




Best Web Hosting Provider In India 2024

Reliance CBG Plant: నేడు కనిగిరిలో రిలయన్స్ సీబీజీ ప్లాంట్ శంకుస్థాపన చేయనున్న అనంత్ అంబానీ, నారా లోకేష్
Reliance CBG Plant: కర్బన ఉద్గారాలను గణనీయంగా తగ్గించే లక్ష్యంతో ఏపీ ప్రభుత్వం రిలయన్స్ ఇండస్ట్రీస్‌తో కలిసి కంప్రెస్డ్ బయో గ్యాస్ ప్లాంట్ ఏర్పాటు చేస్తోంది. ప్రకాశం జిల్లా కనిగిరిలో రూ.65వేల కోట్ల పెట్టుబడులతో ఏర్పాటయ్యే ప్లాంట్‌కు బుధవారం మంత్రి నారా లోకేష్,అనంత్ అంబానీ శంకుస్థాపన చేస్తారు.

Reliance CBG Plant: భారత్ లో 2035 నాటికి కర్బన ఉద్గారాలను జీరో స్థాయికి తేవడమే లక్ష్యంగా సాంప్రదాయేతర ఇంధన వనరులను అభివృద్ధి చేసే లక్ష్యంతో కంప్రెస్డ్ బయో గ్యాస్ వినియోగానికి కృషి జరుగుతోంది. మంత్రి నారా లోకేష్ చొరవతో రిలయన్స్ ఇండస్ట్రీస్ రూ.65వేలకోట్లతో 500 కంప్రెస్డ్ బయో గ్యాస్ (సిబిజి) ప్లాంట్లు ఏర్పాటు చేసేందుకు ఏపీ ప్రభుత్వంతో అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది.
రిలయన్స్ తొలి సీబీజీ ప్లాంట్ కు ప్రకాశం జిల్లా కనిగిరిలో ఏప్రిల్ 2వ తేదీన మంత్రి నారా లోకేష్, అనంత్ అంబానీలు కలిసి శంకుస్థాపన చేయనున్నారు. రిలయన్స్ ఆధ్వర్యంలో కనిగిరి ప్రాంతంలో ఏర్పాటు చేయబోయే మొదటి కంప్రెస్డ్ బయో గ్యాస్ (సీబీజీ) ప్లాంట్ కు సంబంధించి ఏప్రిల్ 2వ తేదీ జరిగే శంకుస్థాపన కార్యక్రమంలో రాష్ట్ర మంత్రి నారా లోకేష్, రిలయన్స్ అనంత్ అంబానీలు సంయుక్తంగా పాల్గొంటారని ఇంధన శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ వివరించారు.
సీబీజీ ప్లాంట్ శంకుస్థాపన ఏర్పాట్లను పర్యవేక్షించిన మంత్రి గొట్టిపాటి అధికారులకు పలు సూచనలు చేశారు.కూటమి ప్రభుత్వం ఏర్పడిన తరువాత నిరుద్యోగులకు ఉద్యోగ కల్పనతో పాటు రైతుల ఆర్థిక స్థితి మెరుగు పరచడానికి అనేక చర్యలు చేపడుతున్నామని వెల్లడించారు. ఇందులో భాగంగానే నిరుపయోగంగా ఉన్న భూములను సీబీజీ ప్లాంట్ల నిర్మాణంలో భాగస్వామ్యం చేస్తున్నామని తెలిపారు.
కౌలుకు ఇచ్చినా రూ. 4, 5 వేలు మాత్రమే వచ్చే భూములతో పాటు… వేసిన పంట చేతికి కూడా రాని భూములను ఇందుకోసం గుర్తించినట్లు మంత్రి వివరించారు. ఇటువంటి భూములను కౌలుకు ఇస్తే రైతుకు రూ.31 వేలు, ప్రభుత్వ భూములకు రూ.15 వేలు వరకు ఆదాయం వస్తుందని తెలిపారు. కౌలుకు ఇవ్వక పోయినా ప్లాంట్ కు అవసరం అయిన గడ్డిని పండించి ఇచ్చినా… అన్నదాతకు ఆర్థిక లాభం కలుగుతుందని పేర్కొన్నారు. ప్లాంట్ చుట్టు పక్కల ప్రాంతాల ప్రజలకు ఉపాధి కలుగుతుందని మంత్రి గొట్టిపాటి తెలిపారు.
