






Best Web Hosting Provider In India 2024

TG Sanna Biyam Distribution : శ్రీమంతులు తినే సన్నబియ్యం పేదలు తినే రోజులు వచ్చాయ్- సీఎం రేవంత్ రెడ్డి
TG Sanna Biyam Distribution : రేషన్ కార్డుదారులకు సన్నబియ్యం పంపిణీ కార్యక్రమాన్ని సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారు. సూర్యపేట జిల్లా హుజూర్ నగర్ లో ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఏప్రిల్ నుంచి రేషన్ కార్డుదారులకు సన్నబియ్యం పంపిణీ చేయనున్నారు.పేదలు సన్నబియ్యం తినే రోజులొచ్చాయని సీఎం అన్నారు.

TG Sanna Biyam Distribution : తెలంగాణ ప్రభుత్వం మరో ప్రతిష్టాత్మక కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. రేషన్ కార్డుదారులకు సన్నబియ్యం పంపిణీ కార్యక్రమాన్ని సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రారంభించారు. సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ లో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు, ఎమ్మెల్యేలతో కలిసి లబ్దిదారులకు సన్నబియ్యం అందించారు. ఏప్రిల్ నెల నుంచి రేషన్ దుకాణాల్లో కార్డుదారులకు సన్నబియ్యం పంపిణీ చేయనున్నారు. దాదాపు 10 లక్షల కొత్త రేషన్‌కార్డులు జారీ చేయనున్నట్లు సీఎస్ శాంతికుమారి ప్రకటించారు. సన్నబియ్యం పంపిణీతో రాష్ట్ర ప్రభుత్వంపై రూ.2800 కోట్ల అదనపు భారం పడుతుందని తెలిపారు.
శ్రీమంతులు తినే సన్నబియ్యం పేదలకు
ఉగాది పండుగ రోజున సన్నబియ్యం పంపిణీని ప్రారంభించడం ఎంతో సంతోషకంగా ఉందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. శ్రీమంతులు తినే సన్నబియ్యం పేదలు కూడా తినే రోజులు వచ్చాయన్నారు. రూ.1.90 లకే పేదలకు కిలో బియ్యం అందించాలని ముందుగా కోట్ల విజయ్‌భాస్కర్‌రెడ్డి భావించారన్నారు. ఎన్నికల తర్వాత ప్రభుత్వం మారడంతో రూ.2 కిలో బియ్యం పథకాన్ని దివంగత ఎన్టీఆర్ ప్రారంభించారని గుర్తుచేశారు. పేదలకు బియ్యం ఇచ్చేందుకు 1957 లోనే కాంగ్రెస్ పార్టీ రేషన్ షాపులు ప్రారంభించిందన్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వం ఉచితంగా ప్రజలకు సన్నబియ్యం ఇస్తుందని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. రేషన్ దుకాణాల్లో ఉచితంగా వచ్చిన బియ్యాన్ని ప్రజలు రూ.10కి అమ్ముకుంటుంటే..మిల్లర్లు వాటిని కొనుగోలు చేసి రీసైక్లింగ్ చేసి మళ్లీ ప్రజలకు రూ.50కు అమ్ముతున్నారన్నారు. పేదల నుంచి రేషన్ బియ్యాన్ని కొన్న మిల్లర్లు కోట్లలో దందా చేస్తున్నారని అన్నారు. ప్రజల ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుండడంతో సన్న బియ్యం వైపు మొగ్గుచూపుతున్నారన్నారు. ప్రజల ఆకాంక్షను అర్థం చేసుకుని రేషన్ కార్డులపై సన్నబియ్యం పంపిణీకి శ్రీకారం చుట్టామని తెలిపారు.
దొడ్డు బియ్యంతో రూ.10 వేల కోట్ల దోపిడీ
“పండగ నాడే కాదు ప్రతిరోజూ పేదలకు తెల్ల అన్నం తినాలనే నా ఆకాంక్ష. పేదలకు ఆహార భద్రత కోసమే రేషన్ వ్యవస్థ ఉంది. పీడీఎస్‌ను 70 ఏళ్ల క్రితమే కాంగ్రెస్ అమలు చేసింది. దీనిని టీడీపీ వ్యవస్థాపక అధ్యక్షుడు ఎన్టీఆర్ కొనసాగించారు. దొడ్డు బియ్యం ఇస్తే వాటిని చాలా మంది అమ్ముకుంటున్నారు. పేదలు దొడ్డు బియ్యం తినడం లేదు. మిల్లర్ల మాఫియాలోకి ఈ దొడ్డు బియ్యం వెళ్తుంది. దొడ్డు బియ్యంతో ఏటా రూ.10 వేల కోట్ల దోపిడీ జరుగుతోంది” -సీఎం రేవంత్ రెడ్డి
సంబంధిత కథనం
టాపిక్