




Best Web Hosting Provider In India 2024

Thursday Motivation: మంచి రోజుల్లో అహంకారంతో ఉండకూడదు, చెడు రోజుల్లో సహనాన్ని కోల్పోకూడదు
Thursday Motivation: ఒక మనిషికి మంచీ, చెడు రోజులు… రెండూ ఉంటాయి. మంచి రోజుల్లో రెచ్చిపోవడం, చెడు రోజుల్లో కుంగిపోవడం చేయకూడదు. ఎప్పుడైనా ఓపికగా ఉండాలి.

కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదు. ఒక మనిషికి జీవితంలో మంచీ, చెడు అనే రోజులు వస్తూపోతూనే ఉంటాయి. కాలం ఎల్లప్పుడూ మంచిగా ఉండిపోవడం, లేదా పూర్తిగా చెడ్డగా ఉండిపోవడం జరగదు. అది కచ్చితంగా మారుతుంది. అందుకే ప్రతి పరిస్థితిలోనూ ఓపికగా ఉండాలి.
ఒక పురాతన కథ ప్రకారం ఒక రాజు తన రాజ్యంలో ఉన్న ఒక సాధువు కలవడానికి వస్తాడు. సాధువును తన రాజభవనానికి వచ్చి విందును స్వీకరించవని కోరుతాడు. దానికి సాధువు ఒప్పుకుంటాడు.
అహంకారం లేకుండా
మరుసటి రోజు సాధువు రాజభవనానికి వస్తాడు. రాజు అతనికి ఎంతో సేవ చేస్తాడు. ఒక పెద్ద రాజ్యానికి చక్రవర్తి అయినప్పటికీ ఎలాంటి అహంకారం లేకపోవడం సాధువుకు ఎంతో సంతోషాన్ని ఇస్తుంది. రాజభవనాన్ని వీడి వెళ్లే ముందు రాజుకు ఒక తాయెత్తును ఇస్తాడు. ఆ తాయెత్తులో ఒక కాగితంపై మంత్రాన్ని రాసి పెట్టానని చెబుతాడు. అయితే మంచి రోజుల్లో మాత్రం ఆ తాయెత్తును తెరవద్దని చెబుతాడు. రోజులు బాగోకపోయినప్పుడు ఈ తాయెత్తును తెరిచి కాగితంలోని అద్భుతమైన మంత్రాన్ని చదవమని చెబుతాడు. రాజు అతని సలహాను పాటిస్తానని మాట ఇచ్చి ఆ తాయోత్తును మెడలో వేసుకుంటాడు.
రోజులు గడుస్తూ ఉంటాయి. ఒకరోజు రాజ్యం పైకి పొరుగు రాజ్యాల వారు దండెత్తి వస్తారు. అయితే ఈ రాజు సైన్యం వారిని తట్టుకొని ఎక్కువ కాలం పోరాడలేకపోతుంది. రాజు మాత్రం తన ప్రాణాలను కాపాడుకుని అడవిలోకి పారిపోయాడు. అడవిలో అతనికి ఒక గుహ కనిపించింది. ఆ గుహలో దాక్కున్నాడు.
తాయెత్తు మహిత
గుహ బయట సైనికుల అడుగుల చప్పుడు వినబడింది. అది తాను పట్టుకోవడానికి వచ్చిన శత్రువులే అనుకున్నాడు. తాను ఇక దొరికిపోతానని జీవితం ముగిసిపోతుందని భావించాడు. వారికి దొరికిపోయే కన్నా తనకు తానే ప్రాణాలు తీసుకుంటే మంచిదనుకున్నాడు. అదే సమయంలో సాధువు తనకిచ్చిన తాయెత్తు గుర్తొచ్చింది. వెంటనే ఆ తాయెత్తును తెరిచి అందులోంచి కాగితాన్ని బయటకు తీశాడు. ఆ కాగితంపై ‘ఈ సమయం కూడా గడిచిపోతుంది, ఓపిక పట్టండి’ అని రాసి ఉంది. అది చదివిన రాజుకు కాస్త ఊరటగా అనిపించింది.
రాజు ఆ గుహలోనే కొన్ని రోజులు జీవించాడు. బయట నుంచి ఎలాంటి చప్పుళ్ళు వినిపించడం లేదు. ఆ సమయంలో బయటికి వచ్చి మెల్లగా తన రాజ్యాన్ని చేరుకున్నాడు. అప్పటికి పొరుగు రాజ్యం వారంతా తమ తమ స్థానాలకు వెళ్లిపోయారు. రాజు ప్రాణాలతో బతికాడు. తిరిగి తన సామ్రాజ్యాన్ని స్థాపించడానికి పొరుగు రాజ్యాధినేతలతో ఒప్పందాలు చేసుకున్నాడు. అలా తన ప్రాణాన్ని, తన ప్రజలను కూడా కాపాడుకున్నాడు.
ఈ కథ ఒక విషయాన్ని చెబుతోంది… చెడు రోజుల్లో చెడుగా ఆలోచించవద్దు. అలాగని మంచి రోజుల్లో ఉన్నప్పుడు అహంకారంగా ప్రవర్తించవద్దు. ఏ కాలమైనా ఉండిపోదు… దాని సమయం పూర్తవ్వగానే గడిచిపోతుంది. కాబట్టి రోజులు బాగున్నప్పుడు అహంకారంతో విర్ర వీగడం, చెడు రోజుల్లో సహనం కోల్పోవడం రెండూ కూడా సమస్యలనే తెచ్చి పెడతాయి.
సంబంధిత కథనం