



Best Web Hosting Provider In India 2024

Hyderabad Hong Kong Flights : హైదరాబాద్ టు హాంకాంగ్ – అందుబాటులోకి విమాన సర్వీసులు, ఇవిగో వివరాలు
హైదరాబాద్- హాంకాంగ్ మధ్య విమాన సర్వీసులు పునఃప్రారంభమయ్యాయి. ఇందుకు సంబంధించిన వివరాలను GMR హైదరాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం లిమిటెడ్ పేర్కొంది. వారంలో మూడు రోజులు ఈ సేవలు అందుబాటులో ఉంటాయని ప్రకటించింది.

హైదరాబాద్ నుంచి హాంకాంగ్ మధ్య నడిచే నాన్ స్టాప్ విమాన సర్వీసులను క్యాథే పసిఫిక్ ఎయిర్ వేస్ లిమిటెడ్ పునరుద్ధరించింది. ఈ మేరకు జీఎంఆర్ హైదరాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లిమిటెడ్ (జిహెచ్ఐఎఎల్) గురువారం ఓ ప్రకటన విడుదల చేసింది. ఇందులో పేర్కొన్న వివరాల ప్రకారం….. క్యాథే పసిఫిక్ ఎయిర్ వేస్ లిమిటెడ్ సేవలు ఐదు భారతీయ నగరాలలో అందుతున్నాయని వెల్లడించింది. ఇందులో ఢిల్లీ, ముంబై, బెంగళూరు, చెన్నై తోపాటు హైదరాబాద్ నగరం ఉన్నట్లు పేర్కొంది.
2020లో నిలిపివేత….
2020 లో కోవిడ్ -19 మహమ్మారి సమయంలో హైదరాబాద్ నుంచి సాగే కార్యకలాపాలను క్యాథే పసిఫిక్ నిలిపివేసింది. ఆ తర్వాత గత నెల మార్చి 31న సేవలను తిరిగి ప్రారంభించింది. ప్రయాణికులు అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఈ సేవలు… వారానికి మూడుసార్లు(సోమ, గురు, ఆదివారం) అందుబాటులో ఉంటాయి.
హైదరాబాద్-హాంకాంగ్ మధ్య విమాన సర్వీసులను పునరుద్ధరించడం అంతర్జాతీయ కనెక్టివిటీలో ఒక ముఖ్యమైన మైలురాయి అని జిహెచ్ఐఎఎల్ సీఈవో ప్రదీప్ పాణికర్ అన్నారు. రెండు ప్రాంతాల మధ్య బలమైన వ్యాపార సంబంధాలు, పర్యాటకం, సాంస్కృతిక మార్పిడికి ఇది దోహదపడుతుందని అభిప్రాయపడ్డారు. కార్గో సేవల విషయంలో అనేక ప్రయోజనాలు చేకూరే అవకాశం ఉందన్నారు.
దక్షిణాసియా, మిడిల్ ఈస్ట్, ఆఫ్రికా రీజినల్ జనరల్ మేనేజర్ రాకేశ్ రైకార్ మాట్లాడుతూ…. హైదరాబాద్ కు విమానాలను పునరుద్ధరించడం అనేది తమ సేవల విస్తరణ వ్యూహంలో ఒక ముఖ్యమైన ముందడుగు అని అభిప్రాయపడ్డారు. ఈ పునరుద్ధరణతో… భారతీయ ప్రయాణికులకు ప్రపంచ స్థాయి సేవలను అందించడానికి సిద్ధంగా ఉంటామని చెప్పారు.
ఈ డైరెక్ట్ సర్వీస్ ను ఎయిర్ లైన్స్ యొక్క ఎయిర్ బస్ ఎ 330-300 ఎయిర్ క్రాఫ్ట్ నిర్వహిస్తుంది. ఇందులో బిజినెస్, ఎకానమీ క్యాబిన్లు ఉన్నాయి. కాథే పసిఫిక్ సర్వీసెస్ లిమిటెడ్… ప్రస్తుతం భారతదేశంలోని ఐదు గమ్యస్థానాల నుంచి వారానికి మొత్తం 39 రిటర్న్ ప్యాసింజర్ విమానాలను నడుపుతుంది.
సెప్టెంబర్ 1, 2025 నాటికి ఇది వారానికి 43 రిటర్న్ సర్వీసులకు పెరుగుతుంది. ఇందులో హైదరాబాద్ నుంచి వారానికి ఐదు విమానాలు, ఢిల్లీ నుంచి డబుల్-డైలీ విమానాలు, ముంబై నుంచి వారానికి పది విమానాలు, బెంగళూరు మరియు చెన్నై నుండి రోజువారీ విమానాలు రాకపోకలు సాగిస్తాయి.
రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం 2024 లో 25 మిలియన్ల ప్రయాణీకుల రద్దీ మార్కును దాటింది. 2023 లో 21 మిలియన్లతో పోలిస్తే…. 19 శాతం పెరుగుదలను నమోదు చేసింది.
టాపిక్