500 ప్లాంట్లతో వేలాది మందికి ఉపాధి… వలసలు తగ్గుముఖం..
రాష్ట్రవ్యాప్తంగా ఉన్న నిరుపయోగమైన భూముల్లో సుమారు 500 సీబీజీ ప్లాంట్ల నిర్మాణానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆలోచనలకు అనుగుణంగా కూటమి ప్రభుత్వం ప్రణాళిక సిద్ధం చేసిందని మంత్రి గొట్టిపాటి వివరించారు. ప్రస్తుతం కనిగిరి ప్రాంతంలో 100 టన్నుల కెపాసిటీతో ప్లాంట్ నిర్మాణం చేపడుతున్నట్లు వివరించారు. ప్లాంట్ల నిర్మాణానికి సుమారు 5,000 ఎకరాలను కేటాయించామన్నారు.
కనిగిరితో పాటు గిద్దలూరు, మార్కాపురం, దర్శితో పాటు కొండెపిలోనూ ప్లాంట్ల నిర్మాణాలను చేపడతామన్నారు. 20 టన్నుల కెపాసిటీ కలిగిన ఒక్కో సాధారణ ప్లాంట్ నిర్మాణంతో సుమారు 250 నుంచి 500 మందికి ప్రత్యక్ష, పరోక్ష ఉపాధి లభిస్తుందని మంత్రి గొట్టిపాటి తెలిపారు. దీనితో పనులు లేక ఆర్థిక ఇబ్బందులతో వలసలు వెళ్లే అవసరం ఆ ప్రాంత ప్రజలకు ఇకపై తగ్గుతుందని చెప్పారు. మొత్తం ప్లాంట్ల నిర్మాణాలన్నీ పూర్తయితే వేలాది మంది నిరుద్యోగులకు ఉద్యోగాలు లభించడంతో పాటు, రైతులకూ ఆర్థిక లాభం కలుగుతుందన్నారు. ఐదేళ్లలో 20 లక్షల ఉద్యోగాల కల్పనలో భాగంగా గ్రామీణ ప్రాంతాల్లో సీబీజీ ప్లాంట్ల నిర్మాణాలను కూటమి ప్రభుత్వం ప్రోత్సహిస్తుందని మంత్రి గొట్టిపాటి పేర్కొన్నారు.
ఏటా 40లక్షల మెట్రిక్ టన్నుల సీబీజీ
కనిగిరిలో ఏర్పాటయ్య ప్లాంట్ బయో ఇంధన రంగంలో ఇదొక మైలురాయిగా నిలవనుంది. రాబోయే 5ఏళ్లలో రిలయన్స్ ఏర్పాటుచేసే 500 సిబిజి ప్లాంట్లకు అనుబంధంగా ఎనర్జీ ప్లాంటేషన్ ద్వారా 5లక్షల ఎకరాల బంజరుభూమి ఉపయోగంలోకి వస్తుంది. రాష్ట్రంలో 2.5లక్షల మందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉద్యోగావకాశాలు లభిస్తాయి.
అన్నిప్లాంట్లు ఉత్పత్తి ప్రారంభిస్తే ప్రతిఏటా 40లక్షల మెట్రిక్ టన్నుల కంప్రెస్డ్ బయోగ్యాస్ ఉత్పత్తి అవుతుంది. వ్యవసాయ అవశేషాలు, పారిశ్రామిక వ్యర్థాలు, మున్సిపల్ ఘన వ్యర్థాలు, ఇంధన పంటల ఆధారంగా రిలయన్స్ సంస్థ పాన్ ఇండియా CBG ప్లాంట్లను నిరర్థక భూముల్లో ఏర్పాటు చేస్తోంది.
రిలయన్స్ సంస్థ దేశవ్యాప్తంగా 4 ఇంటిగ్రేటెడ్ సిబిజి హబ్ లను విభిన్న బంజరుభూముల్లో ఏర్పాటుచేస్తుండగా, అందులో ప్రకాశం జిల్లాలో ఒక హబ్ ఏర్పాటుచేస్తోంది.
ఆంధ్రప్రదేశ్ లోని ప్రకాశం, అనంతపూర్, చిత్తూరు, కడప జిల్లాల్లో అధికంగా బంజరుభూములు ఉన్న ప్లాంతాల్లో సిబిజి ప్లాంట్లను ఏర్పాటుచేస్తారు. రాష్ట్రంలోని నిరర్థక భూముల్లో కేవలం 3నుంచి 4శాతం భూమిలో ఎనర్జీ క్రాప్స్ ద్వారా పునరుత్పాదక ఇంధనాన్ని ఉత్పత్తి చేసే లక్ష్యంతో రిలయన్స్ 500 ఇంటిగ్రేటేడ్ సిబిజి ప్లాంట్లను ఏర్పాటుచేస్తోంది.
