




Best Web Hosting Provider In India 2024

Chia Seeds Pudding: రోజంతా హుషారుగా ఉండాలి, బరువు పెరగకుండా ఉండాలి అనుకుంటే ఉదయాన్నే చియా సీడ్స్ పుడ్డింగ్ తినండి!
Chia Seeds Pudding: ఉదయాన్నే రుచిగా తినాలి, అది ఆరోగ్యకరమైనది కూడా ఉండాలి అనుకునే వారికి చియా సీడ్స్ పుడ్డింగ్ ఉత్తమమైనది. ఇందులోని పోషకాలు, విటమిన్లు, ఫైబర్ వంటివి ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయి. శరీర బరువును కూడా అదుపులో ఉంచుతాయి. చియా సీడ్స్ పుడ్డింగ్ తయారు చేసుకోవడం కూడా చాలా సులువు.

ఉదయాన్నే రుచిగా ఏదైనా తినాలి, అది ఆరోగ్యానికి కూడా చాలా మేలు చేసేది అయి ఉండాలి. తియ్యటి కమ్మటి ఆహారం అయితే మరీ బాగుంటుంది. ఇవన్నీ మీ మనసులో ఉన్న కోరికలు కదా. అవును ఇలా చాలా మంది మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్ విషయంలో ఇదే కోరుకుంటారు. కానీ ఆరోగ్యం గురించి భయపడి తీపి తినరు. రుచికరమైనవి తింటే ఆరోగ్యానికి మంచివి కాదని కొందరు, బరువు పెరుగుతామేమో అని మరికొందరు ఉదయం బ్రేక్‌ఫాస్ట్‌లో ఏం తినాలా అని రోజూ చాలా గాబరా పడుతుంటారు. మీరు కూడా ఇలాంటి వారే అయితే ఈ చియా సీడ్స్ పుడ్డింగ్ రెసిపీ మీ కోసమే.
చియా సీడ్స్ పుడ్డింగ్ రుచిలో అద్భుతమైనది, అలాగే ఆరోగ్యానికి కూడా చాలా మేలు చేస్తుంది. మరో ముఖ్యమైన విషయం ఏంటంటే.. ఇది తీపి తినాలనే మీ కోరికను కూడా నిస్సందేహంగా తీరుస్తుంది. బరువు తగ్గాలనుకునే వారికి, రోజంతా ఉత్సాహంగా, ఉల్లాసంగా ఉండాలనుకునే వారికి ఇది పర్ఫెక్ట్ మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్. కావాలంటే ఈ రెసిపీతో ఓసారి ట్రై చేసి చూడండి. ప్రతి రోజూ తప్పకుండా దీన్నే తీసుకుంటారు.
చియా సీడ్స్ పుడ్డింగ్ తయారీకి కావల్సిన పదార్థాలు:
- పాలు- ఒక కప్పు
- చియా గింజలు – ఒక టేబుల్ స్పూన్
- రాగి పిండి – ఒక టేబుల్ స్పూన్
- యాలకుల పొడి- పావు టేబుల్ స్పూన్
- తేనె- ఒక టేబుల్ స్పూన్
- అరటిపండు
- యాపిల్
- దానిమ్మ గింజలు
- బాదం పప్పు
- పిస్తా పప్పు
- వంటి మీకు నచ్చిన ఫ్రూట్స్ అండ్ నట్స్
చియా సీడ్స్ పుడ్డింగ్ తయారీ విధానం:
- ముందుగా కప్పు పాలను తీసుకుని దాంట్లో ఒక స్పూన్ చియా గింజలు వేసి రాత్రంతా నానబెట్టండి.
- ఉదయాన్నే ఒక చిన్న మిక్సింగ్ బౌల్ తీసుకుని దాంట్లో కొన్ని నీళ్లు పోసి,తర్వాత ఒక స్పూన్ రాగి పిండి వేసి వండులుగా లేకుండా బాగా కలపండి.
- ఇప్పుడు ఒక గిన్నె తీసుకుని దాంట్లో మూడు కప్పుల నీరు పోసి వేడి చేయండి.
- నీరు వేడెక్కిన తర్వాత ముందుగా నీటిలో వేసి కలిపి పెట్టుకున్న రాగి పిండి మిశ్రమాన్ని దీంట్లో పోసి కలుపుతూ ఉండండి.
- రాగి జావ కాస్త దగ్గరపడగానే దాంట్లో నాలుగు అయిదు యాలకులను దంచి పొడి చేసి దీంట్లో వేయండి.
- తర్వాత ఒక నిమిషం పాటు ఈ మిశ్రమాన్ని ఉడికించిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఒక కప్పులోకి పోసుకోండి.
- ఇప్పుడు అదే కప్పులో రాత్రంతా పాలలో నానబెట్టిన చియా గింజలను వేయండి.
- ఆ తర్వాత మీ రుచికి సరిపడా తేనేను వేయండి.
- తర్వాత దీంట్లోనే మీకు నచ్చిన పండ్లు అంటే అరటిపండు ముక్కలు, యాపిల్ ముక్కలు, దానిమ్మ గింజలు వంటి వాటిని వేయండి.
- ఇప్పుడు బాదం పప్పు, పిస్తా పప్పు వంటి వాటిని సన్నగా తిరిగి గార్నీష్ చేసుకున్నారంటే హెల్తీ అండ్ టేస్టీ చియా సీడ్స్ పుడ్డింగ్ రెడీ అయినట్టే.
ప్రతి రోజు ఉదయాన్నే దీన్ని తిన్నారంటే మీ శరీరానికి చాలా రకాల విటమిన్లు, పోషకాలతో పాటు ఫైబర్ ,యాంటీ ఆక్సిడెంట్లు అందుతాయి. బరువు తగ్గాలనుకునే వారికి ఇది దివ్య ఔషధంలా పని చేస్తుంది. పిల్లల నుంచి పెద్దల వరకూ ప్రతి రోజూ దీన్ని తాగడం వల్ల రోజంతా హుషారుగా ఉండచ్చు. ఎన్నో రకాల వ్యాధుల ప్రమాదానలు తగ్గించుకోవచ్చు.
సంబంధిత కథనం