం చేసి పంపించేశారు.

మద్యం మత్తులో గొడవ!

మహబూబాబాద్‌లో వ్యవసాయ, కూలీ పనులు చేసుకుంటూ బతికే భూక్య బుజ్జీ, రాము దంపతులు అన్యోన్యంగానే ఉండేవారని స్థానికులు చెబుతున్నారు. ఇద్దరు పిల్లల పెళ్లి చేసిన బుజ్జీ, రాము దంపతులు కాస్త.. కొద్దిరోజులుగా మద్యానికి అలవాటు పడ్డారు. అదే మద్యం మత్తులో గొడవ జరిగి ఒకరిపై ఒకరు దాడికి పాల్పడి ఉంటారనే అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

ఈ నెల 14, 15వ తేదీన తండాలో హోలీ సంబరాలు ఘనంగా నిర్వహించగా.. ఇద్దరూ అక్కడ సందడిగా గడిపారు. కాగా శనివారం సాయంత్రం ఇద్దరి మధ్య గొడవ జరగగా.. అప్పటికే మద్యం తాగి ఉన్న ఇద్దరూ ఇంట్లో ఉన్న పదునైన కత్తితో ఒకరిపై ఒకరు దాడికి పాల్పడ్డారు. దీంతో ఇద్దరికీ తీవ్ర గాయాలు అయ్యాయి.

 

అప్పటికే మద్యం మత్తులో ఉండటంతో క్షణికావేశానికి గురైన రాము అదే కత్తితో భార్య బుజ్జీ గొంతు కోశాడు. శనివారం అర్ధ రాత్రి ఈ ఘటన జరగగా.. ఎవరూ గమనించకపోవడంతో బుజ్జి తీవ్ర రక్త స్రావం జరిగి ప్రాణాలు కోల్పోయింది. ఇక రాము తీవ్ర గాయాలతో ఇంట్లోనే కుప్పకూలాడు.

రాము బయటకు రావడంతో వెలుగులోకి..

తీవ్ర గాయాలతో ఇంట్లో పడి పోయిన రాము రాత్రంతా అక్కడే ఉన్నాడు. ఆయన భార్య బుజ్జీ అక్కడే మృతి చెంది ఉండగా.. రాత్రంతా ఆయన స్పృహ కోల్పోయే ఉన్నాడు. కాగా ఆదివారం మధ్యాహ్నం రెండు గంటల సమయంలో తేరుకున్న ఆయన రక్త గాయాలతో బయటకు వచ్చాడు. దీంతో ఆయనను చూసిన స్థానికులు ఒక్కసారిగా షాక్ అయ్యారు.

అనంతరం ఇంట్లోకి వెళ్లి రక్తపు మడుగులో పడి ఉన్న బుజ్జీ మృతదేహాన్ని చూసి కంగుతిన్నారు. వెంటనే 108 అంబులెన్స్ కు సమాచారం ఇచ్చి, రామును ఆసుపత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న మహబూబాబాద్ డీఎస్పీ తిరుపతిరావు, సీఐ రాజేశ్ హుటాహుటిన హున్యా తండాకు చేరుకున్నారు. స్థానికులతో మాట్లాడి వివరాలు సేకరించారు.

అనంతరం మృతురాలి కూతురు సౌందర్యకు సమాచారం చేరవేశారు. సౌందర్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని, దర్యాప్తు జరుపుతున్నట్టు పోలీసులు వివరించారు.

 
 

Source / Credits

Best Web Hosting Provider In India 2024