




Best Web Hosting Provider In India 2024
Telangana Tourism : తెలంగాణ ఖ్యాతి విశ్వవ్యాప్తం.. 3 లక్షల ఉద్యోగ అవకాశాలు కల్పించడమే ప్రధాన లక్ష్యం!
Telangana Tourism : తెలంగాణలో టూరిజం రూపురేఖలు మార్చడమే ధ్యేయంగా.. గత డిసెంబర్లో కొత్త పాలసీని రూపొందించారు. కొన్ని మార్పులు, చేర్పులతో ఫైనల్ చేసిన ఈ పాలసీకి.. ఇటీవల కేబినెట్ ఆమోదం తెలిపింది. తాజాగా తెలంగాణ టూరిజం పాలసీ జీవోను రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది.
తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రూ.15 వేల కోట్ల పెట్టుబడులను ఆకర్షించడం.. 3 లక్షల ఉద్యోగ అవకాశాలు కల్పించడం ప్రధాన లక్ష్యంగా.. కొత్త టూరిజం పాలసీని తీసుకొచ్చింది. 2025 నుంచి 2030 వరకు ఐదేళ్ల పాటు ఇది అమలులో ఉండనుంది. పర్యాటక ప్రాజెక్టులు ప్రారంభించేవారిని ప్రోత్సహించడం, అవసరమైతే భూములను లీజుకు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది..
ప్రత్యేక పోర్టల్..
ప్రత్యేక టూరిజం పోర్టల్‌ను అందుబాటులోకి తీసుకురావాలని ప్రభుత్వం యోచిస్తోంది. తెలంగాణ చరిత్ర, పర్యాటక ప్రాంతాల వివరాలు ఇందులో పొందుపరచనున్నారు. ప్రకృతి, పర్యావరణ, చారిత్రక ప్రదేశాలు, వాటర్ ఫాల్స్, పురాతన కట్టడాలు, ప్రముఖ ఆలయాలు, స్మారక చిహ్నాలు ఎక్కడెక్కడ ఉన్నాయి.. రవాణా సౌకర్యం, భోజన వసతి, పండుగలు, కళలు, తెలంగాణ సంస్కృతి వంటి సమస్త సమాచారం కూడా అందుబాటులో ఉంచేలా రూపొందిస్తున్నారు.
టాప్ 5 లోకి తెలంగాణ..
జాతీయ, అంతర్జాతీయ పర్యాటకుల రాకపోకల్లో తెలంగాణను టాప్ 5 రాష్ట్రాల్లో నిలపడానికి ఈ చర్యలు తీసుకుంటున్నట్టు తెలుస్తోంది. అలాగే రాష్ట్ర జీడీపీలో టూరిజం వాటాను 10 శాతానికి పైగా పెంచడం లక్ష్యంగా పెట్టకున్నారు. రాష్ట్రంలో ఇప్పటివరకు టూరిస్టు పాలసీ లేదని, స్పష్టమైన విధానం, నిర్దిష్టమైన యాక్షన్‌ప్లాన్‌తో అంతర్జాతీయ గుర్తింపును తీసుకొచ్చేలా పాలసీని రెడీ చేసినట్టు మంత్రి జూపల్లి కృష్ణారావు వివరించారు.
తెలంగాణ ఖ్యాతి విశ్వవ్యాప్తం..
రూ.15 వేల కోట్ల పెట్టుబడులను ఆకర్షించడం, అంతర్జాతీయ స్థాయిలో టూరిజం అభివృద్ధి చేయడం, తెలంగాణ ఖ్యాతిని విశ్వవ్యాప్తం చేయడం, ఉపాధి అవకాశాలను కల్పించడమే లక్ష్యంగా కొత్త పాలసీని తీసుకొచ్చినట్లు మంత్రి జూపల్లి వివరించారు. సీఎం రేవంత్ రెడ్డి దిశానిర్దేశంలో ఇలాంటి ఆచరణాత్మక విధానం రూపకల్పనలో పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రిగా క్రియాశీలక భూమికను పోషించడం సంతోషంగా ఉందని వ్యాఖ్యానించారు.
పెట్టుబడుల ఆకర్షణే లక్ష్యంగా..
ఈ పాలసీలో భాగంగా.. ఆధ్యాత్మిక, వారసత్వ, సాంస్కృతిక, సాహసక్రీడలు, మెడికల్, వెల్నెస్, ఎకో-టూరిజం వంటి వివిధ రంగాలపై దృష్టి సారించనున్నారు. రాష్ట్రంలో 27 పర్యాటక ప్రాంతాలను ప్రభుత్వం గుర్తించి.. వాటిని యుద్ధ ప్రాతిపదికన అభివృద్ధి చేయనుంది. పర్యాటక రంగంలో మల్టీ నేషనల్ కంపెనీల (ఎంఎన్సీ) పెట్టుబడులను ఆకర్షించేలా పాలసీ ఉందని నిపుణులు చెబుతున్నారు. ఈ పాలసీ 2025 నుంచి 2030 వరకు ఐదేళ్ల పాటు అమల్లో ఉంటుంది.
సంబంధిత కథనం
టాపిక్