బంజరు భూములకు పునరుజ్జీవనం…
సిబిజి ప్లాంట్, క్యాప్టివ్ ఎనర్జీ ప్లాంటేషన్ కోసం ప్రతిప్లాంటుకు వెయ్యి ఎకరాల బంజరుభూమి అవసరమవుతుంది. ఒక సిబిజి ప్లాంటు నెలకొల్పడానికి రిలయన్స్ బయో ఎనర్జీ సంస్థ రూ.130 కోట్లు ఖర్చు చేస్తుంది. ఇందులో ప్లాంటు ఏర్పాటుకు రూ.105కోట్లు, సమీప బంజరుభూముల పునరుజ్జీవనానికి రూ.25కోట్లు వెచ్చిస్తుంది. ప్రతి సిబిజి ప్లాంటు ఏటా 7,800 మెట్రిక్ టన్నుల కంప్రెస్డ్ బయోగ్యాస్ తో పాటు 22వేల మెట్రిటన్నుల హైక్వాలిటీ ఫెర్మినేటెడ్ మాన్యూర్ ను ఉత్పత్తిచేస్తుంది. దీనిద్వారా 3వేల ఎకరాల భూమిని సారవంతంగా మార్చవచ్చు.
లక్షలాది ఎకరాలకు మేలు…
రాష్ట్రంలో నిరుపయోగంగా ఉన్న 5.5లక్షల బంజరుభూముల్లో హైబ్రిడ్ నేపియర్ గ్రాస్, ఇతర ఎనర్జీ పంటలను పెంచడం ద్వారా ఇంటిగ్రేటెడ్ సిబిజి ప్లాంట్లను నెలకొల్పాలని రిలయన్స్ సంస్థ నిర్ణయించింది. సిబిజి ప్లాంట్ల నుంచి ఉత్పత్తి అయ్యే గ్రీన్ ఫెర్టిలైజర్ ను ఉపయోగించి నిరర్థక భూములను ఉత్పాదక భూములుగా మారుస్తారు. దీనిద్వారా ప్లాంట్లు నెలకొల్పే ప్రాంతాల్లో యువతకు ఉపాధి లభిస్తుంది.
రిలయన్స్ సిబిజి పెట్టుబడుల ద్వారా రాష్ట్రంలోని గ్రామీణ ప్రాంతాల్లో ఆర్థిక కార్యకలాపాలు మెరుగవుతాయి. సిబిజి ప్లాంట్ లకు సమీపంలో ఉత్పత్తి అయ్యే సేంద్రీయ ఎరువుతో సమీప ప్రాంత నిరర్థక భూములను సారవంతంగా మార్చడానికి ఆస్కారమేర్పడుతుంది. భారత్ లో 13 కేటగిరిలకు చెందిన 160 మిలియన్ ఎకరాల బంజరుభూమి ఉండగా, వాతావరణంలో మార్పుల కారణంగా ప్రతిఏటా నిరర్థక భూమి పెరుగుతూ వస్తోంది.
దేశంలోని మొత్తం బంజరుభూమిలో 50శాతం భూమి రాజస్థాన్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, గుజరాత్ రాష్ట్రాల్లోనే ఉంది. సిబిజి ప్లాంట్ల ఏర్పాటు ద్వారా పెద్దఎత్తున పారిశ్రామికీకరణ జరిగి జిడిపి వృద్ధి చెందుతుంది. అన్నిసిబిజి ప్లాంట్లలో ఉత్పత్తి ప్రారంభమైతే రోజుకు 9.75 లక్షల ఎల్ సివిలను నింపుతుంది. ఇది మొత్తం ఇంధన అవసరాల్లో 5శాతాన్ని భర్తీ చేస్తుంది. సిబిజి ప్లాంట్ల ద్వారా ఉత్పత్తి అయ్యే 110లక్షల మెట్రిక్ టన్నుల సేంద్రీయ ఎరువు ద్వారా 15లక్షల ఎకరాల భూములను సారవంతంగా మార్చేందుకు ఉపకరిస్తుంది.
సంబంధిత కథనం
టాపిక్