Best Web Hosting Provider In India 2024

Mega 157: షూటింగ్‍కు ముందే చిరంజీవితో ప్రమోషన్లను మొదలెట్టేసిన అనిల్ రావిపూడి.. వీడియో అదుర్స్.. చూసేయండి
Chiranjeevi – Anil Ravipudi Mega 157: మెగాస్టార్ చిరంజీవి – డైరెక్టర్ అనిల్ రావిపూడి కాంబినేషన్‍లో సినిమా తెరకెక్కనుంది. ఈ తరుణంలో టీమ్‍ను పరిచయం చేసుకున్నారు చిరూ. ఈ వీడియో చాలా ఎంటర్‌టైనింగ్‍గా ఉంది.
డైరెక్టర్ అనిల్ రావిపూడి ఈ ఏడాది సంక్రాంతికి వస్తున్నాం సినిమాతో భారీ హిట్ కొట్టారు. విక్టరీ వెంకటేశ్ నటించిన ఆ చిత్రం సంక్రాంతి పండగకు వచ్చి రూ.300కోట్లకు పైగా కలెక్షన్లతో బ్లాక్‍బస్టర్ సాధించింది. డైరెక్టర్ అనిల్ క్రియేటివిటీతో చేసిన ప్రమోషన్లు ఆ మూవీ అంత భారీ సక్సెస్ సాధించడానికి ఓ కారణం అయ్యాయి. ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవితో ఓ మూవీ (మెగా157) చేస్తున్నారు అనిల్. ఈ చిత్రానికి పూజా కార్యక్రమాలు కూడా రీసెంట్‍గా జరిగాయి. అయితే, చిరూతో ఈ సినిమాకు షూటింగ్ ముందే ప్రమోషన్లను అనిల్ మొదలెట్టేశారు. మూవీ టీమ్‍ను చిరంజీవికి పరిచయం చేస్తున్నట్టు ఓ ఎంటర్‌టైనింగ్ వీడియో వదిలారు. ఇది చాలా సరదాగా ఉంది.
చిరంజీవి పాత సినిమా కటౌట్లు, డైలాగ్‍లు
మెగాస్టార్ చిరంజీవి పాత సినిమాల కటౌట్‍లతో ఓ లొకేషన్‍ను మూవీ టీమ్ ఏర్పాటు చేసింది. కారులో చిరజీవి దిగి రావటంతో ఈ వీడియో మొదలైంది. మెగా157 గ్యాంగ్‍ను పరిచయం చేస్తున్నామంటూ సాగింది. చిరంజీవి పాత సినిమా డైలాగ్‍లు చెబుతూ ఆయనకు తమను తాము పరిచయం చేసుకున్నారు మూవీ టీమ్ సభ్యులు. నమస్తే బాస్.. మిమ్మల్ని సూపర్ కామెడీ టైమింగ్‍తో ‘చూడాలని ఉంది’ అంటూ చిరంజీవిని పలుకరించారు డైరెక్షన్ డిపార్ట్‌మెంట్ మెంబర్స్. అన్నయ్య, హిట్లర్, ఆటోజానీ, ముఠామేస్త్రీ, ఇంద్ర సహా మరిన్ని సినిమాల కటౌట్లు, డైలాగ్‍లతో మెగా157 టెక్నిిషియన్లు చిరంజీవికి పరిచయం చేసుకున్నారు.
కొణిదెల ఇంటి పేరు నిలబెట్టాలి
మాస్టారు.. మాస్టారు.. మీరే మాకు మెగాస్టార్ అంటూ చిరంజీవిని పలుకరించారు మ్యూజిక్ డైరెక్టర్ భీమ్స్ సెసిరోలియో. గోదారి గట్టు మీద రామచిలవే అంటూ పాడి ఈ సినిమాకు ఇరగొట్టేయాలని చెప్పారు చిరూ. ఇన్‍ఫ్రంట్ దెరీజ్ బ్లాక్‍బస్టర్ ఫెస్టివల్ అంటూ నిర్మాతలు సాహు సాహు గారపాటి, సుష్మిత కొణిదెల పరిచయం చేసుకున్నారు. ఇంటి పేరు ఏమన్నావ్ అంటూ కూతురు సుష్మితను సరదాగా అడిగారు చిరూ. కొణిదెల.. ఇంటి పేరు నిలబెట్టాలని చెప్పారు.
గ్యాంగ్‍లీడర్ అనిల్.. సంక్రాంతికి రప్ఫాడిద్దాం
డైరెక్టర్ అనిల్ రావిపూడి.. గ్యాంగ్‍లీడర్ కటౌట్‍తో రఫ్ఫాడిద్దాం డైలాగ్ చెప్పారు. నువ్వే ఈ గ్యాంగ్‍లీడర్ అని తెలుసులే అంటూ, వచ్చే సంక్రాంతికి ఏం ప్లాన్ చేస్తున్నావని చిరూ అడిగారు. వచ్చే సంక్రాంతికి రప్ఫాడించేద్దాం అని గట్టిగా అన్నారు అనిల్. అంతొద్దు.. ఇది చాలు అంటూ అనుకున్నావా ఇంకా సౌండ్ పెంచు అని చిరూ అంటే.. రఫ్పాడిద్దామని అనిల్ ఇంకాస్త గట్టిగా అన్నారు. 2026 సంక్రాంతికి ఈ మూవీని విడుదల చేస్తామని టీమ్ ప్రకటించింది.
త్వరలోనే మెగా157 షూటింగ్ మొదలుకానుంది. ఆలోగానే ఈ వీడియోను తీసుకొచ్చి అప్పుడే ప్రమోషన్‍ను అనిల్ షురూ చేశారు. ఈ వీడియో సరదాగా, చిరూ పాత సినిమా డైలాగ్‍లతో ఉండటంతో బాగా వైరల్ అవుతోంది. చిరంజీవి కూడా తన మార్క్ టైమింగ్‍తో ఈ వీడియోలో అదరగొట్టారు.
చిరంజీవి హీరోగా నటించిన విశ్వంభర చిత్రం విడుదల కావాల్సి ఉంది. వశిష్ట దర్శకత్వం వహించిన ఈ సోషియో ఫ్యాంటసీ చిత్రం సంక్రాంతికి రావాల్సి ఉన్నా వాయిదా పడింది. కొత్త రిలీజ్ డేట్ ఖరారు కావాల్సిఉంది. షూటింగ్ కూడా కంప్లీట్ అయినట్టు తెలుస్తోంది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి.