Best Web Hosting Provider In India 2024

Karthika Deepam 2 Today April 2: దీపకు ఎదురుదెబ్బ.. జ్యోత్స్న ప్లాన్ సక్సెస్.. తాత, సుమిత్ర ఆగ్రహం, దశరథ్ డౌట్
Karthika Deepam 2 Serial Today Episode April 2: గౌతమ్ తప్పును నిరూపించాలనుకున్న దీపకు నిరాశ ఎదురైంది. జ్యోత్స్న ప్లాన్ సక్సెస్ అవుతుంది. దీంతో దీపను శివన్నారాయణ, సుమిత్ర మళ్లీ చాలా మాటలు అంటారు. దశరథ్ మాత్రం డౌట్ పడతాడు. కార్తీక దీపం 2 నేటి ఎపిసోడ్‍లో పూర్తిగా ఏం జరిగిందో ఇక్కడ చూడండి.
కార్తీక దీపం 2 నేటి (ఏప్రిల్ 2) ఎపిసోడ్ ఇలా: గౌతమ్ చెడ్డోడని నిరూపించేందుకు రమ్యను శివన్నారాయణ ఇంటికి తీసుకొస్తుంది దీప. నిన్ను మోసం చేసింది గౌతమ్ అనే నిజాన్ని చెప్పాలని రమ్యతో అంటుంది దీప. రమ్య మాత్రం ‘నా కడుపులో పెరుగుతున్న బిడ్డకు తండ్రి’ అంటూ నానుస్తూ ఉంటుంది. గౌతమ్ పేరు మాత్రం చెప్పదు. చెప్పిందే ఎందుకు చెబుతున్నావ్.. పూర్తిగా చెప్పు అని పారిజాతం చిరాకు పడుతుంది. రమ్య నిజం చెప్పేందుకు రెడీ అవుతుంటే.. సత్తిపండు అనే వ్యక్తి ఎంట్రీ ఇస్తాడు.
ఆ బిడ్డకు తండ్రి నేనే
సత్తిపండు రాగానే ధీమాగా చేతులు కట్టుకుంటుంది జ్యోత్స్న. ఎవడ్రా నువ్వు అని పారిజాతం అంటుంది. ఇదిగో ఈ రమ్య మొగుడిని అని అబద్ధం చెబుతాడు సత్తిపండు. భలే టైమ్‍కు వచ్చావ్ రా నువ్వు అని మనసులో అనుకుంటుంది జ్యోత్స్న. ఏ నువ్వు రమ్య భర్తవా అని దీప ప్రశ్నిస్తుంది. ఏంటి రమ్య అలా చూస్తున్నావని ఆమె చేతిని నలిపి అబద్ధం చెప్పాలని సత్తిపండు ఒత్తిడి చేస్తాడు. దీంతో రమ్య ఏమీ మాట్లాడకుండా ఉండిపోతుంది. నేను నీ భర్త అని, నీ కడుపులో పెరుగుతున్న బిడ్డకు తండ్రి నేనే అని చెప్పు అని రమ్యతో సత్తిపండు అంటాడు. రమ్య మాత్రం మౌనంగానే కంగారు పడుతూ ఉంటుంది.
డబ్బులిచ్చి అబద్ధం చెప్పిస్తున్నారు
రమ్య కడుపులో ఉన్న బిడ్డకు తండ్రి నేనే అని సత్తిపండు అంటాడు. ఎందుకు అబద్ధం చెబుతున్నావని దీప నిలదీస్తుంది. నిన్ను గౌతమ్ పంపించాడా అని అడుగుతుంది. దీంతో సత్తిపండు రివర్స్ అవుతాడు. రమ్యకు డబ్బులిచ్చి దీప అబద్ధం చెప్పించాలని చూస్తోందని ఆరోపిస్తాడు. “ఆ బిడ్డకు తండ్రి గౌతమ్ అని దీప అంటోంది.. నేనే తండ్రి అని నువ్వంటున్నావ్. ఏదిరా నిజం” అని సత్తిపండును పారిజాతం అడుగుతుంది. నేను చెప్పిందే నిజం అని దీప అంటుంది.
