




Best Web Hosting Provider In India 2024

Kanigiri CBG Plant: ప్రకాశం జిల్లా కనిగిరిలో సీబీజీ ప్లాంట్‌కు శంకుస్థాపన, పీ4 విధానానికి సీబీజీ ప్లాంట్లతో నాంది
Kanigiri CBG Plant: ఏపీలో పేదరిక నిర్మూలనకు రిలయన్స్ కంప్రెస్డ్ బయోగ్యాస్ ప్లాంట్లు దోహదపడతాయని మంత్రి నారా లోకేష్ చెప్పారు. ప్రకాశం జిల్లా కనిగిరిలో సీబీజీ ప్లాంట్‌కు మంత్రి శంకుస్థాపన చేశారు. ఐదేళ్లలో 20లక్షల ఉద్యోగాలు లక్ష్యమని, త్వరలోనే కనిగిరిలో ట్రిపుల్ ఐటీ ఏర్పాటు చేస్తామని ప్రకటించారు.

Kanigiri CBG Plant: ఏపీలో పి4 విధానానికి రిలయన్స్ సీబీజీ ప్లాంట్స్ నాంది కాబోతున్నాయి, పేదరికం లేకుండా చేయడంలో ఇదొక ముఖ్యమైన అడుగు కాబోతోందని రాష్ట్ర విద్య, ఐటి, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ అన్నారు. ప్రకాశం జిల్లా కనిగిరి నియోజకవర్గం పిసిపల్లి మండలం దివాకరపురంలో రిలయన్స్ సంస్థ ఏర్పాటు చేస్తోన్న కంప్రెస్డ్ బయోగ్యాస్ ప్లాంటుకు మంత్రి లోకేష్ భూమిపూజ చేశారు.
ఎటువంటి నీటివసతి లేని మెట్టప్రాంతంలోని రైతులకు ఈ ప్లాంట్స్ ద్వారా పెద్ద ఎత్తున మేలు జరుగుతుందని, నైపర్ రకం గడ్డి తో బయో గ్యాస్ తయారు చెయ్యబోతున్నారని వివరించారు. ఈ ప్లాంట్ కోసం ప్రభుత్వ భూములకు ఎకరాకు రూ.15 వేలు, రైతుల భూములకు రూ.31 వేలు కౌలు కూడా ఇవ్వబోతున్నారని చెప్పారు.
రైతులే గడ్డి పెంచి ఇస్తే టన్నుకు నిర్ణీత ధర చెల్లిస్తారని రిలయన్స్ సంస్థ ఏర్పాటుచేసే సిబిజి ప్లాంట్లన్నీ పూర్తిస్థాయిలో పనిచేస్తే ఏటా 110 లక్షల మెట్రిక్ టన్నుల ఆర్గానిక్ ఎరువు కూడా తయారు అవుతుందన్నారు. ఈ ప్లాంట్ల ద్వారా గ్రామీణ యువతకు పెద్దఎత్తున ఉద్యోగాలు రాబోతున్నాయని చెప్పారు. ప్రకాశం జిల్లాలో పేదరికం లేకుండా చెయ్యడమే మా లక్ష్యమని రానున్న అయిదేళ్లలో ఆ లక్ష్యాన్ని సాధించి తీరుతామన్నారు.
సిబిజి హబ్ గా మారనున్న కనిగిరి!
ఆంధ్రప్రదేశ్ లో కంప్రెస్డ్ బయో గ్యాస్ ప్లాంట్స్ పెట్టడానికి రిలయన్స్ ముందుకు వచ్చింది. ఈ రంగంలో 65 వేల కోట్ల పెట్టుబడి పెట్టబోతోంది. దీని ద్వారా 500 ప్లాంట్లు పెట్టడానికి రిలయన్స్ ముందుకు వచ్చింది. దీని ద్వారా 2.5 లక్షల మందికి ఉద్యోగ అవకాశాలు రాబోతున్నాయి. ప్రకాశం, అనంతపురం, చిత్తూరు, కడప లో 5 లక్షల ఎకరాల భీడు భూమిని వినియోగంలోకి తీసుకురాబోతున్నట్టు మంత్రి లోకేష్ చెప్పారు. యువగళంలో ప్రకాశం జిల్లాకు ఇచ్చిన హామీ నిలబెట్టుకున్నానని రిలయన్స్ మొదటి సిబిజి ప్లాంట్ ను కనిగిరిలో ప్రారంభించానన్నారు. ప్రకాశం జిల్లా లో ఐదు వేల ఎకరాలు బీడు భూములు ఇచ్చామని కనిగిరి లో 497 ఎకరాలు కేటాయించినట్టు చెప్పారు. కనిగిరి ప్లాంట్ రిలయన్స్ సిబిజి ప్లాంట్ హబ్ గా మారబోతుంది. ఇక్కడే ఐదు ప్లాంట్స్ రాబోతున్నాయన్నారు.
రిలయన్స్ తో బాబుకు ప్రత్యేకమైన అనుబంధం
