





Best Web Hosting Provider In India 2024

TG Govt : పండుగ వాతావరణంలో సన్న బియ్యం పంపిణీ.. కలెక్టర్లకు సీఎస్ కీలక ఆదేశాలు
TG Govt : ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి ఇవాళ కలెక్టర్లు, అదనపు కలెక్టర్లు, పౌరసరఫరాల శాఖ అధికారులతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. సన్న బియ్యం పంపిణీ కార్యక్రమాన్ని సమీక్షించారు. ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ఈ కార్యక్రమాన్ని ఉగాది రోజున ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభించారు.

సన్న బియ్యం పంపిణీ కార్యక్రమాన్ని అన్ని మండల కేంద్రాల్లో నిర్వహించేందుకు మంత్రులు, స్థానిక ఎమ్మెల్యేలతో చర్చించి కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలని.. కలెక్టర్లను సీఎస్ శాంతి కుమారి ఆదేశించారు. సన్నబియ్యం పంపిణీ కార్యక్రమాన్ని పండుగ వాతావరణంలో నిర్వహించాలని, అందుకు తగిన విధంగా స్థానిక ప్రజాప్రతినిధులు పాల్గొని విస్తృత ప్రచారం కల్పించాలన్నారు.
50 శాతం చేరాయి..
ఇప్పటికే యాభై శాతానికి పైగా సన్నబియ్యం చౌక ధరల (రేషన్ షాప్) దుకాణాలకు వచ్చాయని.. సీఎస్ శాంతి కుమారి వివరించారు. మిగిలిన స్టాక్‌ను రెండు రోజుల్లో పంపిణీ చేస్తామని ఆమె తెలిపారు. బియ్యం నాణ్యత, పరిమాణానికి సంబంధించి ఎలాంటి ఫిర్యాదులు రాకుండా చూడాలని కలెక్టర్లకు సూచించారు. ప్రజల నుంచి ఎలాంటి ఫిర్యాదులు వచ్చినా.. వెంటనే పరిష్కరించేలా చూడాలని ఆదేశించారు.
ఒక్కొక్కరికి 6 కిలోలు..
తెలంగాణ ప్రభుత్వం పేదల ఆహార భద్రతను మెరుగుపరిచేందుకు నాణ్యమైన సన్న బియ్యం పంపిణీ పథకాన్ని ప్రారంభించింది. తెల్ల రేషన్ కార్డు కలిగిన కుటుంబాలకు ఈ పథకం కింద సన్న బియ్యం పంపిణీ చేయనున్నారు. హైదరాబాద్‌ను మినహాయించి రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో ఈ పంపిణీ ప్రారంభమైంది. ఈ పథకం కింద, రేషన్ కార్డు కలిగిన ప్రతి ఒక్కరికి 6 కిలోల చొప్పున సన్న బియ్యం అందించనున్నారు.
ఏప్రిల్ 1 నుంచి పంపిణీ..
పౌర సరఫరాల శాఖ ఈ పథకాన్ని అమలు చేసేందుకు ఏర్పాట్లు పూర్తి చేసింది. మార్చి 30న సూర్యాపేట జిల్లా హుజూర్‌నగర్ నియోజకవర్గంలో ముఖ్యమంత్రి చేతుల మీదుగా దీని ప్రారంభోత్సవం జరిగింది. ఏప్రిల్ 1వ తేది నుండి రాష్ట్ర వ్యాప్తంగా సన్న బియ్యం పంపిణీ ప్రారంభం అయ్యింది. రాష్ట్రంలో దాదాపు 84 శాతం మంది పేదలకు ఉచితంగా సన్నబియ్యం అందించబోతోంది.
రైతులకు కూడా మేలు..
తెలంగాణలో పేదలకు సన్న బియ్యం పంపిణీ చేసేందుకు.. ఏడాదికి 24 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యం అవసరం అవుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ పథకం ద్వారా కేవలం పేదలకు మాత్రమే కాకుండా.. రైతులకు కూడా లబ్ధి జరుగుతుందని ప్రభుత్వం భావిస్తోంది. రైతులను సన్నాలు సాగు చేసేందుకు ఈ పథకం ఉపయోగడుతుందని అధికారులు చెబుతున్నారు. ఇప్పటికే సన్నాలకు బోనస్ డబ్బులు ఇస్తున్నారు.
సంబంధిత కథనం
టాపిక్