Karthika Deepam 2 Today April 1: రమ్యను తీసుకొచ్చిన దీప.. వణికిపోయిన జ్యోత్స్న.. నమ్మకం లేదన్న శివన్నారాయణ

Best Web Hosting Provider In India 2024

Karthika Deepam 2 Today April 1: రమ్యను తీసుకొచ్చిన దీప.. వణికిపోయిన జ్యోత్స్న.. నమ్మకం లేదన్న శివన్నారాయణ

Chatakonda Krishna Prakash HT Telugu
Published Apr 01, 2025 07:42 AM IST

Karthika Deepam 2 Today April 1: కార్తీక దీపం 2 నేటి ఎపిసోడ్‍లో.. రమ్యను దీప కలుస్తుంది. గౌతమ్ గురించి జ్యోత్స్న కుటుంబానికి చెప్పాలని అడుగుతుంది. దీపను శ్రీధర్ ఫాలో అవుతాడు. శివన్నారాయణ ఇంటికి రమ్యను దీప తీసుకొస్తుంది. జ్యోత్స్న భయపడుతుంది. పూర్తిగా ఏం జరిగిందో ఇక్కడ చూడండి.

Karthika Deepam 2 Today April 1: రమ్య తీసుకొచ్చిన దీప.. వణికిపోయిన జ్యోత్స్న.. నమ్మకం లేదన్న శివన్నారాయణ
Karthika Deepam 2 Today April 1: రమ్య తీసుకొచ్చిన దీప.. వణికిపోయిన జ్యోత్స్న.. నమ్మకం లేదన్న శివన్నారాయణ

కార్తీక దీపం 2 నేటి ఏప్రిల్ 1వ తేదీ ఎపిసోడ్‍లో ఏం జరిగిందంటే.. గౌతమ్ చేతిలో మోసపోయిన రమ్య అడ్రెస్‍ను దీప సంపాదిస్తుంది. ఆ అమ్మాయి పేరు రమ్య.. మణికొండ కొత్తపేటలో ఉంటుంది.. ఎలాగైనా పట్టుకోవాలని వేగంగా నడిచివెళుతుంటుంది దీప. ఇంతలో ఓ కారు ఆమె ముందు వచ్చి ఆగుతుంది. దాంట్లో నుంచి శ్రీధర్ దిగుతాడు. వంటలక్క గారు.. ఏంటి అంత హడావుడిగా వెళుతున్నారు.. ఎవరిదైనా పెళ్లి చెడగొట్టాలా, పచ్చని సంసారంలో పెట్రోల్ పోసి తగలబెట్టాలా అంటూ వెటకారంగా మాట్లాడతాడు శ్రీధర్. అంతే గట్టిగా బదులిస్తుంది దీప.

దీపను ఫాలో అయిన శ్రీధర్

మనిషిని మోసం చేయడం తప్పు.. నమ్మించి మోసం చేయడం పాపం.. ఈ రెండు మీరు చేశారు అని శ్రీధర్‌కు కౌంటర్ వేస్తుంది దీప. నా జీవితం, నా కొడుకు జీవితం, నా మేనకోడలు జీవితం నాశనం చేశావ్.. నాకు ఉన్న శత్రువు నువ్వే అంటూ నానా మాటలు అంటాడు శ్రీధర్. కొన్నింటికి సమాధానం చేతులతో చెబితేనే బాగా అర్థమవుతుందని దీప అంటుంది. కొడతావా ఏంటి అని శ్రీధర్ అంటాడు. దీప కూడా దీటుగా మాటలు తిప్పికొడుతుంది.

గౌతమ్ మీద వేసిన నింద నిజమంటావా అని శ్రీధర్ అంటే.. అవును, నిరూపిస్తానని దీప చెబుతుంది. అక్కడి నుంచి వెళుతుంది. అసలు దీప ఈ ఏరియా ఉందేంటి.. ముందు ఈవిడను ఫాలో అవుదామని శ్రీధర్ అనుకుంటాడు. దీపను కారులో ఫాలో అవుతాడు.

