




Best Web Hosting Provider In India 2024
CPM General Secretary: నెక్స్ట్ సీపీఎం ప్రధాన కార్యదర్శి ఎవరు? చారిత్రాత్మకం కాబోతున్న మదురై సీపీఎం మహాసభలు
CPM General Secretary: సీపీఎం అఖిల భారత 24వ మహాసభలు తమిళనాడులోని మదురై వేదికగా మంగళవారం ప్రారంభం అయ్యాయి. ఏప్రిల్ 1 నుంచి 6 వరకు జరిగే ఈ మహాసభలు చారిత్రాత్మకం కాబోతున్నాయి. ఈ మహాసభలో అనేక మంది సీనియర్లు రిలీవ్ కాబోతున్నారు. అనేక కొత్త ముఖాలు కేంద్ర కమిటీలోకి ఎంటర్ కాబోతున్నాయి.

CPM General Secretary: ఏప్రిల్ 1 నుంచి 6 వరకు ఐదు రోజుల పాటు తమిళనాడులోని మదురైలో జరిగే సీపీఎం అఖిల భారత 24వ మహాసభలు చారిత్రాత్మకం కాబోతున్నాయి. ఎందుకంటే ఈ మహాసభలో అనేక మంది సీనియర్లు రిలీవ్ కాబోతున్నారు. ఈ మహాసభల్లో అనేక కొత్త ముఖాలు కేంద్ర కమిటీలోకి ఎంటర్ కాబోతున్నాయి. అలాగే కేంద్ర కమిటీలో మహిళలకు అధిక ప్రాధాన్యత లభించనుంది.
53 ఏళ్ల తరువాత మదురైలో సీపీఎం మహాసభలు
సీపీఎం తొమ్మిదో అఖిల భారత మహాసభలు తమిళనాడులోని మదురైలో 1972 జూన్ 27 నుంచి జూలై 2 వరకు జరిగాయి. మళ్లీ 53 ఏళ్ల తరువాత మదురైలో 24 మహాసభలు జరుగుతున్నాయి. అందుకు మాత్రమే కాదు, ఈ మహాసభ చారిత్రాత్మకం కాబోతోంది. ఈ మహాసభలో అనేక కీలక నిర్ణయాలు ఉండబోతున్నాయి. మోడీ ఫాసిస్ట్ పోకడలతో పాలన సాగిస్తోన్న నేపథ్యంలో ఈ మహాసభ కీలకంగా మారింది. అంతేకాకుండా సీపీఎం బలోపేతానికి దిశ నిర్దేశం కూడా ఈ మహాసభలు చేయనున్నాయి.
సీతారాం ఏచూరి స్థానాన్ని ఎవరు భర్తీ చేస్తారు?
మధురైలోని తముక్కం గ్రౌండ్‌లో మహాసభలు జరుగుతున్నాయి. తదుపరి సీపీఎం ప్రధాన కార్యదర్శి ఎవరనేది సర్వత్రా చర్చ జరుగుతోంది. ఎందుకంటే సీపీఎం ప్రధాన కార్యదర్శిగా పని చేసిన సీతారాం ఏచూరి మరణంతో సీపీఎంలో లోటు ఏర్పడింది. ఆ లోటు భర్తీ చేసేందుకు ఆ స్థాయి వ్యక్తి ఉన్నారా? అనే చర్చ జరుగుతోంది. సాధారణంగా సీపీఎంలో వ్యక్తి ఆధారంగా రాజకీయ నిర్ణయాలు ఉండవు. అందరూ సమిష్టిగా నిర్ణయాలు తీసుకుంటారు. కేంద్ర కమిటీ, పొలిట్ బ్యూరో వంటి కమిటీలు పార్టీ నిర్ణయాలకు కేంద్ర బిందువుగా ఉంటాయి.
