







Best Web Hosting Provider In India 2024

Ponman Review: బంగారం, డబ్బు కాపురాలను నిలబెడతాయా? – బాసిల్ జోసెఫ్ ప్రయోగం – మలయాళం మూవీ పొన్‌మాన్ ఎలా ఉందంటే?
Ponman Review: బాసిల్ జోసెఫ్ హీరోగా నటించిన మలయాళం మూవీ పొన్‌మాన్ తెలుగులో జియో హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. ప్రస్తుతం ఓటీటీలో ట్రెండింగ్‌లో ఉన్న ఈ మలయాళం మూవీ కథ ఏంటంటే?

Ponman Review: సూక్ష్మదర్శిని ఫేమ్ బాసిల్ జోసెఫ్ హీరోగా నటించిన మలయాళం మూవీ పొన్‌మాన్ జియో హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. డ్రామా థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ మూవీలో సాజిన్ గోపు, లిజోమోల్ జోస్ కీలక పాత్రలు పోషించారు. జోతిష్ శంకర్ దర్శకత్వం వహించాడు. ఓటీటీలో తెలుగులో రిలీజైన ఈ మూవీ ఎలా ఉందంటే?
బంగారం కష్టాలు…
అజేష్ (బాసిల్ జోసెఫ్) బంగారం సేల్స్ ఏజెంట్‌గా పనిచేస్తుంటాడు. పెళ్లిళ్లకు అవసరమైన బంగారాన్ని ముందుగా సర్ధుబాటు చేస్తుంటాడు. పెళ్లిళ్లలో చదివింపుల ద్వారా బంగారానికి సరిపడా వచ్చే డబ్బు తీసుకోవడమే అతడి వృత్తి. రిస్క్ ఎక్కువే ఉన్నా కుటుంబపరిస్థితుల కారణంగా జాబ్‌లో కొనసాగుతుంటాడు.
బ్రూనో ఓ పొలిటికల్ పార్టీ కార్యకర్తగా పనిచేస్తుంటాడు. చెల్లి స్టెఫీ (లిజోమోల్ జోస్) పెళ్లి కోసం అజేష్ దగ్గర 25 సవర్ల బంగారం తీసుకుంటాడు బ్రూనో. ఓ గొడవ కారణంగా పొలిటికల్ పార్టీ పెద్దలు ఎవరూ స్టెఫీ పెళ్లికి రారు. అజేష్ దగ్గర తీసుకున్న బంగారంలో సగమే చదివింపుల రూపంలో వస్తాయి. చదివింపుల డబ్బు పోగా… మిగిలిన సగం బంగారం తనకు కావాలని అజేష్ పట్టుపడతాడు.
ఆలోపు స్టెఫీ అత్తారింటికి వెళ్లిపోతుంది. స్టెఫీ భర్త మరియానో (సాజిన్ గోపు) తనది అనుకునే దాని కోసం ఎంతకైనా తెగిస్తాడు. అజేష్ బంగారం సంగతి అతడికి తెలిసిపోతుంది. ఆ బంగారంతన సొంతం అనుకుంటాడు. బంగారం కోసం వచ్చిన అజేష్‌ను కత్తితో పొడుస్తాడు. ఆ తర్వాత ఏం జరిగింది? తన బంగారం కోసం మరియానోతో అజేష్ ఎలాంటి పోరాటం చేశాడు? పార్టీని నమ్మి బ్రూనో ఎలా మోసపోయాడు? స్టేఫీ తన తప్పును ఎలా తెలుసుకుంది? అన్నదే ఈ మూవీ కథ.
మనసును బరువెక్కించే…
వైవిధ్యతకు, ప్రయోగాలకు మలయాళం సినీ పరిశ్రమ పెట్టింది పేరు. థ్రిల్లర్, మిస్టరీ సినిమాలే కాదు…అప్పుడప్పుడు మనసును బరువెక్కించే కథాంశాలతో మలయాళంలో సినిమాలు వస్తుంటాయి. పొన్‌మాన్ అలాంటి మూవీనే.
పరిస్థితులు…