డబ్బులు ఇస్తే ఇలాంటివి చెప్పేందుకు మా వీధిలో ఇంటికి ఒకరు ఉన్నారని సత్తిపండు అంటాడు. ఇదంతా ప్లాన్ చేసిన జ్యోత్స్న సంతోషంగా చూస్తుంటుంది. అబద్దాలు చెప్పడం మా వృత్తి అని సత్తిపండు అంటాడు. ఇది కూడా అబద్ధమే, రమ్య నువ్వు మాట్లాడు, వీడు నీ మొగుడు కాదు కదా అని దీప అడుగుతుంది. రమ్య మాత్రం భయంగా చూస్తూ ఏమీ మాట్లాడదు.
డబ్బులు ఇచ్చి తీసుకొచ్చావా
ఈ అమ్మాయిని డబ్బులు ఇచ్చి తీసుకొచ్చావా దీప అని సుమిత్ర అనుమానంగా అడుగుతుంది. అబద్ధం చెప్పేందుకు నా పెళ్లానికి రూ.10వేలకు బేరం కుదుర్చుందని సత్తిపండు అబద్ధమాడతాడు. నిజం చెప్పకపోతే కొడతానని దీప అంటుంది. నా భార్య అయితే రమ్య మెడలో తాళి ఏదని ప్రశ్నిస్తుంది. తాళి తీసేయాలని మీరే చెప్పి ఉంటారని, ఇంట్లో గోడకు వెళాడుతోందని సత్తిపండు అంటాడు.
నిజం చెప్పు
ధైర్యంగా నిజం చెప్పాలని, మౌనంగా వెళ్లిపోవద్దని రమ్యను దీప అడుగుతుంది. వద్దు అన్నట్టుగా రమ్య చేయి నులిమేస్తాడు సత్తిపండు. “వీడు మా పేటలోనే పెద్ద రౌడీ.. ఈ వెధవ మాట గానీ వినలేదంటే.. మా అమ్మానాన్నను చంపేస్తాడు. వీడిని ఆ గౌతమే పంపించి ఉంటాడు” అని రమ్య మనసులోనే భయపడుతుంది.
ఫలించిన జ్యోత్స్న కుట్ర
“వాడిని పంపించింది నేను. వాడు వచ్చేలోపు నిజం ఎక్కడ చెప్పేస్తావో అని టెన్షన్ పడ్డా” అని మనసులో అనుకుంటుంది జ్యోత్స్న. ప్లీజ్ రమ్య నిజం చెప్పు అని దీప అడుగుతుంది. నా పెళ్లాం నాకు ఎందుకు భయపడుతుంది అని సత్తిపండు అంటాడు. నీకు నువ్వే అన్యాయం చేసుకోవద్దని దీప చెబుతుంది. ఇంతలో రమ్యను తీసుకొని సత్తిపండు వెళ్లిపోతాడు. గౌతమ్ గురించి నిజం బయటపడకుండా, దీప కుట్రతో ఇదంతా చేస్తోందని అందరూ అనుకునేలా జ్యోత్స్న చేసిన ఈ ప్లాన్ సక్సెస్ అవుతుంది.
దీపకు ఎదురుదెబ్బ.. మనిషివేనా అంటూ తాత ఫైర్
ఇదంతా కిటీకీలో నుంచి చూస్తుంటాడు శ్రీధర్. దీపను ఫాలో అయి మంచి పని చేశానని అనుకుంటాడు. గౌతమ్ తప్పును నిరూపించాలనుకున్న దీపకు మళ్లీ ఎదురుదెబ్బ తగులుతుంది. ఆ రమ్య అంటూ దీప ఏదో చెప్పబోతే.. బుద్ధి ఉందా నీకు అని తాత శివన్నారాయణ గట్టిగా అరుస్తాడు. మనిషివేనా.. ఊపిరి పీల్చుకునే అవకాశం లేకుండా చంపేయ్ అంటూ నానా మాటలు అంటాడు. నిందేసి నా మనవరాలి నిశ్చితార్థాన్ని ఆపావు.. ఆ నిందను నిజం చేసేందుకు నకిలీ సాక్ష్యాన్ని తీసుకొస్తావా అంటూ ఆగ్రహిస్తాడు.
