






Best Web Hosting Provider In India 2024
Sunita Williams : 8 రోజులని వెళ్లి- 9 నెలలు! సునితా విలియమ్స్ రాక ఎందుకు ఆలస్యమైంది?
Sunita Williams return : సునితా విలియమ్స్, బుచ్ విల్మోర్లు ఇంకొన్ని గంటల్లో భూమి మీద అడుగుపెట్టనున్నారు. అసలు వీరు స్పేస్‌లో ఇన్ని నెలలు ఎందుకు ఉండిపోవాల్సి వచ్చింది? వీరిని తీసుకొచ్చేందుకు ఎన్ని ప్రయత్నాలు జరిగాయి? ఇక్కడ తెలుసుకోండి..

9 నెలల పాటు ఐఎస్ఎస్లో చిక్కుకున్న వ్యోమగాములు సునితా విలియమ్స్, బుచ్ విల్మోర్లు ఎట్టకేలకు భూమికి బయలుదేరారు. ఐఎస్ఎస్కి వీడ్కోలు పలికి, మరో ఇద్దరు వ్యోమగాములతో కలిసి వీరిద్దరు క్రూ-9లో భూమికి తిరిగివస్తున్నారు. ఇంతకి, వీరు 9 నెలల పాటు అంతరిక్షంలో ఎందుకు ఉండిపోవాల్సి వచ్చింది? వీరిని భూమి మీదకు తీసుకొచ్చేందుకు ఎలాంటి ప్రయత్నాలు జరిగాయి?
వ్యోమగాములు ఐఎస్ఎస్లో ఎలా చిక్కుకున్నారు?
8 రోజుల మిషన్‌లో భాగంగా సునితా విలియమ్స్, బుచ్ విల్మోర్లు బోయింగ్ రూపొందించిన సరికొత్త స్టార్‌లైనర్ క్యాప్సూల్‌లో జూన్ 5న అంతరిక్షంలోకి వెళ్లారు. కానీ అదే క్యాప్సూల్‌లో సమస్యల కారణంగా వారు అనుకున్న సమయానికి తిరిగి రాలేకపోయారు.
ఐఎస్ఎస్కి వెళ్లిన తర్వాత వ్యోమగాములు స్టార్‌లైనర్‌ని పరీక్షించారు. థ్రస్టర్స్లోని టెఫ్లాన్ సీల్స్‌లో సమస్యలు కనిపించాయి. అవి దెబ్బతిన్నట్టు అర్థమైంది. ఈ విషయం నాసాకి వెల్లడించారు. ఆ క్యాప్సూల్‌లో వ్యోమగాములు భూమికి తిరిగి రావడం ప్రమాదకరమని భావించింది నాసా. ఫలితంగా.. సునితా విలియమ్స్, బుచ్ విల్మోర్లను వదిలేసి, స్టార్‌లైనర్ ఖాళీగా భూమికి తిరిగి వచ్చింది.
అంతరిక్షంలో చిక్కుకున్న అస్ట్రోనాట్స్ని తీసుకొచ్చేందుకు అధికారులు పనిచేస్తున్నప్పటికీ, చాలా కాలం పాటు పురోగతి కనిపించలేదు. చివరికి, వారిని తీసుకొచ్చే బాధ్యతలను స్పేస్ఎక్స్కి అప్పగించింది నాసా.
ఈ మధ్యలో క్రూ-9లో భాగంగా మరో ఇద్దరు వ్యోమగాములు గతేడాది సెప్టెంబర్‌లో ఐఎస్ఎస్కి వెళ్లారు. క్రూ-9లో రెండు సీట్లు ఖాళీగా ఉంచారు. ఇందులోనే ఇప్పుడు సునితా విలియమ్స్, బుచ్ విల్మోర్లు తిరిగివస్తున్నారు.
నాసా బాధ్యతలు అప్పగించడంతో అందరి చూపు స్పేస్ఎక్స్ క్రూ-10 మిషన్‌పై పడింది. కానీ ఇది కూడా చాలా రోజుల పాటు వాయిదా పడుతూ వచ్చింది. ఫలితంగా అంతరిక్షంలో సునితా విలయమ్స్ ఇంకా ఎక్కువ సమయం గడపాల్సి వచ్చింది.
ఐఎస్ఎస్కి అతిథులుగా వెళ్లిన ఇద్దరు వ్యోమగాములు.. అక్కడ ఫుల్‌టైమ్ స్టేషన్ క్రూగా మారిపోయారు. ఐఎస్ఎస్లో అనేక పరిశోధనలు చేశారు. పరికరాలను ఫిక్స్ చేశారు. 62 గంటల పాటు 9 స్పేస్‌వాక్స్ చేశారు విలియమ్స్. ఇదొక రికార్డ్‌గా మారింది.
కాగా వాస్తవానికి ఫిబ్రవరిలో క్రూ-10 లాంచ్ అవ్వాల్సి ఉంది. కానీ ఒక నెల పాటు వాయిదా పడింది. ఈ మధ్యలో, ఈ పూర్తి వ్యవహారంపై రాజకీయ దుమారం రేగింది. అమెరికా మాజీ అధ్యక్షుడు బైడెన్.. రాజకీయ కారణాలతో వ్యోమగాములను ఐఎస్ఎస్లో వదిలేసినట్టు ప్రస్తుతు అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, స్పేస్ఎక్స్ సీఈఓ ఎలాన్ మస్క్ ఆరోపించారు. వ్యోమగాములను తాము భూమి మీదకు తీసుకొస్తామని హామీనిచ్చారు.
ఫిబ్రవరి నాటికి స్పేస్ఎక్స్ క్యాప్సూల్ సిద్ధమవ్వలేదు. అందుకే దానిని మరొక క్యాప్సూల్‌తో రిప్లేస్ చేశారు. ఫలితంగా క్రూ-10 లాంచ్ కొన్ని వారాల ముందుకు వచ్చింది.
చివరికి మార్చ్ 12న మిషన్ లాంచ్‌కి అంతా రెడీ అయ్యింది. కానీ చివరి నిమిషంలో, సాంకేతిక లోపం కారణంగా మిషన్‌ని రద్దు చేశారు. మళ్లీ నిరాశ! సునితా విలియమ్స్ రాకపై మళ్లీ ఉత్కంఠ.
తిరుగు ప్రయాణం..
ఇక అమెరికా కాలమానం ప్రకారం మార్చ్ 14న ఐఎస్ఎస్లో సునితా విలియమ్స్, బుచ్ విల్మోర్తో పాటు స్పేస్ఎక్స్ క్రూ-9లోని ఇద్దరు సభ్యులను భర్తీ చేసేందుకు క్రూ-10 మిషన్ ఐఎస్ఎస్కు బయలుదేరింది.
ఇప్పుడు, భారత కాలమానం ప్రకారం మార్చ్ 18 ఉదయం 10 గంటల 30 నిమిషాల సమయంలో క్రూ-9లో సునితా విలియమ్స్, బుచ్ విల్మోర్తో పాటు మరో ఇద్దరు వ్యోమగాములు భూమికి బయలుదేరారు.
భారత కాలమానం ప్రకారం మార్చ్ 19, బుధవారం ఉదయం 8 గంటల 30 నిమిషాల ప్రాంతంలో వీరందరు ఫ్లోరిడా తీరం వద్ద నీటిలో దిగుతారు. అయితే, ఇందుకు వాతావరణం సహకరించాలి!
సంబంధిత కథనం
Best Web Hosting Provider In India 2024
Source link