ఈ సినిమాలో హీరోలు, విలన్లు ఎవరూ ఉండరు. పరిస్థితులు మనిషిని ఎలా మారుస్తాయి, చిన్న చిన్న సమస్యలకే కొందరు పిరికివారిగా మారిపోయి ప్రాణాలు తీసుకోవాలని అనుకుంటే…మరికొందరు మాత్రం ఎలా ధైర్యంగా పోరాడుతుంటారన్నది దర్శకుడు జ్యోతిష్ శంకర్ ఆలోచనాత్మకంగా చూపించాడు.
తమ అవసరం తీరిన తర్వాత చేసిన సాయాన్ని మార్చిపోయి కొందరు ఎలా స్వార్థంగా ఆలోచిస్తుంటారని, అలాంటి మనుషుల వల్ల తలెత్తే అనర్థాలు ఏమిటన్నది చూపించిన విధానం ఆకట్టుకుంటుంది.
బంగారమేనా…
కట్నకానుకలు, లాంఛనాల విషయంలో ఉన్న అపోహలను కొత్త యాంగిల్‌లో ఈ మూవీలో చూపించాడు దర్శకుడు. బంగారం, డబ్బు మాత్రమే కాపురాలను నిలబెట్టలేవనే మెసేజ్‌ను ఈ మూవీ చాటిచెబుతుంది. అమ్మాయిలకు బంగారం కంటే వారి వ్యక్తిత్వం, ఆలోచన విధానం, మంచితనమే నిజమైన అభరణాలుగా ఉపయోగపడతాయని దర్శకుడు పోన్‌మాన్ ద్వారా చెప్పారు డైరెక్టర్.
30 నిమిషాలకే క్లారిటీ….
పొన్‌మాన్ క్లైమాక్స్ ఏమిటన్నది సినిమా మొదలైన 30 నిమిషాలకే అర్థమైపోతుంది. స్టెఫీ పెళ్లి కోసం తాను ఇచ్చిన బంగారాన్ని అజీష్ ఎలా తిరిగి సొంతం చేసుకుంటున్నాడు…అసలు ఏం జరుగబోతుంది అన్న ఉత్కంఠతో ఆడియెన్స్‌ను ఎదురుచూసేలా చేశాడు. క్రూర మనస్తత్వం ఉన్న బలవంతుడైన మరియానో, బలహీనుడైన అజీష్…వాళ్లిద్దరు ఒకరిపై మరొకరు వేసే ఎత్తులు…పై ఎత్తులతో సినిమా థ్రిల్లింగ్‌ను పంచుతుంది.
పాటలు ఫైట్లు….
రెగ్యులర్ కమర్షియల్ సినిమాల్లో కనిపించే ఫైట్లు, పాటలు, రొమాంటిక్ సీన్లు సినిమాలు ఎక్కడ కనిపించదు. బాసిల్ జోసెఫ్‌తో పాటు మిగిలిన క్యారెక్టర్లు కూడా కథకు అనుగుణంగా సాగుతాయి. ప్రత్యేకంగా హీరో మాదిరిగా ఎవరికి ఎలివేషన్లు ఇవ్వలేదు. లోకేషన్లు చాలా భిన్నంగా సెలెక్ట్ చేసుకున్నాడు డైరెక్టర్.
పొలిటికల్ మాయలో…
బాసిల్ జోసెఫ్ కెరీర్‌లో మరో డిఫరెంట్ క్యారెక్టర్‌ను పోన్‌మాన్‌లో చేశాడు. అజీష్ పాత్ర తప్ప ఎక్కడ అతడి ఇమేజ్ కనిపించదు. తన బంగారం కోసం చివరి వరకు పోరాడే యువకుడి పాత్రలో జీవించాడు. స్టేఫీగా లిజోమోల్ జోస్ క్యారెక్టర్ భిన్న వేరియేషన్స్‌తో సాగుతుంది.
నెగెటివ్‌తో పాటు మొదలై పాజిటివ్‌గా ఆమె క్యారెక్టర్‌ను ఎండ్ చేశాడు డైరెక్టర్ మరియానోగా సాజిన్ గోపు గెటప్‌తోనే భయపెట్టాడు. కుటుంబం కోసం స్వార్థంతో ఆలోచించే వ్యక్తిగా విలనిజం ఛాయలతో కూడిన పాత్రలో అతడి నటన ఆకట్టుకుంటుంది బ్రూనో క్యారెక్టర్ ద్వారా పొలిటికల్ పార్టీల మాయలో పడి యువత తమ జీవితాలను ఎలా నాశనం చేసుకుంటున్నారనే సందేశాన్ని ఇచ్చారు.
మంచి ప్రయత్నం….
పొన్‌మాన్ రెగ్యులర్ కమర్షియల్ సినిమాలకు భిన్నమైన ఓ మంచి ప్రయత్నం. థ్రిల్లింగ్‌ను పంచుతూనే ఆలోచింపచేస్తుంది. బాసిల్ జోసెఫ్ యాక్టింగ్ కోసం ఈ మూవీని చూడొచ్చు.
సంబంధిత కథనం