



Best Web Hosting Provider In India 2024

AP Housing For Poor : ప్రభుత్వ స్థలాల్లో ఏళ్ల తరబడి నివాసం ఉంటున్న వారికి పట్టాలు, ఇలా దరఖాస్తు చేసుకోవాలి
AP Housing For Poor : ప్రభుత్వ స్థలాల్లో ఏళ్ల తరబడి నివాసం ఉంటున్న పేదలకు పట్టాలు ఇవ్వాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. పట్టాలు కావాలనుకున్న వారు గ్రామ, వార్డు సచివాలయాల్లో దరఖాస్తు చేసుకోవాలని ప్రభుత్వం తెలిపింది.

AP Housing For Poor : ప్రభుత్వ స్థలాలలో ఏళ్ల తరబడి నివాసం ఉంటున్న పేదలకు పట్టాలు ఇచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు జీవో నెంబర్ 30ను విడుదల చేసింది. పట్టాలు కావాలనుకుంటే గ్రామ, వార్డు సచివాలయాల్లో దరఖాస్తు చేసుకోవాలి. అలా దరఖాస్తు చేసుకున్నవారికి అధికారుల పరిశీలన తరువాత పట్టా ఇస్తారు.
2019 అక్టోబర్ 15 నాటికి గ్రామీణ ప్రాంతాల్లో బీపీఎల్‌కు దిగువన ఉన్న కుటుంబాలు అభ్యంతరం లేని ప్రభుత్వ స్థలాల్లో నిర్మించుకున్న ఇళ్లను క్రమబద్ధీకరించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీనికి సంబంధించి అన్ని జిల్లాల కలెక్టర్లకు ఆదేశాలు ఇచ్చింది. జిల్లా కలెక్టర్లు తహసీల్దార్లకు ఆదేశాలు ఇచ్చారు. తహసీల్దార్లు వీఆర్వోలతో అభ్యంతరం లేని ఆక్రమణలపై పరిశీలన చేయిస్తున్నారు. అలాగే తహసీల్దార్లు వీఆర్వోలు, గ్రామ, వార్డు సర్వేయర్లతో ఎప్పటికప్పుడు సమీక్షలు నిర్వహిస్తున్నారు.
ఆక్రమించుకున్న ప్రభుత్వ స్థలాల్లో నిర్మించుకున్న ఇళ్లలో ఏళ్ల తరబడి నివాసం ఉంటున్న కుటుంబాలను అధికారులు గుర్తిస్తున్నారు. అనంతరం నిబంధనల ప్రకారం అర్హులకు ఇళ్ల స్థలాలకు అధికారికంగా కన్వేయన్స్ డీడ్ మంజూరుకు సిద్ధం చేస్తున్నారు. పట్టణాల్లో రెండు సెంట్లు, గ్రామీణ ప్రాంతాల్లో మూడు సెంట్లు స్థలం ఇచ్చేలా అర్హులను గుర్తించేందుకు వీఆర్వోలు సర్వే చేస్తున్నారు. జీవితంలో ఒకేసారి ఉచిత ఇంటి పట్టా ఇచ్చేలా విధి విధానాలు రూపొందించారు.
అర్హులు
1. ప్రభుత్వ భూముల్లో ఆర్‌సీసీ, ఆస్బెస్టాస్ పై కప్పులు, ఇటుక గోడలతో నిర్మాణాలను పరిగణిస్తారు.
2. లబ్ధిదారుని కుటుంబంలో ఏ ఒక్కరికీ రాష్ట్రంలో సొంత ఇంటి స్థలం, ఇళ్లు ఉండకూడదు.
3. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ హౌసింగ్ స్కీమ్‌ల్లో లబ్ధిదారుగా ఉండకూడదు.
4. మహిళలు మాత్రమే క్రమబద్ధీకరణకు అర్హులు.
5. బీపీఎల్ కుటుంబ వార్షికాదాయం గ్రామీణ ప్రాంతాల్లో రూ.1.20 లక్షలు, పట్టణ ప్రాంతాల్లో రూ.1.44 లక్షలు మించకూడదు.
6. వ్యవసాయ భూమి 10 ఎకరాల లోపు ఉండాలి.
7. ఆదాయపు పన్ను చెల్లింపుదారులకు వర్తించదు.
8. నాలుగు చక్రాల సొంత వాహనం ఉండకూడదు.
9.150 గజాలు దాటితే డబ్బులు చెల్లించాలి
పరిశీలన తరువాత అర్హులకు 150 గజాల లోపు డి-పట్టా జారీ చేస్తారు. రెండేళ్ల తరువాత ఉచితంగా రిజిస్ట్రేషన్ చేస్తారు. పదేళ్ల కాలపరిమితితో ఫ్రీ హోల్డ్ హక్కులు కల్పించేలా కన్వేయన్స్ డీడ్ ఇస్తారు. 151 గజాలపైన ఉంటే, ఆ లబ్ధిదారులకు ప్రాథమిక భూమి విలువలో నిబంధనల ప్రకారం నిర్ణీత ధరకు కేటాయిస్తారు. రెండు నెలల్లో డబ్బులు ప్రభుత్వానికి చెల్లిస్తే లబ్ధిదారు పేరుతో ఆ భూమిని కేటాయిస్తారు.
దరఖాస్తు ఇలా చేసుకోవాలి
దరఖాస్తును గ్రామ, వార్డు సచివాలయాల్లో అవసరమైన పత్రాలు జత చేసి దరఖాస్తులు అందజేయాలి. ఆధార్ కార్డు, కరెంట్ బిల్లు, రేషన్ కార్డు తదితర సంబంధిత వాటి జిరాక్స్ కాపీలను దరఖాస్తుకు జత చేయాలి. వచ్చిన దరఖాస్తులపై వీఆర్‌వో, తహసీల్దారు, ఆర్డీవో విచారించి ఉన్నతాధికారులకు నివేదిస్తారు. జిల్లా అధికార కమిటీ తుది నిర్ణయం తీసుకుంటుంది. అప్పుడు దరఖాస్తు చేసుకున్న అర్హులకు పట్టాలు ఇస్తారు. అయితే దరఖాస్తు చేసుకోకపోతే మాత్రం, వాటిని ఆ స్థలాలను ఆక్రమణగా గుర్తించి తొలగిస్తారు. అందుకే అభ్యంతరం లేని ఆక్రమణ ఇళ్ల నిర్మాణాలు చేపట్టేవారు దరఖాస్తు చేసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం కోరుతుంది.
రిపోర్టింగ్ : జగదీశ్వరరావు జరజాపు, హిందుస్తాన్ టైమ్స్ తెలుగు
సంబంధిత కథనం
టాపిక్