ఏచూరికి పార్టీలో గొప్ప స్థానం
అయితే సీతారాం ఏచూరి సీపీఎం ఒక గొప్పస్థానాన్ని సంపాదించుకున్నారు. పార్టీ కష్టకాలంలో ఆయన ప్రధాన కార్యదర్శి అయ్యారు. ఆయన ప్రధాన కార్యదర్శి అయ్యే నాటికి దేశంలో బీజేపీ అధికారంలో ఉంది. ఆయన చనిపోయేవరకు బీజేపీ విభజన, ఫాసిస్ట్ రాజకీయాలకు వ్యతిరేకంగా ఒక సమున్నతమైన పోరాటాన్ని నిర్మించారు. అయితే ఆయన ప్రధాన కార్యదర్శిగా కాకముందే పార్లమెంట్‌లో సీపీఎం బలం తగ్గుతూ వస్తోంది. సీతారాం ఏచూరి ప్రధాన కార్యదర్శి అయిన తరువాత కూడా పార్లమెంటరీ బలం తగ్గతూ వచ్చింది. అయితే ఆయన కాలంలో ఒకపక్క సీపీఎం పార్లమెంట్‌లో, రాష్ట్రాల్లో బలం తగ్గిపోయినప్పటికీ, మరోవైపు బీజేపీ మతతత్వ రాజకీయాలు, కేంద్ర ప్రభుత్వ కార్పొరేట్, మతోన్మాద వినాశకర విధానాలపై సీపీఎం నిర్వహించిన పోరాటం దేశవ్యాప్తంగా మంచి గుర్తింపునే తెచ్చింది. రైతాంగ పోరాటాలు, కార్మిక పోరాటాలతో దేశంలో చారిత్రాత్మక ఘటనలెన్నో చోటు చేసుకున్నాయి.
ఏచూరి బతికుంటే..
సీతారాం ఏచూరి బతికి ఉంటే, ఈ మహాసభలో ఆయనే నివేదికను ప్రవేశపెట్టేవారు. అంతేతప్ప మళ్లీ ప్రధాన కార్యదర్శి అయ్యేవారు కాదు. ఎందుకంటే సీపీఎంలో మూడు సార్లు కంటే ఎక్కువసార్లు ప్రధాన కార్యదర్శి కావడానికి వీలులేదనే నిబంధన ఉంది. మరోవైపు, ఈ మహాసభలో దాదాపు ఆరుగురు సీనియర్ పోలిట్ బ్యూరో సభ్యులు రిలీవ్ కాబోతున్నారు. అలాగే దాదాపు తొమ్మిదేళ్లు తరువాత ఈ మహాసభలోనే సీపీఎం కొత్త ప్రధాన కార్యదర్శి ఎన్నుకోబోతున్నారు.
ఎవరు సీపీఎం కొత్త ప్రధాన కార్యదర్శి?
సీపీఎం కొత్త ప్రధాన కార్యదర్శిని మహాసభల చివరి రోజైన 6 తేదీన ఎన్నుకుంటారు. కేంద్ర కమిటీ, పొలిట్ బ్యూరో, సెంట్రల్ కంట్రోల్ కమిషన్‌లను కూడా మహాసభల చివరి రోజే ఎన్నుకుంటారు. 17 మంది పొలిట్ బ్యూరో సభ్యుల్లో సీతారాం ఏచూరి లేరు. ప్రస్తుతం ప్రకాష్ కారత్ (ఢిల్లీ కేంద్రం), పినరయి విజయన్ (కేరళ), బృందా కారత్ (ఢిల్లీ కేంద్రం), మాణిక్ సర్కార్ (త్రిపుర), సూర్యాకాంత మిశ్రా (పశ్చిమ బెంగాల్), జి. రామకృష్ణన్ (తమిళనాడు), సుభాషిణి అలీ (ఢిల్లీ కేంద్రం), బి.వి.రాఘవులు (ఆంధ్రప్రదేశ్), మహ్మద్ సలీం (పశ్చిమ బెంగాల్), ఎంఏ బేబీ (కేరళ), తపన్ కుమార్ సేన్ (ఢిల్లీ కేంద్రం), నీలోత్పల్ బసు (ఢిల్లీ కేంద్రం), రామ్ చంద్ర డోమ్ (పశ్చిమ బెంగాల్), ఎ. విజయరాఘవన్ (కేరళ), అశోక్ ధావలే (మహారాష్ట్ర), ఎం.వి. గోవిందన్ (కేరళ) ఉన్నారు.
