ఆర్జీ కర్ కేసు: సీబీఐ దర్యాప్తు కోరుతూ హైకోర్టుకు వెళ్ళవచ్చన్న సుప్రీం కోర్టు

Best Web Hosting Provider In India 2024


ఆర్జీ కర్ కేసు: సీబీఐ దర్యాప్తు కోరుతూ హైకోర్టుకు వెళ్ళవచ్చన్న సుప్రీం కోర్టు

HT Telugu Desk HT Telugu
Published Mar 17, 2025 02:03 PM IST

కోల్‌కతా ఆర్జీ కర్ మెడికల్ కాలేజీలో అత్యాచారం, హత్యకు గురైన వైద్యురాలి కేసుకు సంబంధించి మరింత లోతైన దర్యాప్తునకు ఆదేశించాలని కోరుతూ బాధితురాలి తల్లిదండ్రులు దాఖలు చేసిన అప్పీలును సుప్రీం కోర్టు విచారించింది.

అత్యాచారం, హత్యకు గురైన ట్రైనీ డాక్టర్ జ్ఞాపకార్థం జూనియర్ డాక్టర్లు, సామాజిక కార్యకర్తలు 'క్రై ఆఫ్ ది అవర్' పేరుతో ఆమె విగ్రహానికి నివాళులు అర్పిస్తున్నప్పటి దృశ్యం
అత్యాచారం, హత్యకు గురైన ట్రైనీ డాక్టర్ జ్ఞాపకార్థం జూనియర్ డాక్టర్లు, సామాజిక కార్యకర్తలు ‘క్రై ఆఫ్ ది అవర్’ పేరుతో ఆమె విగ్రహానికి నివాళులు అర్పిస్తున్నప్పటి దృశ్యం (Hindustan Times/Samir Jana)

గత ఆగస్టులో కోల్‌కతాలోని ఆర్జీ కర్ మెడికల్ కాలేజ్‌లో అత్యాచారం, హత్యకు గురైన కేసులో బాధితురాలైన డాక్టర్ తల్లిదండ్రులు కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ) ద్వారా దర్యాప్తు చేయించాలని కోరేందుకు కలకత్తా హైకోర్టును ఆశ్రయించేందుకు సోమవారం సుప్రీం కోర్టు అనుమతి ఇచ్చింది.

ఈ కేసులో ప్రధాన నిందితుడు సంజయ్ రాయ్‌కు జనవరి 20న సీల్డహ్ సెషన్స్ కోర్టు జీవిత ఖైదు విధించినప్పటికీ, మరికొంతమంది పాత్రను నిర్ధారించడానికి తల్లిదండ్రులు మరింత లోతైన దర్యాప్తు కోరారు. సీనియర్ అడ్వకేట్ కరుణ నంది వారి తరపున అభ్యర్థించారు. ఈ వ్యవహారంలో సుప్రీం కోర్టు జోక్యాన్ని కోరారు. కానీ న్యాయస్థానం వారు హైకోర్టును సంప్రదించడం సముచితమని భావించింది. అక్కడ సీబీఐ రాయ్‌కు మరణశిక్ష విధించాలని డిమాండ్ చేస్తూ దాఖలు చేసిన అప్పీల్ కూడా నడుస్తోంది.

సెప్టెంబర్‌లో సీబీఐ ఈ కేసును దర్యాప్తు చేసింది. సీల్డహ్ కోర్టు తీర్పు తర్వాత, ఆ శిక్షను వ్యతిరేకిస్తూ సీబీఐ హైకోర్టుకు వెళ్ళింది. నిందితుడికి మరణశిక్ష విధించాలని విన్నవించింది.

సుప్రీం కోర్టులోని కేసులో సీనియర్ అడ్వకేట్ కరుణ నంది బాధితురాలి తల్లిదండ్రుల తరఫున వాదించారు. సొలిసిటర్ జనరల్ ఆఫ్ ఇండియా తుషార్ మెహతా సీబీఐ తరఫున వాదించారు.

ఇంకా మరణ ధృవీకరణ పత్రం రాలేదు

సంఘటన జరిగిన ఏడు నెలలకు పైగా అయినప్పటికీ, కుటుంబానికి ఇంకా ఆమె మరణ ధృవీకరణ పత్రం రాలేదని, దాని కోసం ఎంతో కష్టపడుతున్నామని బాధితురాలి తండ్రి గత వారం తెలిపారు.

ఆరోగ్య శాఖ ప్రధాన కార్యాలయం, ఆసుపత్రి, కోల్‌కతా మునిసిపల్ కార్పొరేషన్‌కు చెందిన సంబంధిత అధికారులు వారికి సహకరించడం లేదని ఆరోపించారు.

“మా కూతురి మరణ ధృవీకరణ పత్రం ఇంకా మాకు రాలేదు. ధృవీకరణ పత్రం కోసం మేం వెళ్ళినప్పుడల్లా వివిధ శాఖల అధికారులు మమ్మల్ని వేధిస్తున్నారు. మరణ ధృవీకరణ పత్రం ఇవ్వడం నిబంధనలకు వ్యతిరేకమని వారు చెబుతున్నారు,” అని ఆ తండ్రి పీటీఐకి తెలిపారు.

ఆరోగ్య మంత్రి కూడా అయిన ముఖ్యమంత్రి మమతా బెనర్జీ లేదా కోల్‌కతా మేయర్ ఫిర్హాద్ హకిమ్‌కు కూడా ఈ విషయం తెలియదనిపిస్తోందని ఆయన అన్నారు.

Whats_app_banner

సంబంధిత కథనం

జాతీయ, అంతర్జాతీయ తాజా వార్తలను మన తెలుగు హిందుస్తాన్ టైమ్స్ న్యూస్ సైట్‌లోని జాతీయ అంతర్జాతీయ సెక్షన్‌లో చూడవచ్చు.

Best Web Hosting Provider In India 2024


Source link