




Best Web Hosting Provider In India 2024
IPL 2025 HCA vs SRH: టికెట్ల కోసం హెచ్‌సీఏ బ్లాక్ మెయిల్.. హైదరాబాద్ నుంచి వెళ్లిపోతామంటున్న సన్ రైజర్స్! ఏం జరిగిందంటే?
IPL 2025 HCA vs SRH: హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్‌సీఏ) సృష్టించిన అన్ ప్రొఫెషనల్ వాతావరణం కారణంగా సన్‌రైజర్స్ హైదరాబాద్ వేరే చోటుకు మారాలని ఆలోచిస్తోంది. హైదరాబాద్ లో కాకుండా వేరే నగరంలో మ్యాచ్ లు ఆడాలని చూస్తోంది.

పాట్ కమిన్స్ నాయకత్వంలోని సన్‌రైజర్స్ హైదరాబాద్ తమ హోమ్ వెన్యూను మార్చాలని ఆలోచిస్తోంది. ఫ్రీ టికెట్ల కోసం హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్‌సీఏ) టాప్ ఆఫీస్ బేరర్స్ బ్లాక్ మెయిల్ చేయడాన్ని సన్‌రైజర్స్ హైదరాబాద్ ఫ్రాంఛైజీ తట్టుకోలేకపోతుందని తెలిసింది. దీని వలన ఫ్రాంచైజీ తమ మిగిలిన హోమ్ మ్యాచ్‌లను ఎక్కడ ఆడాలనే దానిపై పునరాలోచన చేస్తోంది.
వైరల్ గా ఈమెయిల్
‘టైమ్స్ ఆఫ్ ఇండియా’ రిపోర్ట్ ప్రకారం సన్‌రైజర్స్ హైదరాబాద్ జనరల్ మేనేజర్ శ్రీనాథ్ టీబీ.. హెచ్‌సీఏ కోశాధికారి సీజే శ్రీనివాస్ రావు కు ఈ మెయిల్ పంపించాడు. ఈ ఈ-మెయిల్ వైరల్ గా మారింది.
“హెచ్‌సీఏ, ముఖ్యంగా హెచ్‌సీఏ ప్రెసిడెంట్ చేస్తున్న ఈ అన్ ప్రొఫెషనల్ బెదిరింపులు, చర్యలు.. మీ స్టేడియంలో సన్‌రైజర్స్ ఆడాలని కోరుకోవడం లేదని స్పష్టం చేస్తున్నాయి. అలా అయితే మాకు రాతపూర్వకంగా తెలియజేయండి. ఈ విషయాన్ని బీసీసీఐ, తెలంగాణ ప్రభుత్వం, మా మేనేజ్ మెంట్ కు తెలియజేస్తాం. వేరే వెన్యూకు మారాలనే మీ కోరిక ప్రకారమే మేం ఇక్కడి నుంచి వెళ్లిపోతాం’’ అని టైమ్స్ ఆఫ్ ఇండియా రిపోర్ట్ ప్రకారం మెయిల్ లో శ్రీనాథ్ తెలిపారు.
లాస్ట్ సీజన్ నుంచే
“గత 12 సంవత్సరాలుగా మేము హెచ్‌సీఏతో కలిసి పనిచేస్తున్నాము. కానీ గత సీజన్ నుంచే హెచ్‌సీఏ నుంచి నిరంతర సమస్యలు, వేధింపులు ఎదుర్కొంటున్నాం. ఈ అన్ ప్రొఫెషనల్ ప్రవర్తన మాకు ఇబ్బందికర వాతావరణాన్ని క్రియేట్ చేస్తోంది’’ అని ఆ మెయిల్ లో శ్రీనాథ్ పేర్కొన్నారు.
నివేదికల ప్రకారం.. సన్ రైజర్స్, ఎల్ఎస్జీ మధ్య మ్యాచ్ రోజున ఓ బాక్స్ ను హెచ్‌సీఏ లాక్ చేయడంతో ఫ్రాంఛైజీ, హెచ్‌సీఏ మధ్య తీవ్రమైన గొడవ జరిగినట్లు తెలిసింది.
