



Best Web Hosting Provider In India 2024
Yashasvi Jaiswal: ముంబయికి భారీ షాక్.. సచిన్ కొడుకులాగే మరో స్టార్ క్రికెటర్.. జట్టు వీడేందుకు జైస్వాల్ సై
Yashasvi Jaiswal: భారత దేశవాళీ క్రికెట్ దిగ్గజం ముంబయి టీమ్ కు భారీ షాక్ తగలబోతోంది. ఆ టీమ్ స్టార్ ఓపెనర్ యశస్వి జైస్వాల్.. ముంబయిని వీడబోతున్నాడు. వచ్చే సీజన్ లో గోవాకు ఆడేందుకు సిద్ధమవుతున్నాడు. దిగ్గజం సచిన్ టెండూల్కర్ కొడుకు అర్జున్ కూడా ఇలాగే గోవాకు వెళ్లిపోయాడు.

భారత డొమెస్టిక్ క్రికెట్ టీమ్ ముంబయికి యంగ్ ఓపెనర్ యశస్వి జైస్వాల్ షాకిచ్చాడు. రాబోయే దేశవాళీ సీజన్ కోసం ముంబయిని వదిలి గోవాకు వెళ్లాలని అతను ఆలోచిస్తున్నాడు. స్విచ్ చేయడానికి నిరభ్యంతర పత్రం (నో అబ్జెక్షన్ సర్టిఫికెట్- ఎన్ఓసీ) కోరుతూ ముంబై క్రికెట్ అసోసియేషన్ (ఎంసీఏ)కు ఈ-మెయిల్ పంపించాడు. 23 ఏళ్ల జైస్వాల్ ఎన్ఓసీ కోరినట్లు ఎంసీఏ వర్గాలు బుధవారం హిందుస్థాన్ టైమ్స్ కు ధృవీకరించాయి.
రీజన్ పై సస్పెన్స్
టీమిండియా తరపున టెస్టుల్లో అద్భుత ప్రదర్శనతో సాగుతున్న యశస్వి జైస్వాల్.. దేశవాళీల్లో ముంబై తరపునా అదరగొడుతున్నాడు. అయితే అతను సడన్ గా ముంబై వదిలి గోవాకు వెళ్లాలని తీసుకున్న నిర్ణయం వెనుక గల కారణాలు తెలియరాలేదు. ‘‘అవును, ఎన్ఓసీ కోరుతూ యశస్వి నుంచి మాకు అభ్యర్థన అందింది. రాబోయే దేశవాళీ సీజన్ కోసం గోవాకు వెళ్లాలనే కోరికను వ్యక్తం చేస్తూ అతని నుంచి మాకు మెయిల్ వచ్చింది’’ అని ఎంసీఏ వర్గాలు తెలిపాయి.
అయితే జైస్వాల్ నిర్ణయం వెనుక ఉన్న రీజన్ తెలియట్లేదు. ప్రస్తుతానికైతే అతను వ్యక్తిగత కారణాలతో ముంబైను వీడి వెళ్లాలని పేర్కొన్నట్లు ముంబయి క్రికెట్ అసోసియేషన్ వర్గాలు వెల్లడించాయి.
సచిన్ కొడుకులాగే
ముంబైని వీడేందుకు యశస్వికి ఎంసీఏ అనుమతి ఇస్తే దిగ్గజం సచిన్ తనయుడు అర్జున్ టెండూల్కర్, సిద్ధేశ్ లాడ్ వంటి క్రికెటర్ల బాటలో వెళ్లినవాడు అవుతాడు. ఎందుకంటే అర్జున్, సిద్ధేశ్ కూడా ముంబై నుంచి వెళ్లి గోవాకు ఆడుతున్నారు. జైస్వాల్ ఇటీవల జమ్ముకశ్మీర్ తో జరిగిన రంజీ ట్రోఫీ మ్యాచ్ లో ముంబై తరఫున ఆడాడు. సెంట్రల్ కాంట్రాక్ట్ లో ఉన్న ప్రతి ఆటగాడికి దేశవాళీ క్రికెట్ ఆడాలని బీసీసీఐ ఆదేశాలు జారీ చేసింది. జమ్ముకశ్మీర్ పై జైస్వాల్ 4, 26 పరుగులు చేశాడు. జైస్వాల్ అండర్-19 రోజుల నుంచి ముంబైకి ప్రాతినిధ్యం వహిస్తున్న సంగతి తెలిసిందే.
విజయ్ హజారే ట్రోఫీలో ముంబై తరఫున డబుల్ సెంచరీ చేసిన తర్వాత జైస్వాల్ తొలిసారి వెలుగులోకి వచ్చాడు. దేశవాళీ క్రికెట్లో నిలకడైన ఆటతీరుతో టెస్టు జట్టులో చోటు దక్కించుకున్న అతడు అప్పటి నుంచి వెనక్కి తిరిగి చూసుకోలేదు.
అవును వస్తున్నాడు
జైస్వాల్ గోవాకు వెళ్లడాన్ని గోవా క్రికెట్ అసోసియేషన్ వర్గాలు ధృవీకరించాయి. “అవును, మేము అతన్ని చేర్చుకోవాలని నిర్ణయించుకున్నాము. పేపర్ వర్క్ మిగిలి ఉంది. అతని అనుభవం నుండి మిగిలిన జట్టు సభ్యులు నేర్చుకోవచ్చు కాబట్టి జైస్వాల్ కోసం ఉత్సాహంగా ఎదురు చూస్తున్నాం’’ అని గోవా క్రికెట్ అసోసియేషన్ వర్గాలు తెలిపాయి.
గోవాకు జైస్వాల్ కెప్టెన్ గా వ్యవహరిస్తారా అన్న ప్రశ్నకు సమాధానమిస్తూ.. ‘దీనిపై నిర్ణయం తీసుకోవడానికి చాలా సమయం ఉంది. ముందు పేపర్ వర్క్ చేద్దాం” అని చెప్పాయి.
రెగ్యులర్ ఓపెనింగ్ బ్యాటర్ గా జైస్వాల్ భారత్ టెస్టు జట్టులో తన స్థానాన్ని సుస్థిరం చేసుకున్నాడు. భారత్ 1-3 తేడాతో ఓడిపోయిన బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో జైస్వాల్ 43.44 సగటుతో 391 పరుగులు చేశాడు. పెర్త్ లో జరిగిన సిరీస్ తొలి మ్యాచ్ లో సెంచరీ సాధించాడు.
ముంబై ప్రయాణం
యశస్వి జైస్వాల్ 2018-19 సీజన్లో ముంబై టీమ్ తరఫున రంజీ ట్రోఫీలో అరంగేట్రం చేశాడు. చత్తీస్ గఢ్ తో జరిగిన మ్యాచ్ లో రాష్ట్రం తరఫున ఆడాడు. 2021-22 సీజన్లో జైస్వాల్ ముంబై ఫైనల్ కు చేరిన సమయంలో వరుసగా మూడు సెంచరీలు సాధించి కీలక పాత్ర పోషించాడు. 2019-20 విజయ్ హజారే ట్రోఫీలో జార్ఖండ్ పై 203 పరుగులు చేసి లిస్ట్-ఎ క్రికెట్లో డబుల్ సెంచరీ సాధించిన అత్యంత పిన్న వయస్కుడైన ఆటగాడిగా నిలిచాడు.
Best Web Hosting Provider In India 2024
Source link