Best Web Hosting Provider In India 2024

Medak Suicides: సిద్ధిపేటలో విషాదం.. గంటల వ్యవధిలో దంపతుల ఆత్మహత్య, అనాథలైన నలుగురు పిల్లలు
Medak Suicides: తీవ్ర ఆర్ధిక సమస్యలు పచ్చని కుటుంబం లో చిచ్చు రాజేసింది. నలుగురు పిల్లలున్న తల్లి తండ్రులు వారికి మంచి జీవితం ఇవ్వాల్సి ఉండగా, ఆర్ధిక సమస్యలు తాళలేక వారిని మధ్యలోనే విడిచి వెళ్లి పోయారు. ఈ విషాద సంఘటన సిద్దిపేట జిల్లా తొగుట మండలం ఎల్లారెడ్డి పేట గ్రామంలో జరిగింది.
Medak Suicides: సిద్ధిపేట జిల్లాలో దంపతుల ఆత్మహత్యలు కలకలం రేపాయి. దీంతో నలుగురు చిన్నారులు అనాథలుగా మారారు. జిల్లాలోని తొగుట మండలం ఎల్లారెడ్డి గ్రామానికి చెందిన కెమ్మసారం నాగరాజు (35), కు గుంట భూమి లేకపోవడంతో రెక్కల కష్టాన్ని నమ్ముకొని ట్రాక్టర్ డ్రైవర్ గా పనిచేస్తూ భార్య భాగ్య తో పాటు తమ పిల్లలు మీనాక్షి (9), మహేష్ (7), లక్కీ (5), శ్రవణ్ (4)లను పోషించుకునే వాడు.
సిద్దిపేట జిల్లాలో ఆర్థిక ఇబ్బందులతో దంపతులు ఆత్మహత్య చేసుకున్నారు. ఈ క్రమంలో చేతినిండా పనులు లేక పోవడం, పిల్లల ను సాకే పరిస్థితి లేకపోవడంతో, ఆదివారం రోజు మధ్యాహ్నం నాగరాజు భార్య భాగ్య (32) పురుగుల మందు సేవించగా సిద్దిపేట లోని ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించింది.
భార్య మరణం జీర్ణించుకోలేక……
భార్య మరణ వార్త జీర్ణించుకోలేక నాగరాజు సిద్దిపేట లోని సురక్ష హాస్పిటల్ సమీపంలో గల తుమ్మ చెట్ల చాటున పురుగుల మందు సేవించి ఆత్మహత్య చేసుకున్నాడు. గంటల వ్యవధిలో భార్య, భర్తలు ఇద్దరు తనువు చాలించడంతో వారి కుటుంబం లో తీరని విషాదం అలుముకుంది.
కంటికి రెప్పలా కాపాడాల్సిన తల్లి తండ్రులు కష్టాల సంసారాన్ని ఈదలేక.. తనువు చాలించడంతో..ఆ పిల్లలు వారు రెక్కలు తెగిన పక్షుల్లా విలపిస్తున్నారు. తల్లి తండ్రులు కోల్పోయి అనాధలుగా మారిన చిన్నారులను ఆదుకోవాలని ప్రభుత్వం తో పాటు మనసున్న మహారాజులను బంధువులు గ్రామ ప్రజలు కోరుతున్నారు.
నాగరాజు మొదటి భార్య కూడా ఆత్మహత్య చేసుకొని…
గ్రామస్తులు, బంధువుల కథనం ప్రకారం, నాగరాజు మొదటి భార్య కూడా ఆత్మహత్య చేసుకొని మరణించిందన్నారు. నాగరాజు, సుమారుగా 11 సంవత్సరాల క్రితం రేణుక అనే మహిళను వివాహం చేసుకోగా, వారికీ మీనాక్షి, మహేష్ అనే ఇద్దరు పిల్లలు కలిగారని తెలిపారు. అయితే, కుటుంబ సమస్యల వలన, రేణుక ఆరు సంవత్సరాల క్రితం ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నదని తెలిపారు.
కొద్ది నెలల వ్యవధిలోనే, నాగరాజు భాగ్యలక్ష్మిని రెండొవ వివాహం చేసుకున్నాడు. నాగరాజు కి గ్రామంలో చిన్న ఇల్లు తప్ప, ఎటువంటి భూములు లేకపోవటంతో, గ్రామంలోనే ట్రాక్టర్ డ్రైవర్ గా పనిచేస్తూ కుటుంబాన్ని పోషించుకునేవాడని తెలిపారు. ఈ క్రమంలో నాగరాజు, భాగ్యలక్ష్మికి లక్కీ, శ్రవణ్ లు జన్మించారు.
అప్పులు పెరిగి, తీర్చే మార్గం కనపడక……
నలుగురు పిల్లలను పోషించడం ఆర్ధికంగా భారంగా మారటంతో, నాగరాజు పలువురి వద్ద అప్పులు చేశాడు. అప్పులు తీర్చే మార్గం కనపడక, కుటుంబ అవసరాలకు డబ్బులు సంపాదించలేక తీవ్ర వత్తిడిలో ఆదివారం భాగ్య లక్ష్మి పురుగుల మందు తగి ఆత్మహత్య యత్నం చేయగా, తనను సిద్దిపేట లోని ఒక ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ, గంటల వ్యవధిలోనే మృతి చెందింది.
ఆ వార్త విన్న నాగరాజు దగ్గర్లోని పొదల్లోకి వెళ్లి అక్కడే పురుగులో మందు తాగి చనిపోయాడు. తల్లితండ్రులు ఇద్దరు, ఒకే రోజు మరణించడంతో నలుగురు పిల్లలు దిక్కులేని వారయ్యారు. వారికీ ఎటువంటి ఆస్తిపాస్తులు కూడా లేకపోవటంతో, మహిళా, శిశు సంక్షేమ శాఖ అధికారులు గ్రామానికి చేరుకొని విచారణ చేపట్టారు. చిన్నారుల సంరక్షణ బాధ్యలు ఎవరు తీసుకోకపోతే నలుగురు పిల్లలను కూడా శిశుగృహకు తరలించాలని భావిస్తున్నారు.
సంబంధిత కథనం
టాపిక్