దీప కనిపించడం లేదు

సమ్మర్ హాలీడేస్‍కు ఎక్కడికైనా వెళదామా అంటూ కాంచనతో శౌర్య అంటూ ఉంటుంది. నా చేతులతో అమ్మ చెంపపై కొట్టుకుంది.. అమ్మ ఏమైనా తప్పు చేసిందా అని శౌర్య అడుగుతుంది. ఏ తప్పు చేయలేదని కాంచన చెబుతుంది. ఇంతలో కార్తీక్ ఇంటికి వస్తాడు. అమ్మను ఓసారి పిలువు అని శౌర్యకు కార్తీక్ చెబుతాడు. ఇద్దరూ కలిసే రెస్టారెంట్‍కు వెళ్లారు కదరా అని కాంచన అడుగుతుంది. దీప ఇంటికి కూడా రాలేదంట అని కార్తీక్ మనసులో అనుకుంటాడు. స్కూల్ బస్ వస్తుందేమో బయటికి వెళ్లు అని శౌర్యతో కార్తీక్ చెబుతాడు. బాయ్ చెప్పి వెళుతుంది శౌర్య.

ఎందుకు అంత టెన్షన్ పడుతున్నావని కార్తీక్‍ను కాంచన అడుగుతుంది. దీప కనిపించడం లేదమ్మా అని కార్తీక్ చెబుతాడు. దీప ఏమైందని కాంచన అంటే.. తన కోసమే వెతుకుతున్నానని బదులిస్తాడు కార్తీక్. ఏమైందని కాంచన అడుగుతుంది. తాత శివన్నారాయణ రెస్టారెంట్‍కు వచ్చి దీపను తిట్టిన విషయాన్ని కార్తీక్ చెబుతాడు. మనవరాలు ఏడుస్తుందంట.. దీపను ఏడిపించడానికి వచ్చాడని చెబుతాడు. దీప ఫోన్ కూడా కలవట్లేదని కార్తీక్ అంటాడు. అయితే దీప ఎక్కడికి వెళ్లిందిరా అని కాంచన కంగారు పడుతుంది.

రమ్యను కలిసిన దీప

రమ్య ఇంటి అడ్రెస్ వెతుక్కుంటూ వెళుతుంది దీప. ఇంతలో రోడ్డుపైనే రమ్య కనిపిస్తుంది. ఎవరో గుర్తు పట్టావా అని రమ్యను దీప అడుగుతుంది. గౌతమ్‍ను దీప నిలదీసిన విషయాన్ని రమ్య గుర్తు తెచ్చుకుంటుంది. వాడిని ఇంకా గౌతమ్ బాబు అంటావేంటి.. నీలాగే వాడు చాలా మంది అమ్మాయిల జీవితాలను నాశనం చేశాడని దీప చెబుతుంది. పెళ్లి చేసుకొని మరో అమ్మాయి జీవితాన్ని నాశనం చేయాలనుకుంటున్నాడని అంటుంది. అది జరగకుండా నేను ఆపానని చెబుతుంది.

రమ్యను ఒప్పించిన దీప

గౌతమ్ గురించి నిజం చెప్పాలని రమ్యను అడుగుతుంది దీప. వద్దక్కా అని రమ్య అంటుంది. రమ్యను ఒప్పించేందుకు దీప మాట్లాడుతూ ఉంటుంది. వీరిని దూరం నుంచి కారులో ఉండే శ్రీధర్ చూస్తాడు. ఈ అమ్మాయితో దీపకు పనేంటి అని అనుకుంటాడు. పద రమ్య.. వాడు ఎలాంటి వాడో మనం అందరికీ చెప్పాలి అని దీప అంటుంది. వద్దక్కా.. వాడు చంపేస్తాడు అని రమ్య భయపడుతుంది. “మన భయమే వాడికి బలం. మనం తెగిందే వాడి ముగింపు. మరో ఆడపిల్లకు అన్యాయం జరగకుండా అడ్డుకోవాలి” అని దీప చెబుతుంది. దీంతో రమ్య ఒప్పుకుంటుంది. సంచి ఇంట్లో పెట్టి వస్తానని అంటుంది.