ఏడుగురు సీనియర్ పొలిట్ బ్యూరో సభ్యులు రిలీవ్
ఈ 16 మందిలో ప్రకాష్ కరత్ నుంచి సుభాషిణి అలీ వరకు ఏడుగురు సీనియర్ పొలిట్ బ్యూరో సభ్యులు రిలీవ్ కాబోతున్నారు. సీపీఎం నిబంధన ప్రకారం 75 ఏళ్ల వయస్సు వస్తే, కేంద్ర కమిటీ నుంచి రిలీవ్ చేస్తారు. అందులో భాగంగానే ప్రకాష్ కారత్ (77), కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ (79), బృందా కారత్ (77), త్రిపుర మాజీ ముఖ్యమంత్రి మాణిక్ సర్కార్ (76), సూర్యాకాంత మిశ్రా (75), సుభాషిణి అలీ (77), జి.రామకృష్ణన్ (75)లు రిలీవ్ అయ్యే అవకాశముంది. అయితే వీరిలో కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ 2022లో కేరళలోని కన్నూర్‌లో జరిగిన 23వ సీపీఎం అఖిల భారత మహాసభలోనే వయస్సు రీత్య రిలీవ్ కావాల్సి ఉంది. ఎందుకంటే అప్పటికే ఆయనకు 75 ఏళ్లు పూర్తి అయ్యాయి. అయితే ఆయన ముఖ్యమంత్రిగా ఉండటంతో మహాసభ ప్రత్యేక అనుమతి ఇచ్చింది. దీంతో ఆయన కేంద్ర కమిటీ సభ్యుడిగా, పొలిట్ బ్యూరో సభ్యుడిగా కొనసాగారు.
బీవీ రాఘవులుకు ఛాన్స్!
రిలీవ్ అయ్యే నేతలను మినహాయిస్తే, మిగిలిన పొలిట్ బ్యూరో సభ్యుల్లో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన బీవీ రాఘవులు సీనియర్‌గా ఉన్నారు. ఆయనే తదుపరి ప్రధాన కార్యదర్శి అవుతారని చర్చ జరుగుతోంది. అయితే అనారోగ్యం వల్ల ఆయన ప్రధాన కార్యదర్శి రేస్‌లోంచి తప్పుకున్నట్లు సమాచారం. అయితే మిగిలిన సభ్యుల్లో అశోక్ ధావలే సీపీఎం రైతు వింగ్ జాతీయ అధ్యక్షులుగా ఉన్నారు. ఆయన ఇటీవలి కాలంలో సీపీఎంలో యాక్టివ్ అయ్యారు. నాసిక్-ముంబాయి కిసాన్ లాంగ్ మార్చ్ నుంచి ఢిల్లీలో చారిత్రత్మాక రైతు ఉద్యమం వరకు ఆయన చాలా యాక్టివ్‌గా ఉన్నారు. ఆయన కూడా ప్రధాన కార్యదర్శి అయ్యే అవకాశముందని ఉహాగానాలు వినిపిస్తోన్నాయి. పైగా ఆయన మహారాష్ట్రకు చెందినప్పటికీ, ఢిల్లీ కేంద్రంలో ఉండి పని చేస్తున్నారు. అలాగే సీపీఎం పశ్చిమ బెంగాల్ కార్యదర్శి ఎండీ సలీం కూడా చాలా యాక్టివ్‌గా ఉన్నారు. ఆయన కూడా గతంలో ఢిల్లీ కేంద్రంగా పని చేశారు. అయితే ఆయన ప్రస్తుతం బెంగాల్ రాష్ట్ర కార్యదర్శిగా ఉండటంతో ప్రధాన కార్యదర్శి అయ్యేందుకు అవకాశాలు లేవు. మిగిలిన వారి పేర్లు పెద్దగా వినిపించటం లేదు.
సంబంధిత కథనం
Best Web Hosting Provider In India 2024
Source link