ఆ అబ్బాయి చెప్పిందే నిజం
లేదు తాతయ్య గారు.. రమ్యను గౌతమ్ మోసం చేశాడని దీప కన్నీటితో అంటుంది. మరి సత్తిపండును భర్తగా, తన కడుపులోని బిడ్డకు తండ్రిగా రమ్య ఎందుకు ఒప్పుకుందని దశరథ్ ప్రశ్నిస్తాడు. రమ్య ఏమీ అనలేదంటే ఆ అబ్బాయి చెప్పిందే నిజం అని సుమిత్ర అంటుంది. నువ్వు నిందను డబ్బుతో నిజం చేయాలనుకున్నావని ఫైర్ అవుతుంది. ఇలాంటి నీచమైన ఆలోచనలు నీకెందుకు వస్తున్నాయ్ దీప అంటూ నాటకాలు ఆడుతుంది జ్యోత్స్న. రమ్య అమ్మను తీసుకొస్తానని దీప అంటే.. ఈసారి ఎంత బేరం పెడతావని అవమానించేలా మాట్లాడతాడు శివన్నారాయణ.
మెడ పట్టుకొని గెంటమంటావా
తాతగారు అంటూ ఏడుస్తూ అంటుంది దీప. మర్యాదగా బయటికి వెళతావా.. మెడ పట్టుకొని బయటికి గెంటమంటావా అని గట్టిగా అరుస్తాడు శివన్నారాయణ. దీపను అవమానిస్తే కార్తీక్ బాధపడతాడని కుటిలంగా మాట్లాడుతుంది జ్యోత్స్న.
మనసు చచ్చిపోయింది
దీప నువ్వు ముందు బయటికిపో అని సుమిత్ర అంటుంది. ఇంకా ఇక్కడే ఉండి చూస్తున్నావ్ వెళ్లు అని పొగరుగా చెబుతుంది పారిజాతం. ఒకప్పుడు దీప అంటే కూతురు అనుకునే దాన్ని అని.. కానీ ఇప్పుడు అసహ్యం వేస్తోందని సుమిత్ర అంటుంది. మా జీవితాలకు దూరంగా ఉండాలని నానా మాటలు అంటుంది. నువ్వు కాపాడిన ప్రాణం బతికే ఉంది.. కానీ మనసు చచ్చిపోయిందని సుమిత్ర కోపంగా అంటుంది. మనిషిని కూడా చచ్చిపోకముందే వెళ్లిపో దీప అని అరుస్తుంది. దీంతో దీప ఎమోషనల్ అవుతుంది. కన్నీరు పెట్టుకుంటూ ఇంటి బయటికి వెళుతుంది.
దశరథ్ అనుమానం
దీప చెప్పింది అబద్ధం అయితే నిరూపించేందుకు ఆ అమ్మాయిని ఎందుకు తీసుకొచ్చిందని ఆలోచిస్తాడు దశరథ్. దీనికి జ్యోత్స్నకు ఏ సంబంధం లేదు కదా అని అనుమానిస్తాడు. విలపిస్తూనే గడప దాటుతుంది దీప. నాకు తెలియకుండా ఏదో జరుగుతోంది, కానీ జరుగుతోంది ఏదీ నమ్మకుండా ఉంది అని మనసులో అనుకుంటాడు దశరథ్.
మళ్లీ ఫూల్ అయ్యావ్
అమౌంట్ నీ అకౌంట్‍కు వచ్చింది చూసుకో అని సత్తిపండుకు ఫోన్ చేసి చెబుతుంది జ్యోత్స్న. రమ్య మళ్లీ నోరెత్తదు కదా అని జ్యోత్స్న అంటే.. నన్ను దాటి వెళ్లదని సత్తిపండు అంటాడు. దీప కంట్లో పడకు అని జ్యోత్స్న అంటుంది. నేను గౌతమ్‍ను కాపాడేందుకు వేరే కారణం ఉంది దీప.. కానీ నువ్వు ఫూల్ అయ్యావ్ అని మనసులో అనుకుంటుంది జ్యోత్స్న. “ఈసారి రమ్యే వచ్చి నిజం చెప్పినా ఎవరూ నమ్మరు.. నీకు బ్యాడ్‍టైమ్ స్టార్ అయిందని నీకు అర్థం కావాలి దీప. మీ ఇంట్లో వాళ్లు కూడా నిన్ను అసహ్యించుకునేలా చేస్తా. నిన్ను నమ్మే వాడు ఒక్కడు కూడా లేకుండా చేస్తా” అని అనుకుంటుంది జ్యోత్స్న.