శ్రీధర్ ఫోన్.. భయంలో జ్యోత్స్న

నిశ్చితార్థంలో వేసిన నిందకు, ఈ అమ్మాయికి ఏమైనా బంధం ఉందా అని శ్రీధర్ అనుకుంటాడు. ఇంతలో అత్త పారిజాతానికి ఫోన్ చేయాలని అనుకుంటాడు. కాల్ చేస్తాడు. తాత మాటలను దీప మరిచిపోయే ముందే మరో దెబ్బ కొట్టాలని జ్యోత్స్న ఆలోచిస్తూ ఉంటుంది. అయితే, శ్రీధర్ కాల్ చేస్తే పారిజాతం ఫోన్‍ను జ్యోత్స్న లిఫ్ట్ చేస్తుంది. “జ్యోత్స్న నిశ్చితార్థాన్ని దీప చెడగొట్టినా ఏమీ చేయలేకపోయారు. దీప మాత్రం ఏదో చేసేటట్టు ఉంది. చిన్న పని మీద మణికొండ వస్తే అక్కడ కనపడింది. ఫాలో అయితే.. ఎవరో అమ్మాయిని కలిసి వెంట తీసుకెళ్లింది. ఈ అమ్మాయే గౌతమ్ గాడి ఫిగరేమోనని నా డౌట్” అని శ్రీధర్ చెబుతాడు. శ్రీధర్ మాటలతో జ్యోత్స్న వణికిపోతుంది.

దీపకు సాక్ష్యం దొరికినట్టుంది

సరే నేను దీపను ఫాలో అవుతా.. నా కొడుకు జీవితం నుంచి ఈ దరిద్రాన్ని తరిమిసే వరకు నిద్రపోను అని శ్రీధర్ అంటాడు. దీపకు సాక్ష్యం దొరికినట్టుందని మనసులో భయపడుతుంది జ్యోత్స్న. నేను ఇంత మాట్లాడుతుంటే మీరే మాట్లాడరే అని శ్రీధర్ అడుగుతాడు. ఇంతలో థాంక్యూ మామయ్య అని జ్యోత్స్న అంటుంది. జ్యోత్స్నా నువ్వా అని శ్రీధర్ అంటాడు. ఇంతలో కాల్ కట్ చేస్తుంది జ్యోత్స్న. దీపను ఫాలో అవుతాదమని శ్రీధర్ అనుకుంటాడు.

రమ్యను శివన్నారాయణ ఇంటికి తీసుకొచ్చిన దీప

“నా టార్గెట్ నువ్వే దీప.. నువ్వు ఏ సాక్ష్యంతో వస్తావో రా. నేను సిద్ధమై ఉంటా. ఈసారి దెబ్బ సాలిడ్‍గా ఉంటుంది. నన్ను ఎవరూ ఆపలేరు” అని అనుకుంటుంది జ్యోత్స్న. ఇంతలో రమ్యను శివన్నారాయణ ఇంటికి తీసుకొస్తుంది దీప. “నీకేం భయం లేదు, ప్రేమ పేరుతో నిన్ను మోసం చేసినవాడే.. పెళ్లి పేరుతో ఈ ఇంటి ఆడపిల్లను మోసం చేయాలనుకుంటున్నాడు. నువ్వు వాడు ఎలాంటి వాడో బయటపెట్టాలి. నువ్వు ఏం జరిగిందో చెప్పు చాలు. మిగిలింది నేను చూసుకుంటా” అని దీప చెబుతుంది. అలాగే అక్క అని అంటుంది రమ్య. దీపను పారిజాతం చూస్తుంది. నేను దీపకు బుద్ధి చెప్పా, మీరెందుకు రెస్టారెంట్ దగ్గరికి వెళ్లారని శివన్నారాయణను సుమిత్ర అడుగుతుంది. ఎంత మంది చెప్పినా.. ఆవిడలో మార్పు రాదని.. కావాలంటే అటు చూడండి అని రమ్యను తీసుకొస్తున్న దీపను చూపిస్తుంది పారిజాతం.

