






Best Web Hosting Provider In India 2024

HCU Lands Issue : హెచ్సీయూ నుంచి ఇంచు భూమి కూడా తీసుకోలేదు, పాత వీడియోలతో సోషల్ మీడియాలో దుష్ప్రచారం -మంత్రులు
HCU Lands Issue : హైదరాబాద్ సెంట్రల్ వర్సిటీ భూముల వివాదంపై డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు ప్రజాసంఘాలతో భేటీ నిర్వహించారు. కంచె గచ్చిబౌలి భూములు వర్సిటీకి చెందినవి కాదని, వర్సిటీ నుంచి ఇంచు భూమి కూడా తీసుకోలేదని మంత్రులు తెలిపారు.

HCU Lands Issue : అబద్దాల మీదే కొన్ని రాజకీయ పార్టీలు బతుతున్నాయని కంచ గచ్చిబౌలి భూముల వ్యవహారంపై డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క విమర్శించారు. బీఆర్ఎస్, బీజేపీ అడ్డగోలుగా వ్యవహరిస్తూ ప్రభుత్వ భూమిపై దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. ప్రైవేటు వ్యక్తుల చేతుల్లో ఉన్న ప్రభుత్వ భూములను వెనక్కి తెచ్చుకోవడానికి, పదేళ్లు పాలించిన బీఆర్ఎస్ ఎలాంటి ప్రయత్నాలు చేయలేదన్నారు. ఈ మేరకు సచివాలయంలో మంత్రులతో కలిసి భట్టి విక్రమార్క మీడియాతో మాట్లాడారు.
హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూముల వ్యవహారంపై డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు శ్రీధర్ బాబు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, ప్రొఫెసర్ హరగోపాల్, ప్రజా సంఘాల సభ్యులతో ప్రత్యేక భేటీ నిర్వహించారు. అనంతరం భట్టి విక్రమార్క మీడియాతో మాట్లాడుతూ.. హైకోర్టులో ప్రభుత్వం కేసు గెలిచింది. వేల కోట్ల విలువైన భూములను ప్రైవేటు వ్యక్తుల చేతిలోకి వెళ్లకుండా కాపాడామన్నారు. ప్రజల ఆస్తిని కాపాడిన తమను అభినందించాల్సింది పోయి విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. ప్రైవేట్ రంగంలోనూ ఉద్యోగాల కల్పన తమ ధ్యేయమన్నారు. పదేళ్లు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పించలేదని మండిపడ్డారు.
సోషల్ మీడియాతో తప్పుడు ప్రచారం
కంచె గచ్చిబౌలి భూములు యూనివర్సిటీకి చెందినవి కాదని, వర్సిటీకి చెందిన ఇంచు భూమిని తాము తీసుకోమని భట్టి విక్రమార్క పేర్కొన్నారు. ప్రజలకు వాస్తవాలు తెలియాల్సిన అవసరం ఉందని, సెంట్రల్ వర్సిటీ భూముల్ని ప్రభుత్వం గుంజుకుందని సోషల్ మీడియాలో దుష్ప్రచారం చేస్తున్నారన్నారు. హెచ్‌సీయూ నుంచి భూములను లాక్కొని ప్రభుత్వం వెంచర్లు, ప్లాట్లు వేసి అమ్ముకునేందుకు ప్రయత్నిస్తోందని తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. ఈ 400 ఎకరాలు హెచ్‌సీయూ పరిధిలోనే ఉందని వర్సిటీ యాజమాన్యం భావిస్తోందని, కానీ ఉమ్మడి రాష్ట్రంలో ఈ 400 ఎకరాలను వర్సిటీ నుంచి తీసుకొని ఓ ప్రైవేటు సంస్థకు కేటాయించారని తెలిపారు.
“ఆ 400 ఎకరాలకు బదులుగా వర్సిటీకి ఆనుకొని మరోవైపు ఉన్న 397 ఎకరాలు ప్రభుత్వం కేటాయించింది. దీనిపై ఆనాడు రెవెన్యూ అధికారులు, వర్సిటీ యాజమాన్యం కలిసి సంతకం చేసిన రికార్డులు ప్రభుత్వం వద్ద ఉన్నాయి. రాష్ట్ర ప్రజలు, యూనివర్సిటీ విద్యార్థులకు ఈ విషయాలను గమనించాలి. ఈ రికార్డులకు మీడియాకు అందిస్తాం. ఈ అంశంలో కొన్ని రాజకీయ పార్టీలు కావాలనే దుష్ప్రచారం చేస్తూ ప్రజలు, వర్సిటీ విద్యార్థులను తప్పుదోవ పట్టిస్తున్నాయి” – భట్టి విక్రమార్క
ఈ 400 ఎకరాలను కాపాడి, అక్కడ ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు ఒక కార్యాచరణ రూపొందించామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. హైటెక్ సిటీ, హైటెక్ సిటీ ఫేజ్-2, నాలెజ్డ్ సిటీ వంటి వాటి ద్వారానే ఉపాధి పెరిగిందన్నారు. అదే విధంగా యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడమే లక్ష్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తుందన్నారు. హైదరాబాద్ అభివృద్ధి జరగాలి, సంపద సృష్టించాలి, ఉపాధి పెరగాలనేది ప్రభుత్వ ఉద్దేశం అన్నారు.
హెచ్సీయూ వద్ద పత్రాలు కూడా లేవు
మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ… హెచ్సీయూ భూముల విషయంలో అపోహలు, అనుమానాలు సృష్టిస్తున్నారన్నారు. బీజేపీ, బీఆర్ఎస్ గందరగోళం సృష్టించేందుకు ప్రయత్నిస్తున్నాయని పేర్కొన్నారు. వర్సిటీకి చెందిన చిన్న భూమిని కూడా ప్రభుత్వం తీసుకోలేదన్నారు. కొంతమంది వ్యక్తులు, పార్టీల అనుబంధ సంఘాలు ప్రజలను, విద్యార్థులను తప్పుదోవపట్టిస్తున్నారన్నారు. హెచ్సీయూ వీసీ, రిజిస్ట్రార్ తో ప్రభుత్వం ఇప్పటికే సంప్రదింపులు చేసిందన్నారు. ఈ భూముల వివాదం చాలా సంవత్సరాలుగా కోర్టులో పెండింగ్ లో ఉందన్నారు. ఈ భూములకు సంబంధించిన పత్రాలు యూనివర్శిటీ దగ్గర లేవని మంత్రి శ్రీధర్ తెలిపారు.
విద్యార్థుల ముసుగులో బీఆర్ఎస్ అరాచకం
హెచ్‌సీయూ భూముల అంశంపై రాద్ధాంతం చేస్తున్న వారు హైరైజ్ బిల్డింగులకు అనుమతి ఇచ్చేటప్పుడు పర్యావరణం గుర్తురాలేదా? అని మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి ప్రశ్నించారు. ఈ భూముల్లోని జంతువులు, పక్షులకు ఎలాంటి హాని జరగలేదన్నారు. జంతువులు, పక్షులు చనిపోయినట్లు సోషల్ మీడియాలో చూపుతున్న వీడియోలు, చిత్రాలు పాతవని స్పష్టం చేశారు. విద్యార్థుల ముసుగులో బీఆర్ఎస్ వ్యక్తులు అరాచకం చేస్తున్నారని మంత్రి మండిపడ్డారు.
సంబంధిత కథనం
టాపిక్