





Best Web Hosting Provider In India 2024

Kancha Gachibowli Land : ఢిల్లీకి చేరిన కంచ గచ్చిబౌలి భూముల పంచాయితీ.. కేంద్రం జోక్యం తప్పదా?
Kancha Gachibowli Land : కంచ గచ్చిబౌలి భూముల పంచాయితీ ఢిల్లీకి చేరింది. ఈ విషయంలో జోక్యం చేసుకోవాలని కేంద్ర మంత్రిని కోరారు తెలంగాణ బీజేపీ ఎంపీలు. ఈ సందర్భంగా కేంద్రమంత్రి బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుత ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించారు.

కంచ గచ్చిబౌలి భూముల విషయంలో జోక్యం చేసుకోవాలని.. కేంద్ర ప్రభుత్వాన్ని తెలంగాణ బీజేపీ ఎంపీలు కోరారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి ఆధ్వర్యంలో కంచ గచ్చిబౌలి భూములపై కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రదాన్‌ను తెలంగాణ బీజేపీ ఎంపీలు కలిశారు. ఎంపీలు కొండా విశ్వేశ్వర్ రెడ్డి, ఈటల రాజేందర్, ధర్మపురి అరవింద్, నగేశ్ కేంద్రమంత్రిని కలిసి ఫిర్యాదు చేశారు.
భూములను రక్షించాలి..
పర్యావరణ, హెరిటేజ్ భూములను రక్షించాలని ఎంపీలు కోరారు. హైదరాబాద్ పర్యావరణ పరిరక్షణ సమతుల్యతకు కంచ గచ్చిబౌలి భూములు ఎంతో ప్రయోజనకరం అని వివరించారు. 700 రకాల ఔషధ మొక్కలు, 220 రకాల పక్షులతో ఆ ప్రాంతమంతా అలరారుతోందని చెప్పారు. ఈ భూములను రియల్ ఎస్టేట్‌గా మార్చి వేల కోట్లు దండుకోవాలని చూస్తున్నారని ఎంపీలు ఆరోపించారు.
జోక్యం చేసుకోండి..
హెచ్‌సీయూ విద్యార్థులతోపాటు యావత్ హైదరాబాద్ ప్రజలంతా ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నారని.. ఎంపీలు కేంద్రమంత్రికి వివరించారు. తక్షణమే గచ్చిబౌలి భూముల విషయంలో జోక్యం చేసుకుని.. తగిన చర్యలు తీసుకోవాలని కోరారు. ఇటు కంచ గచ్చిబౌలి భూములపై కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ సంచలన వ్యాఖ్యలు చేశారు.
బండి ఫైర్..
‘రాష్ట్ర ప్రభుత్వం వేలం వేయాలనుకున్న 400 ఎకరాల భూమి అటవీ పరిధిలోనిది. అటవీ లక్షణాలు కలిగిన ఏ భూమినైనా కేంద్ర ప్రభుత్వ ఆమోదం లేకుండా నరికివేయలేమని సుప్రీంకోర్టు తీర్పులున్నాయి. కంచ గచ్చిబౌలిలోని 400 ఎకరాల భూమికి సంబంధించి హైకోర్టులో కేసు నడుస్తోంది. వట ఫౌండేషన్ అనే ఎన్జీవో దాఖలు చేసిన కేసులో.. ఏప్రిల్ 7 నాటికి కౌంటర్ దాఖలు చేయాలని హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఆ భూములను వేలం వేయడం కుదరదు’ అని సంజయ్ స్పష్టం చేశారు.
కాంగ్రెస్ విధ్వంసం..
‘రాష్ట్ర ప్రభుత్వం భూముల చదను పేరుతో కోర్టు ధిక్కరణకు పాల్పడుతోంది. చెట్లను తొలగిస్తూ.. మొక్కలను పీకేస్తూ పర్యావరణ విధ్వంసానికి పాల్పడుతోంది. ఆ భూములను డీఫారెస్టైజేషన్ చేసి.. అమ్మి వేల కోట్లు దండుకోవాలనుకోవడం దుర్మార్గం. గత బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని మించి కాంగ్రెస్ ప్రభుత్వం దుర్మార్గంగా వ్యవహరిస్తోంది. ప్రజా ప్రయోజనాలకు కాకుండా.. ప్రభుత్వ భూములను అడ్డగోలుగా విక్రయించడాన్ని రేవంత్ రెడ్డి గతంలో వ్యతిరేకించిన సంగతి మర్చిపోయారా? ‘ అని బండి ప్రశ్నించారు.
గుణపాఠం తప్పదు..
‘కంచ గచ్చిబౌలి భూముల విక్రయం కాంగ్రెస్ అవకాశవాద రాజకీయాలకు పరాకాష్ట. తక్షణమే గచ్చిబౌలి భూముల అమ్మకంపై ప్రభుత్వ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలి. లేనిపక్షంలో ప్రజలే తగిన గుణపాఠం చెప్పేందుకు సిద్దంగా ఉన్నారు’ అని కేంద్రమంత్రి బండి సంజయ్ స్పష్టం చేశారు.
సంబంధిత కథనం
టాపిక్