




Best Web Hosting Provider In India 2024

Waqf Board Bill : వక్ఫ్ బిల్లుకు టీడీపీ కీలక సవరణలు, ఆ అధికారాన్ని రాష్ట్రాలకు ఇవ్వాలని ప్రతిపాదన
Waqf Board Bill : వక్ఫ్ సవరణ బిల్లు-2025 కు టీడీపీ మూడు సవరణలు సూచించిందని ఆ పార్టీ ఎంపీ తెన్నేటి కృష్ణ ప్రసాద్ తెలిపారు. వక్ఫ్ బోర్డులో ముస్లిమేతరులకు ప్రాతినిధ్యం కల్పించే అధికారాన్ని రాష్ట్రాలకే ఇవ్వాలని కేంద్రాన్ని కోరుతున్నామన్నారు.

Waqf Board Bill : వక్ఫ్ సవరణ బిల్లు- 2025 పై పార్లమెంటులో తెలుగుదేశం పార్టీ తరపున బాపట్ల ఎంపీ తెన్నేటి కృష్ణ ప్రసాద్ మాట్లాడారు. దేశంలో పట్టణాలలో నివసించే ముస్లింలలో 31 శాతం మంది దారిద్యరేఖకు దిగువన ఉన్నారని, వారి అభివృద్ధికి అన్ని విధాలా సహకరించాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో హిందూ ధార్మిక దేవదాయ చట్టానికి స్వయం ప్రతిపత్తి కల్పించినట్లుగానే, వక్ఫ్ బోర్డులో ముస్లిమేతరులకు ప్రాతినిధ్యం కల్పించే అధికారాన్ని రాష్ట్రాలకే వదలాలని కేంద్రాన్ని కోరుతున్నామన్నారు.
“వక్ఫ్ సవరణ బిల్లు విషయంలో టీడీపీ ముస్లింల సంక్షేమం, ప్రగతిని దృష్టిలో పెట్టుకుని అడుగడుగునా కృషిచేసింది. అదే సమయంలో వైసీపీ అసలేమాత్రం ఈ విషయంలో శ్రద్ధ చూపించలేదు. జేపీసీ 38 సార్లు సమావేశమైతే టీడీపీ 90 శాతం సమావేశాలకు హాజరైంది. వైసీపీ మొక్కుబడిగా కొన్ని సమావేశాలకు మాత్రమే హాజరైంది. వారి దృష్టిలో ముస్లింలు అంటే కేవలం ఓటు బ్యాంకు అంతే. కానీ టీడీపీకి అలా కాదు. వారి సమగ్రాభివృద్ధి మా లక్ష్యం”-ఎంపీ కృష్ణ ప్రసాద్
వక్ఫ్ ఆస్తులు నిరుపయోగం
“ఒక లక్ష 20 వేల కోట్ల రూపాయల విలువైన 36 లక్షల 18 వేల ఎకరాల వక్ఫ్ ఆస్తులు ఉన్నప్పటికీ… నిర్వహణ లోపాలు, కొంతమంది స్వార్థం వంటి కారణాలతో చాలా వరకు వక్ఫ్ ఆస్తులు నిరుపయోగమవుతున్నాయి. ఈ ఆస్తులన్నీ ముస్లింల సంక్షేమానికి… ముఖ్యంగా ముస్లిం మహిళల ప్రగతికి, యువత అభ్యున్నతికి ఉపయోగపడాలని తెలుగుదేశం పార్టీ కోరుకుంటుంది.
వక్ఫ్ సవరణ బిల్లుపై చర్చించేందుకు, ప్రజల అభిప్రాయాలను తెలుసుకునేందుకు జాయింట్ పార్లమెంటరీ కమిటీని ఏర్పాటు చేయమని మొదటగా కోరింది తెలుగుదేశం పార్టీనే. జేపీసీలో 284 మంది స్టేక్ హోల్డర్స్, 25 రాష్ట్రాల వక్ఫ్ బోర్డులు, 15 రాష్ట్ర ప్రభుత్వాలు, వివిధ మంత్రిత్వ శాఖలు కలిసి 97.27 లక్షల మంది అభిప్రాయాలు, విజ్ఞాపనలు, అభ్యంతరాలపై 120 గంటలకు పైగా చర్చించడం జరిగింది. ఫలితంగా 944 పేజీలతో 14 సవరణలతో తుది బిల్లు తయారైంది” – టీడీపీ ఎంపీ కృష్ణ ప్రసాద్
టీడీపీ మూడు సవరణలు
వక్ఫ్ బోర్డు బిల్లులో ముస్లింల సంక్షేమాన్ని, వారి అభ్యున్నతిని లక్ష్యంగా పెట్టుకుని తెలుగుదేశం పార్టీ 3 ముఖ్యమైన సవరణలను సూచించిందని ఎంపీ కృష్ణ ప్రసాద్ తెలిపారు.
- మొదటి సవరణ : వక్ఫ్ బై యూజర్. ఈ క్లాజు కింద ఇప్పుడు ఉన్నటువంటి వక్ఫ్ ఆస్తులు మొత్తం యధాతధంగా కొనసాగాలి. ముస్లింల వక్ఫ్ ఆస్తులు వారికే చెందాలి, వారి సంక్షేమానికి, వారి అభివృద్ధికి ఉపయోగపడాలన్నదే టీడీపీ ముఖ్యోద్దేశం.
- రెండో సవరణ : వక్ఫ్ ఆస్తులకు సంబంధించిన వివాదాల పై విచారణాధికారం కలెక్టరుకు కాకుండా…అంతకంటే పై ర్యాంకులో ఉండి, ప్రభుత్వం నియమించిన డిజిగ్నేటెడ్ అధికారికి ఇవ్వాలి.
- మూడో సవరణ : కొత్త చట్టం అమల్లోకి వచ్చిన తర్వాత సెంట్రల్ పోర్టల్లో వివరాలను నమోదు చేయడానికి 6 నెలలు కాకుండా… క్షేత్ర స్థాయి సమస్యలను పరిగణనలోకి తీసుకుని తగినంత సమయం ఇవ్వాలి.
ముస్లింల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని తెలుగుదేశం పార్టీ చేసిన ఈ మూడు సవరణలను జాయింట్ పార్లమెంటరీ కమిటీ అంగీకరించిందని ఎంపీ తెలిపారు.
తెలుగుదేశం పార్టీ వ్యవస్థపకుడు ఎన్టీఆర్ 1985లోనే దేశంలో మొదటిసారిగా ముస్లింలకు ఆర్థిక సహకారం అందించడం కోసం మైనారిటీ కార్పొరేషన్ ను ఏర్పాటు చేశారని ఎంపీ కృష్ణ ప్రసాద్ తెలిపారు. నారా చంద్రబాబు నాయుడు ఉర్దూను రెండో అధికారభాషగా చేశారని గుర్తుచేశారు. అంతేకాదు రెండు ఉర్దూ యూనివర్సిటీలను నెలకొల్పారన్నారు. హైదరాబాద్ లో హజ్ భవనాన్ని ఏర్పాటు చేశారని, ముస్లింల సంక్షేమం కోసం రంజాన్ తోఫా, దుల్హన్ స్కీం, విదేశీ విద్యకు సహకారం, ఇమామ్, మౌజంలకు నెల జీతాలు ఇచ్చారని ఎంపీ అన్నారు.
సంబంధిత కథనం
టాపిక్