




Best Web Hosting Provider In India 2024

Amaravati Works: ఈ నెలలోనే ప్రధాని చేతుల మీదుగా అమరావతి పనులకు శంకుస్థాపన, ఏర్పాట్లపై సీఎస్ సమీక్ష
Amaravati Works: ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నగర నిర్మాణ పనుల్ని పున:ప్రారంభించడంతో పాటు అమరావతిలో అభివృద్ధి పనులకు ప్రధాని మోదీ హాజరు కానుండటంతో ఏపీ ప్రభుత్వం ఏర్పాట్లు ప్రారంభించింది. పదేళ్ల క్రితం అమరావతికి ప్రధాని మోదీ శంకుస్థాపన చేయగా, పున:ప్రారంభం కూడా ప్రధాని చేతుల మీదుగానే జరుగనుంది.

Amaravati Works: ఏపీ రాజధాని అమరావతి పనులు త్వరలోనే ప్రారంభం కానున్నాయి. రాజధాని నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం బాసటగా నిలవడంతో నిధుల సమీకరణ ఇప్పటికే కొలిక్కి వచ్చింది. ఏప్రిల్ మూడో వారం లోపు రాజధాని నిర్మాణ పనుల్ని ప్రధానమంత్రి చేతులమీదుగా ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రధాని పర్యటనపై సిఎస్ విజయానంద్ సమీక్షించారు.
రాజధాని నిర్మాణ పనులను పున:ప్రారంభించడంతో పాటు ఇతర అభివృద్ధి పనులకు శంఖుస్థాపన,ప్రారంభోత్సవాలకు ఈనెలలో ప్రధాన మంత్రి నరేంద్ర మోడి అమరావతికి రానున్న నేపధ్యంలో అందుకు సంబంధించి చేయాల్సిన ఏర్పాట్లపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్ ప్రాధమిక సమీక్ష నిర్వహించారు.
అమరావతిలో ప్రధాని పర్యటన ఖరారు కావాల్సి ఉంది. ఈలోగా సంబంధిత శాఖల పరంగా చేయాల్సిన ఏర్పాట్లపై ఇప్పటి నుండే పూర్తి స్థాయిలో దృష్టి పెట్టాలని సిఎస్ అధికారులను ఆదేశించారు.ఇటీవల పి-4 కార్యక్రమాన్ని ప్రారంభించిన ప్రాంతంలోనే ప్రధాని పర్యటన కార్యక్రమం ఉండే విధంగా ఆప్రాంతాన్ని 50 ఎకరాలకు పైగా విస్తీర్ణంలో చదును చేయడంతో పాటు తగిన పార్కింగ్ తదితర ఏర్పాట్లు చేయాల్సి ఉందని ఆదిశగా ఇప్పటి నుండే తగిన కసరత్తు మొదలు పెట్టాలని సంబంధిత శాఖల అధికారులకు సిఎస్ సూచించారు.
డీజీపీ, సిఆర్డిఏ అధికారులు,గుంటూరు జిల్లా కలక్టర్, ఎస్పీ,వైద్య ఆరోగ్య శాఖ కమీషనర్ వీర పాండియన్ తదితర అధికారులు వెంటనే ఆప్రాంతాన్ని సందర్శించి ఒక సమగ్ర నివేదికను సిద్దం చేయాలని సిఎస్ విజయానంద్ ఆదేశించారు.
గతంలో రాష్ట్రంలో ప్రధానమంత్రి పర్యటనలో చురుగ్గా పనిచేసిన అధికారుల సేవలను పూర్తి స్థాయిలో వినియోగించేందుకు ఆయా అధికారుల జాబితాను సిద్ధం చేయాలని సిఎస్ విజయానంద్ అధికారులను ఆదేశించారు.ప్రస్తుత వేసవి దృష్ట్యా కార్యక్రమానికి వచ్చే వివిఐపి, విఐపిలు,ప్రజలు తదితరులు అందరికీ తగిన పూర్తి వసతులు కల్పించే విధంగా ఏర్పాట్లు చేయాల్సి ఉందని చెప్పారు.
ప్రధాని పర్యటన ఖరారు కాగానే పూర్తి స్థాయిలో మరొక సారి శాఖల వారీ ఏర్పాట్లపై సమీక్షిస్తామని, ఈలోగా తగిన ప్రాధమిక కసరత్తు ప్రారంభించాలని సిఎస్ విజయానంద్ ఆదేశించారు.
అమరావతి నిర్మాణానికి సహకరించాలని వినతి…
