


Best Web Hosting Provider In India 2024

HCU Students Protest : హెచ్‌సీయూలో మళ్లీ ఉద్రిక్త వాతావరణం – విద్యార్థులపై లాఠీ ఛార్జ్..!
హైద్రాబాద్ సెంట్రల్ యూనివర్శిటీలో విద్యార్థుల ఆందోళన కొనసాగుతోంది. అయితే ఇవాళ విద్యార్థి జేఏసీ ఆధ్వర్యంలో అంబేద్కర్ ఆడిటోరియం నుంచి ఈస్ట్ క్యాంపస్ వరకు ర్యాలీ చేపట్టారు. ఈ క్రమంలో క్యాంపస్ లో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. విద్యార్థులను చెదరగొట్టేందుకు పోలీసులు లాఠీఛార్జ్ చేశారు.

హైదరాబాద్ సెంట్రల్ యూనివర్శిటీ(హెచ్ సీయూ) భూముల వేలాన్ని నిరసిస్తూ విద్యార్థుల ఆందోళన కొనసాగుతోంది. 400 ఎకరాల భూ వేలాన్ని తక్షణమే నిలిపివేయాలంటూ డిమాండ్ చేస్తున్నారు. ఇప్పటికే తరగతులను బహిష్కరించిన విద్యార్థులు… బుధవారం విద్యార్థి జేఏసీ ఆధ్వర్యంలో అంబేద్కర్ ఆడిటోరియం నుంచి ఈస్ట్ క్యాంపస్ వరకు ర్యాలీ చేపట్టారు.
ఓవైపు విద్యార్థుల భారీ ర్యాలీ ఉండగా… మరోవైపు పోలీసులు భారీ స్థాయిలో మోహరించారు. ఈ క్రమంలో క్యాంపస్ లో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. విద్యార్థులను చెదరగొట్టేందుకు పోలీసులు లాఠీఛార్జ్ చేశారు. దీంతో పరిస్థితి గందరగోళంగా మారింది.
గడిచిన నాలుగు రోజులుగా యూనివర్శిటీ విద్యార్థులు ఆందోళనలను ఉద్రితం చేస్తున్నారు. భూముల అమ్మకాలను ప్రభుత్వం వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. 400 ఎకరాల భూములను యూనివర్సిటీకి అప్పగించాలని… దీనిపై స్పష్టమైన ప్రకటన చేయాలని కోరుతున్నారు. మరోవైపు ప్రభుత్వం… ఆయా భూముల్లో పనులు చేపట్టింది. జేసీబీల సాయంతో చదును చేస్తోంది. ఈ క్రమంలోనే…. యూనివర్సిటీ చుట్టూ అన్ని గేట్ల వద్ద పోలీసులు మోహరించారు. ఉద్యోగులను, విద్యార్థులను మాత్రమే యూనివర్సిటీ లోపలి అనుమతి ఇస్తున్నారు.
ఖండించిన హరీశ్ రావ్
యూనివర్శిటీలో విద్యార్థులు, వారికి మద్దతుగా నిలిచిన ప్రొఫెసర్లపై లాఠీ ఛార్జ్ చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్లు మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావ్ ట్వీట్ చేశారు. ఇందిరమ్మ కాలం నాటి ఎమర్జెన్సీని తలపించేలా రేవంత్ రెడ్డి సోకాల్డ్ ప్రజాపాలన సాగుతుందంటూ విమర్శించారు. ఈ మేరకు ఓ వీడియోను తన పోస్టుకు జత చేశారు.
ఓవైపు ఆ 400 ఎకరాల భూమి ప్రభుత్వానిదే అని తెలంగాణ సర్కార్ స్పష్టం చేస్తోంది. ఇదే విషయాన్ని మంత్రులు కూడా మీడియా ముఖంగా వెల్లడించారు. మరోవైపు ఈ ల్యాండ్స్ విషయంలో సరైన సర్వే నిర్వహించలేదని… యూనివర్శిటీకి చెందిన భూములేనని విద్యార్థులు చెబుతున్నారు. పచ్చని ప్రకృతికి నెలవైన ఈ అడవులను ధ్వంసం చేస్తే… జీవ వైవిద్యానికి ఇబ్బందలు తలెత్తుతాయని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
విద్యార్థుల ఆందోళనల నేపథ్యంలో తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మంగళవారం మీడియాతో మాట్లాడారు. కంచె గచ్చిబౌలి భూములు యూనివర్సిటీకి చెందినవి కాదని, వర్సిటీకి చెందిన ఇంచు భూమిని తాము తీసుకోమని స్పష్టం చేశారు.
హెచ్‌సీయూ నుంచి భూములను లాక్కొని ప్రభుత్వం వెంచర్లు, ప్లాట్లు వేసి అమ్ముకునేందుకు ప్రయత్నిస్తోందని తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. ఈ 400 ఎకరాలు హెచ్‌సీయూ పరిధిలోనే ఉందని వర్సిటీ యాజమాన్యం భావిస్తోందని, కానీ ఉమ్మడి రాష్ట్రంలో ఈ 400 ఎకరాలను వర్సిటీ నుంచి తీసుకొని ఓ ప్రైవేటు సంస్థకు కేటాయించారని తెలిపారు. ఈ 400 ఎకరాలను కాపాడి, అక్కడ ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు ఒక కార్యాచరణ రూపొందించామన్నారు.
సంబంధిత కథనం
టాపిక్