


Best Web Hosting Provider In India 2024

Nani: దర్శకులు, నిర్మాతలను వేరే హీరోల దగ్గరికి వెళ్లమన్నా: నాని ఇంట్రెస్టింగ్ కామెంట్లు.. హిట్ 3 గురించి కూడా..
Nani: కొన్ని కథలను తాను వేరే నటుల దగ్గరికి పంపించానని హీరో నాని చెప్పారు. హిట్ 3 సినిమా ఎలా ఉంటుందో కూడా చెప్పారు. తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్వూలో ఆసక్తికర విషయాలు పంచుకున్నారు నాని.

నేచురల్ స్టార్ నాని ప్రస్తుతం ఫుల్ ఫామ్‍లో ఉన్నారు. దసరా, హాయ్ నాన్న, సరిపోదా శనివారం చిత్రాలతో వరుసగా హ్యాట్రిక్ బ్లాక్‍బస్టర్లు సాధించారు. నాని హీరోగా నటించిన హిట్ 3 చిత్రం మే 1న రిలీజ్ కానుంది. ఆ క్రైమ్ థ్రిల్లర్ చిత్రంపై ఫుల్ హైప్ ఉంది. శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో నాని చేయనున్న ది ప్యారడైజ్ చిత్రం ఒక్క గ్లింప్స్‌తోనే భారీ క్రేజ్ తెచ్చుకుంది. తాజాగా హీరో నాని ఓ ఇంటర్వ్యూలో ఇంట్రెస్టింగ్ విషయాలు వెల్లడించారు.
ఆ కథలను వేరే నటుల వద్దకు..
తాను కొన్నేళ్లుగా చాలా కథలను విన్నానని నాని చెప్పారు. కచ్చితంగా బ్లాక్‍బస్టర్ అవుతాయని తాను నమ్మిన కొన్ని కథలను, వాటికి మరింత బాగా సూటయ్యే నటులకు చెప్పాలని నిర్మాతలు, దర్శకులకు సూచించినట్టు నాని తెలిపారు.
మంచి సినిమాను సపోర్ట్ చేయడమే తన బాధ్యత అని ది హాలీవుడ్ రిపోర్టర్ ఇండియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో నాని చెప్పారు. “ఐదారేళ్లుగా నేను చాలా కథలు విన్నా. వాటిలో కొన్ని కచ్చితంగా బ్లాక్‍బస్టర్ అవుతాయని నమ్మాను. అయితే, ఆ సినిమాకు ఇంకా బాగా సూటవుతారని అనుకునే వేరే యాక్టర్లను దర్శకులు, నిర్మాతలకు నేను సూచించా. మంచి సినిమాలను సపోర్ట్ చేయడం నా బాధ్యత” అని నాని అన్నారు.
బలగం ఫేమ్ డైరెక్టర్ వేణు యెల్దండితో ఎల్లమ్మ అనే మూవీకి ముందుగా నాని ఓకే చెప్పారు. అయితే, ఆ తర్వాత ఆ చిత్రం నితిన్ వద్దకు వెళ్లింది. ఆ కథకు నితిన్ బాగా సూటవుతారని నానినే వేణు సూచించినట్టు రూమర్లు కూడా వచ్చాయి.
చిరంజీవి అంటే అంతకు మించి..
మెగాస్టార్ చిరంజీవి అంటే డ్యాన్స్, యాక్షన్ అని చాలా మంది అంటారని, కానీ అంతకు మించి చాలా అని నాని అన్నారు. కొన్నాళ్లుగా అది మిస్ అవుతోందని చెప్పారు. చిరంజీవితో శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్ చాలా ఆసక్తికరంగా ఉంటుందని తెలిపారు. చిరూ నుంచి ఇటీవలి కాలంలో మిస్ అవుతున్నది శ్రీకాంత్ బయటికి తెస్తారని నమ్ముతున్నట్టు చెప్పారు.
హిట్ 3 వైలెంట్‍గా..
హిట్ 3 సినిమాలో వైలెన్స్ ఎక్కువగా ఉంటుందని నాని చెప్పారు. అయితే, హింసను కావాలని పెట్టలేదని, ఆ జానర్ అలాంటిదని అన్నారు. కథలో ఇంటెన్సిటికి సూటయ్యేలా ఉంటుందని తెలిపారు. హిట్ ఫ్రాంచైజీలో ఈ మూడో పార్ట్ ఎక్కువగా మాసీగా ఉంటుందని అన్నారు.
ఏం చేసినా ఎవరో ఒకరు ఏదో ఒకటి అంటూనే ఉంటారని నాని అన్నారు. కొందరు బాగుందని అన్నది మరికొందరు దారుణంగా ఉందని కూడా అంటారని చెప్పారు. ప్రస్తుత కాలంలో గొప్ప వ్యక్తులు కూడా విమర్శలను ఎదుర్కోవాల్సి వస్తోందని నాని అన్నారు.
హిట్ 3 మూవీకి శైలేశ్ కొలను దర్శకత్వం వహించారు. ఇటీవలే వచ్చిన టీజర్ క్యూరియాసిటీని మరింత పెంచింది. ఈ సినిమ ఎంత వైలెంట్‍గా ఉండనుందో, నాని పాత్ర ఎంత ఇంటెన్సిటితో ఉంటుందో అర్థమైంది. ఈ హిట్ 3 చిత్రం మే 1న థియేటర్లలో రిలీజ్ కానుంది. వాల్ పోస్టర్ సినిమా పతాకంపై నానినే ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
సంబంధిత కథనం