అమరావతి రాజధాని నిర్మాణానికి సంబంధించి గతంలో మాదిరి గానే సింగపూర్ ప్రభుత్వం ఏపీ ప్రభుత్వానికి పూర్తి సహాయ సహకారాలను అందించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్ విజ్ణప్తి చేశారు.ఈమేరకు సింగపూర్ ప్రతినిధుల బృందంతో బుధవారం రాష్ట్ర సచివాలయంలో సిఆర్డిఏ,మున్సిపల్ శాఖ అధికారులతో కలిసి సమావేశమై పలు అంశాలను చర్చించారు.
2014-2019లో అమరావతి ప్రజా రాజధాని నిర్మాణానికి సింగపూర్ ప్రభుత్వం ఒక కీలక భాగస్వామిగా ఉందని అదే స్థితిని ప్రస్తుతం కూడా కొనసాగించాలని ఆకాంక్షించారు.ఈప్రభుత్వం తిరిగి అధికారానికి వచ్చిన రోజు నుండే అమరావతి రాజధాని నిర్మాణంపై ప్రత్యేక దృష్టి సారించిందన్నారు.ఇప్పటికే అమరావతి రాజధానికి సంబంధించి కేంద్ర నిధులతో పాటు ప్రపంచ బ్యాంకు,హడ్ కో,ఎడిబి వంటి సంస్థలతో పెద్దఎత్తున నిధులు టైఅప్ చేసిందని నిధులకు ఎలాంటి సమస్య లేదని పేర్కొన్నారు.
ఈనెలలో ప్రధాన మంత్రి నరేంద్ర మోడి అమరావతి రాజధాని నిర్మణ పనులను పున:ప్రారంభించేందుకు రానున్నారని సిఎస్ తెలిపారు.కావున గతంలో మాదిరే సింగపూర్ ప్రభుత్వం పూర్తిగా సహకరించేందుకు కృషి చేయాలని అన్నారు.గురువారం రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులతో సమావేశం ఉన్నందున అన్ని అంశాలపై మరింత స్పష్టత వస్తుందని సిఎస్ విజయానంద్ చెప్పారు.
రాష్ట్ర మున్సిపల్ పరిపాలన శాఖ ముఖ్య కార్యదర్శి ఎస్.సురేశ్ కుమార్ మాట్లాడుతూ అమరావతి రాజధానిని శరవేగంగా పూర్తి చేసేందుకు ప్రభుత్వం కృత నిశ్చయంతో ఉందని చెప్పారు.అమరావతి మాస్టర్ ప్రణాళికను గతంలోనే సిద్ధం చేయడం జరిగిందని గుర్తు చేశారు. అమరావతి రాజధానిని ప్రపంచంలోనే ఒక ఉత్తమ సస్టెయినబుల్ అండ్ అత్యంత లివబుల్ సిటీగా నిర్మించేందుకు అన్ని ప్రయత్నాలు జరుగుతున్నట్టు తెలిపారు.
217 చ.కి.మీల విస్తీర్ణంలో రాజధాని నిర్మాణం…
అంతకు ముందు ఎపి సిఆర్డిఏ కమీషనర్ కె.కన్నబాబు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ చేస్తూ 217 చ.కి.మీల విస్తీర్ణంతో అమరావతి ప్రజా రాజధానిని నిర్మించేందుకు ఈప్రభుత్వం తిరిగి శరవేగంగా అడుగులు వేస్తోందని చెప్పారు. దానిలో భాగంగానే అమరావతి గవర్నమెంట్ కాంప్లెక్సు,పలు ట్రంక్ రోడ్ల నిర్మాణం,ఇతర నిర్మాణాలు,సౌకర్యాల కల్పనకు సంబంధించిన పనులకు పెద్దఎత్తున నిధులు సమీకరించి పనులు చేపట్టేందుకు టెండర్లు పిలిచినట్టు వివరించారు. ఈనెలలోనే ప్రధానమంత్రి సుమారు లక్ష కోట్ల రూ.ల పనుల పున:ప్రారంభం, పనులు శంఖుస్థాపనలు,ప్రారంభోత్సవాలకు శ్రీకారం చుట్టనున్నారని వివరించారు.ఇంకా పలు అంశాలకు సంబంధించి ప్రభుత్వం తీసుకుంటున్నచర్యలను సింగపూర్ ప్రతినిధి బృందం దృష్టికి తెచ్చారు.
రాజధాని నిర్మాణంలో సింగపూర్ భాగస్వామ్యం..
సింగపూర్ ప్రభుత్వ ప్రతినిధి డా.ఫ్రాన్సిస్ చోంగ్(Dr.Francis Chong)మాట్లాడుతూ గతంలో వలె అమరావతి రాజధాని నిర్మాణానికి సంబంధించిన భాగస్వామ్యాన్ని తిరిగి పునరుద్ధరించేందుకు ఎపి ప్రభుత్వంతో కలిసి పని చేసేందుకు అన్నివిధాలా కృషి చేయనున్నట్టు తెలిపారు.
సంబంధిత కథనం
టాపిక్