




Best Web Hosting Provider In India 2024

TG PDS Rice: రేషన్ బియ్యం అక్రమ దందాకు చెక్…సన్నబియ్యం పంపిణీతో సర్వత్రా హర్షం
TG PDS Rice: రేషన్ బియ్యం అక్రమ దందాకు తెలంగాణ ప్రభుత్వం చెక్ పెట్టింది. రేషన్ షాపుల ద్వారా పేదలకు ఉచితంగా సన్నబియ్యం పంపిణీకి శ్రీకారం చుట్టింది. రాష్ట్రవ్యాప్తంగా ఎప్రిల్ ఫస్ట్ నుంచి సన్న బియ్యం పంపిణీ చేస్తున్నారు. సన్న బియ్యం పంపిణితో సర్వత్రా హర్షం వ్యక్తం అవుతుంది.

TG PDS Rice: పెద్దలు తినే సన్న బియ్యం బువ్వా, ఇప్పుడు పేదలకు సైతం లభిస్తుండడంతో తెల్లరేషన్ కార్డు లబ్దిదారులు సంబరపడుతున్నారు.తెలంగాణ వ్యాప్తంగా 17263 రేషన్ షాపుల్లో తెల్లరేషన్ కార్డుదారులకు సన్నబియ్యం ఉచితంగా పంపిణీ ప్రారంభం అయింది.
రాష్ట్ర వ్యాప్తంగా లక్ష 91 వేల మెట్రిక్ టన్నుల సన్న బియ్యం పంపిణీ చేస్తున్నారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో పలుచోట్ల సన్నబియ్యం పంపిణీని రాష్ట్రమంత్రి పొన్నం ప్రభాకర్ ప్రారంభించారు. ఇకనుంచి తెల్ల రేషన్ కార్డుదారులకు ప్రతి నెల ఒక్కొక్కరికి ఆరు కిలోల చొప్పున సన్న బియ్యం పంపిణీ చేయడం జరుగుతుందని ప్రకటించారు.
కొత్త రేషన్ కార్డులను త్వరలోనే ఇస్తామని తెలిపారు. పేదలకు సన్నబియ్యం పంపిణీ చేయడం పట్ల నిరుపేదలు లబ్దిదారులు హర్షం వ్యక్తం చేశారు. ఇదివరకు దొడ్డిబియ్యం తినలేక వాటిని అమ్ముకుని సన్నబియ్యం కొనుక్కొచ్చి తినేవాళ్ళమని చెప్పారు. ప్రస్తుతం ప్రభుత్వం సన్న బియ్యం ఇస్తుండడంతో సంతోషంగా ఉందన్నారు. సన్న బియ్యం పంపిణీతో రేషన్ బియ్యం అక్రమ దందా, రీసైక్లింగ్ కు ఫుల్ స్టాప్ పడినట్లేనని స్పష్టం చేశారు.
బిసి రిజర్వేషన్ కు బిజేపి సహకరించాలి…
బీసీ లకు రాజకీయ విద్యా ఉద్యోగ అవకాశాల్లో తెలంగాణ ప్రభుత్వం చేసిన 42 శాతం రిజర్వేషన్లు చేసిన చట్టాన్ని పార్లమెంట్ లో ఆమోదించాలని డిల్లీలో ధర్నా చేస్తున్నట్లు మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. కేంద్రం షెడ్యూల్ 9 లో పెట్టి తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం మేరకు బలహీన వర్గాలకు న్యాయం చేయమని తెలంగాణ కు సంబంధించిన అన్ని బలహీన వర్గాల సంఘాలు ఢిల్లి కేంద్రంగా చేస్తున్న ధర్నా లో ప్రతిపక్ష నాయకులు రాహుల్ గాంధీ తో పాటు వివిధ పార్టీల అధ్యక్షులు జాతీయ పార్టీలకు సంబంధించిన ముఖ్య నేతలు పాల్గొంటున్నారని చెప్పారు.
బలహీన వర్గాలకు సంబంధించి కేంద్రంలో అధికారంలో ఉన్న బండి సంజయ్, ఈటల రాజేందర్ డాక్టర్ లక్ష్మణ్ లాంటి నాయకులను కలిసి తెలంగాణ తరుపున కలిసి సహకరించాలని అడుగుతామని తెలిపారు. తమిళనాడు మాదిరిగా తెలంగాణ లో రాజకీయాలకు అతీతంగా బిసిలకు 42 శాతం రిజర్వేషన్ కోసం కలిసికట్టుగా ముందుకు సాగాలని బీసీ సంక్షేమ శాఖ మంత్రిగా కోరుతున్నానని పొన్నం ప్రభాకర్ తెలిపారు. ఏప్రిల్ నెల సామాజిక ఉద్యమాలకు అంకురార్పణ జరుగుతుందన్నారు.
విద్యార్థులను రెచ్చగొట్టే ప్రయత్నం మానుకోవాలి…
బీజేపీ, బిఆర్ఎస్ రెండు పార్టీలు కవలల పిల్లలుగా తెలంగాణ ప్రజా ప్రభుత్వానికి పిల్లి శాపనార్థాలు పెడుతూ ప్రభుత్వం కూలిపోతుందని ప్రభుత్వం సక్సెస్ కావద్దని ప్రతి అంశాన్ని రాజకీయం చేస్తున్నారని మంత్రి పొన్నం ప్రభాకర్ విమర్శించారు. 2004 లో పంచనామా చేసి 400 ఎకరాలు యూనివర్సిటీ కి సంబంధం లేదని గోపనపల్లి లో ఆల్టర్నేటివ్ ల్యాండ్ కింద తీసుకోవడం జరిగిందన్నారు.
