IIIT Allahabad : పుట్టినరోజే జీవితం ముగిసింది.. అలహాబాద్ ఐఐఐటీలో తెలంగాణ విద్యార్థి సూసైడ్.. కారణాలు ఏంటి?

Best Web Hosting Provider In India 2024


IIIT Allahabad : పుట్టినరోజే జీవితం ముగిసింది.. అలహాబాద్ ఐఐఐటీలో తెలంగాణ విద్యార్థి సూసైడ్.. కారణాలు ఏంటి?

Basani Shiva Kumar HT Telugu
Published Mar 31, 2025 12:19 PM IST

IIIT Allahabad : అతని పేరు రాహుల్. జీవితంపై ఎన్నో ఆశలతో ఉన్నత చదువుల కోసం అలహాబాద్ ఐఐఐటీలో చేరాడు. బాగా చదివేవాడు. కానీ.. ఏమైందో తెలియదు. తన పుట్టినరోజు నాడే తల్లికి ఆఖరి మెసేజ్ పంపాడు. తండ్రిని, తమ్ముడిని బాగా చూసుకో అంటూ.. తనువు చాలించాడు. అతని సూసైడ్‌కు కారణాలు ఏంటో ఇప్పుడు చూద్దాం.

రాహుల్ (ఫైల్ ఫొటో)
రాహుల్ (ఫైల్ ఫొటో)

అలహాబాద్ ఐఐఐటీలో తీవ్ర విషాదం జరిగింది. విద్యార్థి పుట్టినరోజు విషాదంలో ముగిసింది. తల్లికి మెసేజ్ పంపిన తర్వాత అతను ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడు తెలంగాణలోని నిజామాబాద్‌కు చెందిన రాహుల్ చైతన్య మాదాలగా గుర్తించారు. మార్చి 30న ఆదివారం రాత్రి రాహుల్ హాస్టల్ ఐదవ అంతస్తు నుంచి దూకాడు. పెద్ద శబ్దం రావడంతో అక్కడున్న వారు గమనించి రాహుల్‌ను ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రికి తీసుకెళ్లే లోపే రాహుల్ చనిపోయాడు. దీంతో అతని మృతదేహాన్ని పోస్ట్‌మార్టం కోసం స్వరూప్ రాణి నెహ్రూ ఆసుపత్రి తరలించారు.

జేఈఈలో రెండో ర్యాంక్..

జేఈఈలో రాహుల్‌కు 2వ ర్యాంకు వచ్చింది. అతను అలహాబాద్ ఐఐఐటీలో చేరాడు. కానీ.. అతనికి వినికిడి, మాట్లాడే లోపం ఉంది. ఈ కారణంగా రాహుల్ తోటి విద్యార్థులతో కలిసి ఉండటానికి ఇబ్బంది పడేవాడు. ఈ క్రమంలోనే రాహుల్ తన తల్లికి మెసేజ్ పంపాడు. చదువులో ఒత్తిడితో బాధపడుతున్నానని.. తమ్ముడు, తండ్రితో సహా కుటుంబాన్ని కూడా జాగ్రత్తగా చూసుకోవాలని కోరాడు.

ఆరు పేపర్లలో ఫెయిల్..

అయితే.. రాహుల్ సూసైడ్ చేసుకోవడానికి విద్యా సంస్థే కారణమని విద్యార్థులు ఆరోపించారు. రాహుల్ మొదటి సెమిస్టర్‌లో ఆరు పేపర్లలో ఫెయిల్ అయ్యాడని, దీనివల్ల అతను ఆందోళనకు గురై సూసైడ్ చేసుకోవచ్చని అలహాబాద్ ఐఐఐటీ అధికారులు చెబుతున్నారు. అతను నెలల తరబడి క్లాసులకు హాజరు కావడం లేదని అంటున్నారు.

భయపడి కాల్ చేశా..

‘రాహుల్ మెసేజ్ చూసి నేను భయపడి అతనికి కాల్ చేశాను. కానీ అతని ఫోన్ ఆఫ్‌లో ఉంది. తర్వాత నేను అతని స్నేహితుడికి ఫోన్ చేశాను. అతను రాహుల్ గురించి తెలుసుకోవడానికి వెళ్లాడు. రాహుల్ స్నేహితుడు అటుగా వెళ్తున్న మరో విద్యార్థిని.. రాహుల్ ఎక్కడ ఉన్నాడని అడిగాడు. ఆ తర్వాత అతను కాల్ డిస్‌కనెక్ట్ చేశాడు. 10 నిమిషాల తర్వాత నాకు ఫోన్ చేసి, రాహుల్‌ను ఆసుపత్రికి తీసుకెళ్తున్నానని చెప్పాడు’ అని రాహుల్ తల్లి రోధిస్తూ చెప్పింది.

కమిటీ ఏర్పాటు..

ఈ ఘటనపై నిజ నిర్ధారణ కోసం ప్రొఫెసర్ యుఎస్ తివారీ, ప్రొఫెసర్ ఓపి వ్యాస్, ప్రొఫెసర్ పవన్ చక్రవర్తిలతో కూడిన ముగ్గురు సభ్యుల కమిటీని ఏర్పాటు చేసినట్లు.. ఇనిస్టిట్యూట్ డైరెక్టర్ ఇన్‌చార్జ్ ప్రొఫెసర్ జీసీ నంది వివరించారు. ఈ కమిటీ వారం రోజుల్లో నివేదిక ఇస్తుందని.. ఆ తర్వాత పూర్తి వివరాలు వెల్లడిస్తామని చెప్పారు. కమిటీ సభ్యుల్లో 50 శాతం మంది విద్యార్థులు ఉంటారు.

Basani Shiva Kumar

eMail
Whats_app_banner
జాతీయ, అంతర్జాతీయ తాజా వార్తలను మన తెలుగు హిందుస్తాన్ టైమ్స్ న్యూస్ సైట్‌లోని జాతీయ అంతర్జాతీయ సెక్షన్‌లో చూడవచ్చు.

Best Web Hosting Provider In India 2024


Source link