




Best Web Hosting Provider In India 2024

Vizag Crime: Vizag Crime: విశాఖలో ఘోరం.. పెళ్లి చేసుకుంటానని నమ్మించి మతి స్థిమితం లేని యువతిపై అత్యాచారం
Vizag Crime: విశాఖపట్నంలో ఘోరమైన సంఘటన చోటు చేసుకుంది. మతిస్థిమితం లేని యువతిని పెళ్లి చేసుకుంటానని నమ్మించి యువకుడు అత్యాచారం చేశాడు. బాధిత యువతి తల్లిదండ్రులు ఫిర్యాదుతో ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు.

Vizag Crime: పెళ్లి చేసుకంటానని నమ్మించి మతి స్థిమితం లేని యువతిపై అత్యాచారం చేసిన ఘటన విశాఖపట్నంలో వెలుగు చూసింది. విశాఖపట్నంలోని కైలాసపురంలోని సీఐఎస్ఎఫ్ క్వార్టర్స్ సమీపంలో చోటు చేసుకుంది. అయితే ఈ ఘటన ఆలస్యంగా బుధవారం వెలుగులోకి వచ్చింది.
కంచరపాలెం పోలీసులు, కుటుంబ సభ్యులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం మురళీనగర్‌లోని ఒక ప్రాంతంలో తల్లిదండ్రులతో కలిసి ఓ యువతి (29) నివాసం ఉంటుంది. ఆ యువతికి చిన్నప్పటి నుంచి మతిస్థిమితం సరిగా లేదు. రోడ్లపై తిరుగుతూ ఉండేంది.
మార్చి 29న బర్మా క్యాంప్‌లోని నూకాలమ్మ గుడికి వెళ్లింది. అక్కడ ఆమెను చూసిన చిత్తు కాగితాలు, బాటిల్స్, ఇతర పారేసిన వస్తువులు ఏరుకునే రాజేష్ అనే యువకుడు పరిచయం చేసుకున్నాడు. పెళ్లి చేసుకుంటానని నమ్మించి, చెరకు రసం విక్రయించే బండి వద్దకు తీసుకెళ్లి చెరకు రసం కొని ఇచ్చాడు. చెరుకు రసం తాగిన కొద్ది సేపటికి ఆమెను సీఐఎస్ఎఫ్ క్వార్టర్స్ వైపు తీసుకెళ్లాడు.
శ్రీనివాసనగర్ సమీపంలో ఉన్న చెట్ల పొదల్లోకి తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడ్డాడు. బుధవారం ఉదయం యువతికి కడపు నొప్పిగా ఉండటంతో పాటు అధిక రక్తస్రావం అయింది. తనకు కడుపు నొప్పిగా ఉందని, రక్తస్రావం జరుగుతుందని యువతి తల్లికి చెప్పింది. తల్లి ఏం జరిగిందని యువతిని ఆరా తీసింది. దీంతో యువతి తల్లిదండ్రులకు జరిగిన విషయం వివరించింది.
బుధవారం కంచరపాలెం పోలీసులకు ఆమె తల్లిదండ్రులు ఫిర్యాదు చేశారు. బాధితురాలి తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. అనంతరం బాధిత యువతిని వైద్య పరీక్షల నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. నిందితుడి కోసం గాలింపు చర్యలు చేపడుతున్నారు. కంచరపాలెం ఎస్ఐ దివ్య భారతి స్పందిస్తూ యువతిపై అత్యాచారం జరిగిన ఫిర్యాదును స్వీకరించామని, పోలీసులు ఆయా ప్రాంతాల్లోని సీసీ ఫుటేజీలను పరిశీలిస్తున్నారని తెలిపారు. కేసు నమోదు చేశామని, దర్యాప్తు జరుగుతోందని అన్నారు. దర్యాప్తు పూర్తి అయిన తరువాత తదుపరి చర్యలు ఉంటాయని తెలిపారు.
బాలికపై అక్క భర్త అత్యాచారం
ఎన్టీఆర్ జిల్లాలో రెండు వేర్వేరు సంఘటనలో ఇద్దరు బాలికలపై అత్యాచార ఘటనలు చోటు చేసుకున్నాయి. నిందితులు ఇద్దరిపై పోక్సో కేసులు నమోదు చేశారు. బాలికపై అక్క భర్తే అత్యాచారానికి పాల్పడ్డాడు. దీంతో ఆయనపై పోక్సో కేసు నమోదు అయింది.
జగ్గయ్యపేట మండలంలో ఒక తండాకు చెందిన బాలికను త్రిపువరం గ్రామానికి చెందిన తన అక్క భర్త నాగరాజు వత్సవాయి మండలం కన్నెవీడు గ్రామంలో మిర్చికోతకు తీసుకెళ్లాడు. ఆమెకు మాయమాటలు చెప్పి అక్కడి నుంచి హైదరాబాద్‌కు తీసుకెళ్లి దాదాపు 20 రోజుల పాటు శారీరకంగా అనుభవించి గ్రామానికి తీసుకొచ్చాడు.
ఈ విషయం బాలిక ఇంట్లో వారికి చెప్పింది. దీంతో గ్రామ పెద్దలు దృష్టికి తీసుకెళ్లారు. గ్రామపెద్దలు, ఇరు వర్గాలు ఒకే కుటుంబానికి చెందిన వారు కావడంతో సమస్యను సామరస్యంగా పరిష్కరించుకోవాలని చెప్పడంతో తాత్కాలికంగా సద్దుమణిగింది. మార్చి 25న నిందితుడు మళ్లీ బాలిక ఇంటికి వెళ్లి తన వద్ద ఫోటోలున్నాయని, బయటపెడతానని వేధించాడు.
దీంతో భయబ్రాంతులకు గురి అయిన ఆ బాలిక పురుగుల మందు తాగి ఆత్మహత్యకు యత్నించింది. దీంతో కుటుంబ సభ్యులు చిల్లకల్లు పోలీసులను ఆశ్రయించారు. ఎస్ఐ తోట సూర్య శ్రీనివాస్ నిందితుడిపై పోక్సో కేసు, కిడ్నాప్ కేసు నమోదు చేశారు. తదుపరి దర్యాప్తుకు సీఐ వెంకటేశ్వర్లు, నందిగామ ఏసీపీ తిలక్‌కు సమాచారం అందించారు. వత్సవాయి పోలీస్ స్టేషన్లో బాలిక మిస్సింగ్ కేసు కూడా నమోదు అయింది. కాగా నాగరాజుకు భార్య, ముగ్గురు పిల్లలు ఉన్నారు.
పెళ్లి చేసుకుంటానని నమ్మించి అత్యాచారం
ఇబ్రహీంపట్నం మండలం మూలపాడు శివారు గ్రామంలో ఓ మైనర్ బాలిక (17)పై అదే గ్రామానికి చెందిన యువకుడు (25) లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఆ యువకుడిపై బుధవారం రాత్రి పోక్సో కేసు నమోదు అయింది. గత కొంత కాలంగా బాలికకు ప్రేమ పేరుతో మాయ మాటలు చెప్పి, పెళ్లి కూడా చేసుకుంటానని నమ్మించి శారీరకంగా లోబర్చుకున్నాడు. విషయం బాలిక తల్లిదండ్రులకు తెలియడంతో వారు బాలికతో కలిసి ఫిర్యాదు చేశారు. బాలికను వైద్య పరీక్షల నిమిత్తం విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రికి పంపించారు. నిందితుడిపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
(జగదీశ్వరరావు జరజాపు, హిందుస్తాన్ టైమ్స్ తెలుగు)
సంబంధిత కథనం
టాపిక్