జ్యోత్స్న గురించి రాసిన దాసు
దాసుకు మళ్లీ గతం గుర్తొస్తుంది. నిన్ను ఆపుతాను జ్యోత్స్న అని అనుకుంటూ ఉంటాడు. మా అమ్మ నీకు పెళ్లి చేసి ఆస్తి మొత్తం కట్టబెట్టాలని చూస్తోందని, దీన్ని ఆపుతానని అనుకుంటూ ఉంటాడు. మధ్యలో ఏమైనా జరిగితే తాను మరిచిపోతానని, ఆలోపు జ్యోత్స్న వారసురాలు కాదని కాగితం రాయాలని అనుకుంటాడు. కాగితం తీసుకొని రాస్తూ ఉంటాడు. ఇంతలో గ్లాస్ పట్టుకొని వస్తున్న స్వప్నను కాశీ ఢీకొడతాడు. గ్లాస్ కిందపడిన శబ్దం రావడంతో గతాన్ని మళ్లీ మరిచిపోతాడు దాసు. రాయడం ఆపేస్తాడు. పొరపాటు నీదేనని కాశీ, స్వప్న వాదించుకుంటారు. రెస్టారెంట్‍కు వచ్చి శివన్నారాయణ పెద్ద గొడవ చేశాడని స్వప్నకు కాశీ చెబుతాడు. దీప మంచితనాన్ని వాళ్లు ఎప్పుడు గుర్తిస్తారో అనేలా ఇద్దరూ మాట్లాడుకుంటారు.
ఏం చేయాలో అర్థం కావడం లేదు
దీప కోసం కాంచన, కార్తీక్ ఎదురుచూస్తుంటారు. దీప జీవితంలో చాలా ఇబ్బందులు పడిందని, అందరూ కావాలని అనుకుంటూ ఉంటుందని కార్తీక్ అంటాడు. కానీ అందరికీ శత్రువు అవుతోందని బాధపడతాడు. సుమిత్ర అత్త వచ్చి తిట్టింది.. తాత రెస్టారెంట్‍కు వచ్చి ఎంత బాధపెట్టాలో పెట్టాడు.. నాకేం చేయాలో అర్థం కావడం లేదని చెబుతాడు. ఇంతలో ఇంటికి దీప వస్తుంది. బాధగా నడిచి వస్తుంది.
దీప భయం.. శ్రీధర్ ఎంట్రీ
దీప.. ఎక్కడికి వెళ్లావ్, చెప్పి వెళ్లాలి కదా అని కార్తీక్ పశ్నిస్తాడు. గొడవ జరిగిన తర్వాత కనిపించకపోతే ఎంత కంగారు పడతామని అడుగుతాడు. ఆ ఇంటి దగ్గర జరిగింది కార్తీక్ బాబు చెబితే ఏమంటారో అని దీప మనసులో భయపడుతుంటుంది. ఇంతలో శ్రీధర్ ఎంట్రీ ఇస్తాడు. ఆ ప్రశ్నకు సమాధానం మీ ఆవిడ చెప్పదు రా, నేను చెప్తా అంటూ లోపలికి వస్తాడు. నన్ను రోడ్డు మీద చూసిన విషయం చెబుతారేమోనని దీప అనుకుంటుంది.
ఇల్లాలిని మార్చాలి
చిన్నమ్మకు ఫోన్ చెయ్ అని కార్తీక్ అంటే.. ఎందుకంటాడు శ్రీధర్. ఖాళీగా ఉంటే మెదడు పని చేయడం లేదేమో.. మా ఇంటికి ఎందుకు వచ్చావంటాడు కార్తీక్. నీ కళ్లు తెరిపించేందుకు అని శ్రీధర్ అంటాడు. మా కళ్లు తెరుచుకొని ఉన్నాయని కార్తీక్ వెటకారంగా అంటాడు. ఈ దరిద్రాన్ని మనం భరించలేమమ్మా.. ఇల్లు ఖాళీ చేసి దూరంగా ఎక్కడికైనా వెళ్లిపోదామని కాంచనతో కార్తీక్ అంటాడు. ఎందుకు అని శ్రీధర్ ప్రశ్నిస్తే.. మనశ్శాంతి కోసమని బదులిస్తాడు కార్తీక్. “నీకు నిజంగా మనశ్శాంతే కావాలంటే.. మార్చాల్సింది ఇంటిని కాదు.. ఇల్లాలిని” అని శ్రీధర్ అంటాడు. దీంతో కార్తీక దీపం 2 నేటి (ఏప్రిల్ 2) ఎపిసోడ్ ముగిసింది.