ఆ టికెట్ల కోసం
“అనేక సంవత్సరాలుగా 3,900 ఫ్రీ టిక్కెట్లలో భాగంగా కు హెచ్‌సీఏకు 50 టిక్కెట్లు (F12A బాక్స్) కేటాయించబడ్డాయి. అయితే ఈ ఏడాది మీరు బాక్స్ సామర్థ్యాన్ని 30 మాత్రమే అని చెబుతున్నారు. వేరే బాక్స్‌లో అదనంగా 20 ఉచిత టిక్కెట్లను అడుగుతున్నారు. ఇది మా దృష్టికి వచ్చినప్పుడు, మేము చర్చిస్తామని, పరస్పరం అనుకూలమైన పరిష్కారానికి వస్తామని చెప్పాం’’ అని ఆయన మెయిల్‌లో రాశారు.
“స్టేడియంకు మేము సరైన అద్దె చెల్లిస్తున్నామని, ఐపీఎల్ టైమ్ లో స్టేడియం మా అధికార పరిధిలో ఉంటుందని గమనించండి. కానీ గత మ్యాచ్ లో మీరు ఎఫ్3 బాక్స్‌ను లాక్ చేసి, మీకు అదనంగా 20 ఉచిత టిక్కెట్లు ఇవ్వకపోతే తెరవడానికి నిరాకరించారు. ఈ అన్ ప్రొఫెషనల్ ప్రవర్తన వైరుధ్యపూరిత వాతావరణాన్ని సృష్టిస్తుంది. సహకారం మరింత క్లిష్టంగా మారుతుంది’’ అని శ్రీనాథ్ పేర్కొన్నారు.
10 శాతం
“ఇలా బెదిరించడం ఫస్ట్ టైమ్ కాదు. గత రెండు సంవత్సరాలలో హెచ్‌సీఏ నుండి మా సిబ్బందికి ఇలాంటి బెదిరింపులు వచ్చాయి. హెచ్‌సీఏ అధ్యక్షుడు ఈ ఏడాది ముందుగానే అనేక బెదిరింపులు చేశారు. ఇది హెచ్‌సీఏ దృష్టికి కూడా తీసుకొచ్చాం’’ అని మెయిల్‌లో శ్రీనాథ్ పేర్కొన్నారు.
“హెచ్‌సీఏ నిరంతర బెదిరింపులు, బలవంతపు చర్యలు, బ్లాక్‌మెయిలింగ్‌ను బట్టి మనమందరం ఒప్పందం ప్రకారం వెళ్దాం అని మేము సూచిస్తున్నాం. దాని ప్రకారం మేము ప్రతి స్టాండ్‌లో 10 శాతం ఫ్రీ టిక్కెట్లను కేటాయిస్తాం. ఈ విషయాన్ని చర్చించి పరిష్కరించడానికి వీలైనంత త్వరగా కౌన్సిల్ సభ్యులతో సమావేశం నిర్వహించాలని అధికారికంగా కోరుతున్నాం” అని మెయిల్‌లో శ్రీనాథ్ స్పష్టం చేశారు.
ప్రస్తుతం జరుగుతున్న 18వ ఎడిషన్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ ఇప్పటివరకు హైదరాబాద్‌లో రెండు మ్యాచ్‌లు ఆడింది.
హెచ్‌సీఏ ఏం చెప్పిందంటే
సన్‌రైజర్స్ హైదరాబాద్ యాజమాన్యం అధికారిక ఈమొయిల్స్ నుంచి హెచ్‌సీఏ అధికారిక ఈమొయిల్స్‌కు ఎలాంటి మొయిల్స్ రాలేదని హెచ్‌సీఏ చెబుతోంది.
‘‘సోషల్ మీడియాలో, కొన్ని వెబ్‌సైట్లలో ప్రచారమవుతున్న వార్తల్లో వాస్తవం లేదు. ఒకవేళ నిజంగానే ఈమొయిల్స్ వచ్చుంటే, ఆ సమాచారం హెచ్‌సీఏ లేదా ఎస్ఆర్‌హెచ్ అధికారిక ఈమొయిల్స్ నుంచి కాకుండా గుర్తు తెలియని ఈమొయిల్స్ నుంచి లీక్ చేయడం వెనుకున్న కుట్ర ఏంటి? హెచ్‌సీఏ-ఎస్ఆర్‌హెచ్ ప్రతిష్టను మసకబార్చేందుకు కొందరు పనిగట్టుకొని చేస్తున్న దుష్ప్రచారం ఇది’’ అని హెచ్‌సీఏ అధ్యక్ష కార్యాలయం ఓ ప్రకటనలో తెలిపింది.
సంబంధిత కథనం
Best Web Hosting Provider In India 2024
Source link