సాక్ష్యం ఈ అమ్మాయే

రమ్యను అందరి ముందుకు దీప తీసుకొస్తుంది. ఇంకోసారి మా ఇంటికి రావొద్దని చెప్పాను కదా అని సుమిత్ర అరుస్తుంది. సాక్ష్యం తీసుకొచ్చానని, నిజాన్ని నిరూపించేందుకు వచ్చానని దీప చెబుతుంది. ఈ అమ్మాయి ఎవరని శివన్నారాయణ అడిగితే.. గౌతమ్ ఎలాంటి వాడో నిరూపించేందుకు సాక్ష్యం అని దీప చెబుతుంది. “ఈ అమ్మాయి నోరు తెరిస్తే.. ఈ ఇంట్లో నేను క్రియేట్ చేసుకున్న సింపతీ బ్లాస్ట్ అవుతుంది” అని మనసులో కంగారు పడుతుంది జ్యోత్స్న.

నిజం చెప్పిన దీప

అంటే ఇప్పుడు ఈ అమ్మాయి చెప్పింది మేం నమ్మాలా అని శివన్నారాయణ అంటాడు. నమ్మాలి తాతయ్యగారు.. ఎందుకంటే గౌతమ్ మోసం చేసింది ఈ అమ్మాయినే అని దీప చెబుతుంది. “ప్రేమించాను. పెళ్లి చేసుకుంటానని అన్నాడు. మూడు ముళ్లు వేయకుండానే మూడు నెలల తల్లిని చేశాడు. ఎదురుతిరిగితే డబ్బుతో కొనాలని అనుకున్నాడు” అని దీప చెబుతుంది.

నాటకాలు బాగానే వేస్తున్నావ్

శభాష్.. వంటలే బాగా చేస్తావనుకున్నా.. నాటకాలు కూడా బాగానే వేస్తున్నావ్ అని అంటూ దీప చెప్పిన నిజాన్ని శివన్నారాయణ నమ్మడు. నిందను నిరూపించడం చాలా కష్టమని దీప అంటుంది. నా నిజాయితీని నిరూపించుకునే సాక్ష్యంతోనే వచ్చానని దీప అంటుంది. పారిజాతం వెటకారంగా మాట్లాడుతుంది. ముందు దీప, ఆ అమ్మాయి చెప్పేది విందామని దశరథ్ అంటాడు. ఇది నిజమేనని చెబితే దీప దేవత అవుతుంది, దీన్ని ఎలా ఆపాలి అని జ్యోత్స్న కంగారు పడుతుంది.

ఎలా మోసం చేశాడో చెప్పు.. జ్యోత్స్నకు చెమటలు

చెప్పు దీప, ఇది నీకు చివరి అవకాశం.. నువ్వు ఏం చెప్పాలనుకుంటున్నావో చెప్పు అని దశరథ్ అంటాడు. నిజం చెప్పాలని రమ్యను దీప అడుగుతుంది. గౌతమ్ ఎలాంటి వాడో మనకు తెలుసు అని, గౌతమ్ ఎలా నమ్మించి మోసం చేశాడో అందరికీ అర్థమయ్యేలా చెప్పు అని అంటుంది. తొందరపడ్డప్పుడు లేని భయం ఇప్పుడు ఎందుకు అని అంటుంది. ఇదంతా చూస్తున్న జ్యోత్స్నకు టెన్షన్‍లో చెమటలు పట్టేస్తుంటాయి. రమ్య మాత్రం నోరు తెరిచేందుకు భయపడుతూ ఉంటుంది.

