






Best Web Hosting Provider In India 2024

BJP On HCU Lands: కంచ గచ్చిబౌలి భూముల వేలంపై కేంద్ర మంత్రుల ఆగ్రహం, రేవంత్ సర్కారుపై కిషన్ రెడ్డి, బండి సంజయ్ ఆగ్రహం
BJP On HCU Lands: హైదరాబాద్ సెంట్రల్ యూనివర్శిటీ సమీపంలోని కంచ గచ్చిబౌలిలోని 400 ఎకరాల భూమిని వేలం వేసేందుకు తెలంగాణ సర్కారు తీసుకున్న చర్యలపై బీజేపీ ఆగ్రహం వ్యక్తం చేసింది. ప్రభుత్వ తీరును కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్ తప్పు పట్టారు.

BJP On HCU Lands: కంచ గచ్చిబౌలిలోని 400 ఎకరాల భూమిని వేలం వేసే ప్రయత్నాలపై బీజేపీ అభ్యంతరం చెబుతోంది. తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న చర్యలను కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్ ఖండించారు.
తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అంత్యంత దుర్మార్గంగా వ్యవహరిస్తూ.. ప్రతిపక్షాల గొంతునొక్కడం, విద్యార్థులను అణిచివేయడం, పచ్చదనాన్ని, జీవవైవిధ్యాన్ని విధ్వంసం చేయడం, నిధుల కోసం హైదరాబాద్ పర్యావరణాన్ని పణంగా పెట్టడంపైనే దృష్టిపెట్టిందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆరోపించారు.
హైదరాబాద్‌లోని కంచ గచ్చిబౌలిలో 400 ఎకరాల భూమిని కాంగ్రెస్ ప్రభుత్వం మొండిగా వేలం వేయడం.. ఈ ప్రాంతంలోని వృక్షసంపదకు, ఇక్కడ ఉంటున్న జీవవైవిధ్యానికి గొడ్డలిపెట్టుగా మారిందన్నారు.
అర్ధరాత్రి పూట కూడా బుల్డోజర్లు పెట్టి చెట్లు నేలకూల్చడంతో.. అక్కడుంటున్న జాతీయపక్షుల(నెమళ్లు) ఆర్తనాదాలు హృదయవిదారకంగా ఉన్నాయని HCU వంటి.. ప్రతిష్టాత్మక విద్యాసంస్థల విద్యార్థుల గొంతులను కూడా అక్రమంగా నొక్కేస్తూ.. ఆక్రమణ చర్యలను మొండిగా చేపడుతుండటం దుర్మార్గమన్నారు.
తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వ ఆలోచనలేని చర్యలను తీవ్రంగా ఖండిస్తున్నట్టు కిషన్ రెడ్డి ప్రకటించారు. పర్యావరణ విధ్వంసాన్ని వెంటనే ఆపేసి.. హైదరాబాద్ కు ఆక్సీజన్ అందిస్తున్ఈ ప్రాంతపు అటవీసంపదను, జీవవైవిధ్యాన్ని కాపాడాలని కోరారు.
ప్రభుత్వ తీరుపై బండి సంజయ్ ఆగ్రహం..
కంచె గచ్చిబౌలి భూములపై కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం వేలం వేయాలనుకున్న 400 ఎకరాల భూమి అటవీ శాఖ పరిధిలోనిదని అటవీ లక్షణాలు కలిగిన ఏ భూమినైనా కేంద్ర ప్రభుత్వ ఆమోదం లేకుండా నరికివేయలేమని సుప్రీంకోర్టు తీర్పులున్నాయన్నారు.
కంచె గచ్చిబౌలిలోని 400 ఎకరాల భూమికి సంబంధించి హైకోర్టులో కేసు నడుస్తోందని, వట ఫౌండేషన్ అనే NGO దాఖలు చేసిన కేసులో ఏప్రిల్ 7 నాటికి కౌంటర్ దాఖలు చేయాలని హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించిందని బండి సంజయ్ గుర్తు చేశారు. ఆ భూములను వేలం వేయడం కుదరదని, ఈ విషయం తెలిసి కూడా రాష్ట్ర ప్రభుత్వం భూముల చదను పేరుతో కోర్టు ధిక్కరణకు పాల్పడుతోందన్నారు.
చెట్లను తొలగిస్తూ, మొక్కలను పీకేస్తూ పర్యావరణ విధ్వంసానికి పాల్పడుతోందని, ఆ భూములను డీఫారెస్టైజేషన్ చేసి అమ్మి వేల కోట్లు దండుకోవాలనుకోవడం దుర్మార్గమన్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని మించి కాంగ్రెస్ ప్రభుత్వం దుర్మార్గంగా వ్యవహరిస్తోందని, ప్రజా ప్రయోజనాలకు కాకుండా ప్రభుత్వ భూములను అడ్డగోలుగా విక్రయించడాన్ని రేవంత్ రెడ్డి గతంలో వ్యతిరేకించిన సంగతి మర్చిపోయారా? అని బండి నిలదీశారు.
కంచె గచ్చిబౌలి భూముల విక్రయం కాంగ్రెస్ అవకాశవాద రాజకీయాలకు పరాకాష్టగా ఉందని, తక్షణమే గచ్చిబౌలి భూముల అమ్మకంపై ప్రభుత్వ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలన్నారు. లేనిపక్షంలో ప్రజలే తగిన గుణపాఠం చెప్పేందుకు సిద్దంగా ఉన్నారని బండి సంజయ్ హెచ్చరించారు.
సంబంధిత కథనం
టాపిక్