20 సంవత్సరాల క్రితం ప్రభుత్వానికి యూనివర్సిటీ కి మధ్య భూ బదలాయింపు జరిగిందని అందుకు సంబంధించిన సాక్ష్యాధారాలను చూపించారు. అకారణంగా భూమిని ప్రభుత్వం అమ్ముకుంటుందని ఆరోపణలు చేస్తున్నారని తెలిపారు. బిజెపి బీఆర్ఎస్ నాయకులు 10 సంవత్సరాల్లో అధికారంలో ఉండి కోర్టులో కేసులు నడుస్తుంటే యూనివర్సిటీకి సంబంధించిన అధికారులు కూడా ఈ స్థలం మాది అని న్యాయపరమైన పోరాటంలో భాగస్వామ్యం కాలేదని తెలిపారు.
2004 నుండి న్యాయబద్ధమైన పోరాటం ప్రభుత్వం చేసి, ప్రభుత్వ స్థలాలు ఎక్కడెక్కడ ఉన్నా అన్యాక్రాంతం కాకుండా ఉండడానికి ప్రభుత్వం లీగల్ గా ముందుకు వెళ్ళి 400 ఎకరాలు సాధించిందని స్పష్టం చేశారు. 400 ఎకరాలు కోర్టు ద్వారా ప్రభుత్వానికి వచ్చిందని, హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి ఈ భూమికి సంబంధం లేదని చెప్పారు.
కెసిఆర్ చేత ప్రతిపాదించబడిన రాష్ట్ర బిజెపి అధ్యక్షుడు కన్ఫ్యూజన్ ,కాంట్రవర్సీ తో లాభం పొందాలని చూస్తున్నారని విమర్శించారు. కిషన్ రెడ్డి, బండి సంజయ్, బిఆర్ఎస్ పార్టీ ఒకే గొంతుగా తానా అంటే తందనా అంటున్నారని ఆరోపించారు. విద్యార్థులను రెచ్చగొడుతూ ప్రభుత్వం తప్పు చేస్తుందని అభద్రతా భావంతో మాట్లాడుతున్నారని తెలిపారు. .
20 సంవత్సరాలుగా హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి సంబంధం లేకుండా ఆ స్థలాన్ని కోర్టులో కొట్లాడి హక్కుగా ప్రభుత్వానికి వచ్చిన భూమిని ఇప్పుడు యూనివర్సిటీ అధికారులు ఎలా మాట్లాడుతారని ప్రశ్నించారు. విద్యార్థులు రాజకీయ నాయకుల మాటలకు ప్రేరేపితం కావొద్దని కోరారు. అసలు ఎజెండా, అసలు రహస్యం ఇక్కడ పారిశ్రామికంగా అభివృద్ధి చెందితే బీఆర్ఎస్ నాయకుడు రాజపుష్ప, మై హోమ్ రామేశ్వరరావు ఐలాండ్ లు కట్టి రేపు అమ్ముకోవడానికి ఇబ్బందులు అవుతాయని ఇలా చేస్తున్నారని ఆరోపించారు. ఇద్దరు ప్రముఖ బిల్డర్లు వారిద్దరి రియల్ ఎస్టేట్ బిల్డింగులు కాపాడుకోవడానికి హిడెన్ ఏజెండాగా బిఆర్ఎస్ బిజెపి చేస్తుందని విమర్శించారు. అబద్దాలు దుష్ప్రచార ప్రచారం చేస్తే చూస్తు ఊరుకోబోమని హెచ్చరించారు.
కరీంనగర్ నీటి కష్టాలు రానివ్వం…
కరీంనగర్ సమీపంలోని లోయర్ మానేర్ డ్యామ్ లో నీటిమట్టం డెడ్ స్టోరేజ్ చేరిందని, నీటి కష్టాలు రాబోతున్నాయని కొందరు రాజకీయం చేస్తున్నారని కరీంనగర్ కు త్రాగునీటి కష్టాలు రానివ్వమని పొన్నం ప్రభాకర్ స్పష్టం చేశారు. గత సంవత్సరం ఈ రోజుకి లోయర్ మానేరు డ్యామ్ లో 5 టీ.ఎం.సి.లు ఉంటే ఈ సంవత్సరం 5.7 టీ.ఎం.సిల నీళ్ళు ఉన్నాయని తెలిపారు. లోయర్ మానేర్ డ్యామ్ త్రాగునీరు అవసరాల కోసం జూలై 31వ వరకు సుమారు 6.90 టీ.ఎం.సి.లు అవసరం పడుతుందన్నారు.
సాగు నీటి అవసరాల కోసం ఈనెల 6 వరకు సుమారు 2500 క్యూసెక్కులతో జోన్-2 ఆయకట్టుకు నీటి సరఫరా చేయడం జరుగుతుందని, మిడ్ మానేర్ నుంచి రోజుకు మూడు వేల క్యూసెక్కుల నీరు సప్లై చేయడం జరుగుతుందన్నారు. తద్వారా జూలై 31 వరకు త్రాగు నీటి కోసం లోయర్ మానేరు డ్యాంలో అవసరమైన నీరు నిలువ ఉంటుందని తాగునీటికి ఎలాంటి ఇబ్బంది ఉండదని స్పష్టం చేశారు.
(రిపోర్టింగ్ కె వి రెడ్డి ఉమ్మడి కరీంనగర్ జిల్లా కరస్పాండెంట్ హిందుస్థాన్ టైమ్స్ తెలుగు)
సంబంధిత కథనం
టాపిక్