పరీక్షలు చేయించండి

ఈ అమ్మాయినే గౌతమ్ మోసం చేశాడనే నమ్మకం ఏంటని పారిజాతం అంటుంది. అయితే, గౌతమ్‍నే రప్పించాలని దీప అడుగుతుంది. నువ్వు వేసిన నిందకు ఓసారి ఛీ అని పోయాడు, ఇప్పుడు మరోసారి తొందరపడితే చెప్పుతో కొడతాడు అని శివన్నారాయణ అంటాడు. నిజం విన్నాక ఎవరు కొడతారో అర్థమవుతుందని దీప బదులిస్తుంది. నిజమని ఏం రుజువు అంటే.. రమ్య కడుపులోని పిండమే సాక్ష్యం అంటుంది. గౌతమే కారణం అని ఏం రుజువు అంటే.. తండ్రి ఎవరో నిర్ధారించేందుకు ఏవో పరీక్షలు చేస్తారంట కదా.. అవి చేయించండని దీప అంటుంది.

అంటే డీఎన్‍ఏ పరీక్షలు చేయించాలా అని పారిజాతం అంటుంది. అవే చేయించండి, కాగితం కూడా సాక్ష్యంగా ఉంటుందని దీప చెబుతుంది. నీ మాట నమ్మి ముందుకు వెళ్లడం అంటే.. కుక్కతోక పట్టుకొని గోదారి ఈదడం లాంటిదేనని శివన్నారాయణ అంటాడు. ఈ అమ్మాయి మాటల మీద నమ్మకం కుదిరితే ఆ తర్వాత ఏం చేయాలో ఆలోచిద్దామని చెబుతాడు.

భయపడుతూ.. తడబడిన రమ్య

నిజం చెప్పాలని రమ్యను దీప అడుగుతూనే ఉంటుంది. రమ్య మాత్రం భయపడుతుంది. ఎవరూ ఏం చేరని, నీకు న్యాయం జరిగే వరకు సపోర్టుగా ఉంటానని దీప ధైర్యం చెబుతుంది. నిజం చెప్పు అని అంటుంది. అందరూ ఉత్కంఠగా ఎదురుచూస్తూ ఉంటారు. జరిగిందంతా చెబుతాను అని రమ్య అనడంతో జ్యోత్స్న మరింత కంగారు పడుతుంది.

నీ కడుపులో పెరుగుతున్న బిడ్డకు తండ్రి గౌతమేనా అని పారిజాతం అడుగుతుంది. “నా కడుపులో పెరుగుతున్న బిడ్డకు తండ్రి..” అని పదేపదే అంటుంది రమ్య. కానీ నిజం మాత్రం పూర్తి చెప్పదు.

జ్యోత్స్న మరో ప్లాన్ చేసిందా!

ముందు ఆ బిడ్డకు తండ్రి గౌతమో కాదో చెప్పు అని పారిజాతం చిరాకు పడుతుంది. కానీ రమ్య మాత్రమే నా బిడ్డకు తండ్రి అంటూ ఆగిపోతూ ఉంటుంది. గౌతమ్ పేరు చెప్పదు. తడబడుతూనే ఉంటుంది. ఇంతలో ధైర్యంగా చేతులు కట్టుకుంటుంది జ్యోత్స్న. దీంతో కార్తీక దీపం 2 నేటి (ఏప్రిల్ 1) ఎపిసోడ్ ముగిసింది. రమ్య నిజం చెప్పకుండా జ్యోత్స్న ముందుగానే ఏమైనా ప్లాన్ చేసిందా అనేది చూడాలి.

Chatakonda Krishna Prakash

TwittereMail
చాటకొండ కృష్ణ ప్రకాశ్.. హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. ఇక్కడ ప్రస్తుతం ఎంటర్‌టైన్‍మెంట్, స్పోర్ట్స్ వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. జర్నలిజంలో 7 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2022 నవంబర్‌లో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు.
Whats_app_banner

సంబంధిత కథనం

Best Web Hosting Provider In India 2024

Source / Credits

Best Web Hosting Provider In India 2024