


Best Web Hosting Provider In India 2024

Wednesday Motivation: బంగారం ప్రకాశించాలంటే నిప్పులో కాలాల్సిందే, విజయం పొందాలంటే అడ్డంకుల్ని దాటాల్సిందే, ఈ కథ చదవండి
Wednesday Motivation: అడ్డంకులు దాటకుండా, కష్టాలు పడకుండా ఎవరూ విజయాన్ని చేరుకోలేరు. లక్ష్యాన్ని సాధించలేరు. కానీ చాలామంది అడ్డంకులకు, కష్టాలకు భయపడి అసలు ప్రయత్నమే చేయరు. మీరు కూడా ఇలా చేస్తే ఈ స్ఫూర్తివంతమైన కథనం చదవండి.

అనగనగా ఒక రైతు. చాలా పురాతన కాలంలో జీవించేవాడు. ఆ రైతు పంటలు వేస్తున్నప్పుడు చెడిపోతూ ఉండేది. కొన్నిసార్లు భారీ వర్షాలు వచ్చేవి. కొన్నిసార్లు ఎండలు ఎక్కువ అయ్యేవి. కొన్నిసార్లు చలివేసేది. దీనివల్ల పంటలు సగం సగం మాత్రమే చేతికి వచ్చేవి.
దీంతో రైతుకు చాలా అసంతృప్తి కలిగేది. అతను ఎప్పుడూ దేవుడిని తిడుతూ ఉండేవాడు. దేవుడు అంటే అతనికి విపరీతమైన కోపం పెరిగిపోయింది. ఎప్పుడూ శపిస్తూ ఉంటాడు. దేవుడికి రైతు తిట్టిన తిట్లన్నీ వినిపించేవి. ఎప్పుడు చూసినా తననే తిడుతూ ఉంటాడు ఏంటని దేవుడు కూడా ఆలోచించాడు. ఒకరోజు రైతుకు దేవుడు ప్రత్యక్షమయ్యాడు.
రైతు కోరిక
రైతు… దేవుడితో ‘ఓ ప్రభూ నీకు వ్యవసాయం గురించి ఏమీ తెలియదు. ఎప్పుడూ వర్షం కురిపించాలో తెలీదు. ఎప్పుడు వేడిని పెంచాలో, ఎప్పుడు చలిని తగ్గించాలో తెలియదు. నీవల్లే నా పంట పాడైపోతుంది. దయచేసి పంటకాలంలో సరైన వాతావరణం ఉండేలా చూడు. నేను ఎలా కోరుకుంటానో అలానే వాతావరణం ఉంటే మంచిది. అప్పుడు నా పంటలు బాగా పండుతాయి’ అని అన్నాడు.
రైతు కోరిన కోరిక విని దేవుడు చిన్నగా నవ్వుకున్నాడు. తాను చెప్పాలనుకున్నది మాటలలో కాకుండా చేతల్లోనే చూపించాలనుకున్నాడు. అందుకే రైతుతో ‘తప్పకుండా నువ్వు కోరుకున్నది జరుగుతుంది’ అని చెప్పి అంతర్ధానం అయ్యాడు.
పంట లేదు
మరుసటి రోజు నుంచి రైతు వాతావరణం ఎలా ఉండాలని కోరుకుంటాడో అలాగే మారడం మొదలుపెట్టింది. అతను గోధుమ పంటను వేశాడు. వర్షం కురవమని కోరుకున్నప్పుడు వర్షం కురిసేది. ఎండ తగ్గమన్నప్పుడు ఎండ తగ్గేది. వాతావరణం తనకి నచ్చినట్టు మారేది. అలా పొలాలు కూడా పచ్చగా పెరిగాయి. పచ్చని పొలాలను చూసి ఆ రైతు ఆనందం ఇంతా అంతా కాదు. ఇక కోతల సమయం కూడా వచ్చేసింది. ఊరందరినీ పిలిచి కోతలు మొదలుపెట్టాడు. గోధుమ కంకులను తీసి ఒకచోట పెట్టారు. కానీ ఆ కంకులలో గోధుమ గింజలు లేవు. కేవలం ఖాళీగా ఉన్నాయి. అది చూసి రైతు చాలా ఆశ్చర్యపోయాడు.
మళ్లీ దేవుడిని తిట్టుకోవడం మొదలుపెట్టాడు రైతు. ‘ఈ దేవుడు మళ్లీ నాకు ఏదో తిరకాసు పెట్టాడు. నేను కోరుకున్నట్టు వాతావరణం ఉన్నా కూడా పంట పండలేదు’ అని దేవుడినే తిట్టడం ప్రారంభించాడు. ఆ తిట్లు విన్న దేవుడు మళ్లీ ప్రత్యక్షమయ్యాడు.
‘ఓ రైతయ్య నువ్వు కోరుకున్నట్టే ఇవన్నీ చేశాను కదా. నువ్వు కోరుకున్నప్పుడే వర్షం పడింది. నువ్వు కోరుకున్నప్పుడే ఎండ కాసింది. నువ్వు వద్దనుకుంటే చలి తగ్గిపోయింది. కానీ ఇప్పుడు కూడా నన్నే ఎందుకు తిడుతున్నావ్’ అని అడిగాడు. అప్పుడు రైతు ‘అన్నీ ఇచ్చావు కానీ, పంట ఎక్కడ ఇచ్చావు? గోధుమ గింజలే లేవు. కేవలం మొక్కలే పెరిగాయి’ అంటూ నిట్టూర్చాడు.
ఎదురుదెబ్బలు తింటేనే
అప్పుడు దేవుడు అసలు విషయాన్ని వివరించాడు. ఒక మొక్క ఎదగాలంటే ముందుగా తనను తాను రక్షించుకోవాలి. మండే ఎండల నుంచి బలమైన గాలులనుంచి భారీ వర్షాల నుంచి తప్పించుకున్న పంటే పొడవుగా పెరగడం మొదలు పెడుతుంది. అందుకే మేము రకరకాల వాతావరణ పరిస్థితులను కల్పిస్తాము.
బంగారం మంటల్లో కాలితేనే
బంగారం ప్రకాశించాలంటే నిప్పుల్లో వేడి చేయాల్సిందే కదా. పంటకు కూడా పోరాటం అవసరమే అన్నాడు దేవుడు. రైతు అసలు విషయాన్ని అర్థం చేసుకున్నాడు. తన తప్పును గ్రహించాడు. వాతావరణం తాను కోరుకున్నట్టు కాదు.. ప్రకృతికి అవసరమైనట్టు ఉండాలని అర్థం చేసుకున్నాడు.
ఈ కథ మనకేం చెబుతుందో తెలుసా? మన జీవితంలో ఎన్ని అడ్డంకులు వచ్చినా కూడా ఆగిపోకూడదు. ఆ అడ్డంకులు వస్తేనే మంచిది. వాటిని దాటే ప్రయత్నంలో మన ప్రతిభ మెరుగుపడుతుంది. మనలో ధైర్యం పెరుగుతుంది. భవిష్యత్తులో వచ్చే ఎలాంటి సమస్యలనైనా తట్టుకునే శక్తి మనకి వస్తుంది. కాబట్టి అడ్డంకులకు, ఓటమికి భయపడి అక్కడే ఆగిపోకండి. వాటిని దాటి ముందుకు వెళ్లేందుకు సిద్ధపడండి.
సంబంధిత కథనం