రిలయన్స్ ఫౌండర్ ఛైర్మెన్ ధీరూభాయ్ అంబానీతో చంద్రబాబుకు కి మంచి అనుబంధం ఉందని జాం నగర్లో ఉన్న రిలయన్స్ రిఫైనరీ చూడటానికి వెళ్ళినప్పుడు చంద్రబాబు గారు టెలికాం రంగంలో విప్లవం రాబోతుంది అని ధీరూభాయ్ అంబానీతో చెప్పారని చంద్రబాబుపై నమ్మకంతో ఆ రోజుల్లోనే ధీరూభాయ్ అంబానీ గారు టెలికాం రంగంలో పెట్టుబడులు పెట్టారని లోకేష్ వివరించారు.
ఆ తరువాత ఆ అనుబంధం రిలయన్స్ ఛైర్మెన్ ముకేష్ అంబానీతో కూడా కొనసాగుతుందని రాష్ట్రంలో ప్రజాప్రభుత్వం ఏర్పడిన తరువాత నేను ముకేష్ అంబానీ, అనంత్ అంబానీ, రిలయన్స్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ పిఎంఎస్ ప్రసాద్‌ను కలిసి రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టాలని ఆహ్వానించినట్టు చెప్పారు.
ఏపీ ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ కాదు… స్పీడ్ ఆఫ్ డూయింగ్ లో ముందుందని వివరించి 21 రోజుల్లో ఇంటిగ్రేటెడ్ క్లీన్ ఎనర్జీ పాలసీ (ఐస్ ) తీసుకొస్తానని హామీ ఇచ్చానని చెప్పారు. పాలసీ రావడానికి 30 రోజులు పట్టిందని అడిగిన వెంటనే ఆంధ్రప్రదేశ్ లో పెట్టుబడులు పెట్టడానికి అంగీకరించిన ముకేష్ అంబానీ, అనంత్ అంబానీ, రిలయన్స్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ పిఎంఎస్ ప్రసాద్ కు మంత్రి లోకేష్ కృతజ్ఞతలు తెలిపారు.
కనిగిరి ట్రిపుల్ ఐటికి త్వరలోనే శంకుస్థాపన
కనిగిరిలో ట్రిపుల్ ఐటికి త్వరలోనే శంకుస్థాపన చేస్తానని. కనిగిరి రైల్వే ప్రాజెక్టుకు ఏప్రిల్ లో అవసరమైన నిధులిస్తామన్నారు. ఆగస్టులో సిఎంను రప్పించి రైల్వేప్రాజెక్టు పనులు ప్రారంభిస్తామని చెప్పారు. మిగిలిపోయిన వెలుగొండ పనులు పూర్తిచేసి చివరి ఎకరాకు సైతం సాగునీరు అందిస్తామన్నారు. రాబోయే రోజుల్లో ప్రతిగడపకు తాగునీరు అందిస్తామని వైకాపా నేత దుష్ప్రచారం చూస్తుంటే జాలివేస్తోందనన్నారు. బయోగ్యాస్ ప్లాంటుపై అపోహలు సృష్టిస్తున్నారని మండిపడ్డారు.
కనిగిరి నియోజకవర్గంలోనే 50ప్లాంట్లు
పాదయాత్ర సమయంలో మా ప్రాంతంలో వలసలకు చెక్ పెట్టాలని ఉగ్రనరసింహారెడ్డి చెప్పారని అది గుర్తుపెట్టుకొని నేను, గొట్టిపాటి మొదటి సిబిజి ప్లాంట్ కనిగిరిలో ఏర్పాటుచేయాలని నిర్ణయించామన్నారు. రిలయన్స్ ఆధ్వర్యాన మొదటి వంద సిబిజి ప్లాంట్లు ప్రకాశం జిల్లాకు తేవాలని నిర్ణయించినట్టు చెప్పారు. ఈ ప్రాంత రైతులు 50వేల ఎకరాలు కౌలుకు ఇస్తారని ఉగ్ర చెప్పారని చెప్పిన ప్రకారం భూములిస్తే ఇక్కడే 50ప్లాంట్లు ఏర్పాటు చేస్తామన్నారు. గత పదిరోజులుగా ఎమ్మెల్యే ఉగ్రనరసింహారెడ్డి అవిశ్రాంతంగా పనిచేశారు. కనిగిరి ప్రజలకోసం ఆయన కష్టపడ్డారు. ఇక్కడ ప్రజలు ఇతర ప్రాంతాలకు వలసవెళ్లకుండా ఇక్కడే ఉద్యోగాలు కల్పించాలని ఆయన కృషిచేస్తున్నారన్నారు. ఈ కార్యక్రమంలో మంత్రులు గొట్టిపాటి రవికుమార్, ఆనం రాంనారాయణ రెడ్డి, డోలా బాల వీరాంజనేయ స్వామి పాల్గొన్నారు.
సంబంధిత కథనం
టాపిక్