




Best Web Hosting Provider In India 2024

L2 Empuraan Controversy: పార్లమెంట్‌కు చేరిన ఎల్2 ఎంపురాన్ వివాదం.. కేరళ బీజేపీ ఎంపీ వివరణ.. బాక్సాఫీస్ రికార్డు బ్రేక్
L2 Empuraan Controversy: ఎల్2 ఎంపురాన్ మూవీ వివాదం పార్లమెంట్ కు చేరింది. ఈ సినిమా సెన్సార్ కత్తిరింపుల విషయంలో ప్రభుత్వ ఒత్తిడేమీ లేదని బీజేపీ ఎంపీ సురేష్ గోపీ.. రాజ్యసభలో వివరణ ఇచ్చారు.

L2 Empuraan Controversy: మలయాళ స్టార్లు మోహన్ లాల్, పృథ్వీరాజ్ సుకుమారన్ నటించిన మూవీ ఎల్2 ఎంపురాన్ వివాదం పార్లమెంట్ కు చేరింది. బీజేపీ ఎంపీ, మలయాళ నటుడు సురేష్ గోపీ ఈ సినిమాకు 24 కట్స్ చేయడంపై గురువారం (ఏప్రిల్ 3) పార్లమెంట్ లో స్పందించారు. ఈ విషయంలో ప్రభుత్వం నుంచి ఎలాంటి ఒత్తిడి లేదని ఆయన స్పష్టం చేశారు.
సురేష్ గోపీ ఏమన్నారంటే..
రాజ్యసభలో గురువారం ఎంపీ జాన్ బ్రిటాస్ ఈ ఎల్2 ఎంపురాన్ మూవీ వివాదంపై మాట్లాడారు. ఈ సినిమాలో 2002 గుజరాత్ అల్లర్లను చూపించినందుకే రాజకీయ ఒత్తిడి పెట్టారని ఆయన ఆరోపించారు. దీనికి బీజేపీ ఎంపీ సురేష్ గోపీ సమాధానమిచ్చారు. “అసలు వాస్తవం ఏంటంటే.. ఈ విషయంలో ఒకే నిజం ఉంది. దీనిని భారతీయులందరికీ చెప్పాలనుకుంటున్నాను. ఎంపురాన్ ప్రొడ్యూసర్లపై ఎలాంటి సెన్సార్ ఒత్తిళ్లు లేవు” అని స్పష్టం చేశారు.
ఇక సినిమా థ్యాంక్యూ కార్డు నుంచి తన పేరును తాను కోరడం వల్లే తొలగించారని కూడా ఈ సందర్భంగా సురేష్ గోపీ చెప్పారు. “సినిమా మొదట్లో వేసిన థ్యాంక్యూ కార్డులో నుంచి నా పేరును డిలీట్ చేయాల్సిందిగే నేను ఫోన్ చేసిన నిర్మాతలను కోరాను. ఇదే నిజం. ఒకవేళ ఇది అబద్ధమైతే నేను ఎలాంటి శిక్షకైనా సిద్ధమే. సినిమాలో నుంచి 17 సీన్లను డిలీట్ చేయాలన్నది ప్రొడ్యూసర్లు, లీడ్ యాక్టర్, డైరెక్టర్ నిర్ణయం” అని సురేష్ గోపీ చెప్పారు.
ఈ సినిమాపై గతంలోనూ ఏఎన్ఐతో మాట్లాడుతూ సురేష్ గోపీ స్పందించారు. “సరే, అసలు వివాదం ఏంటి? దీనిని మొదలుపెట్టింది ఎవరు? ఇదంతా వ్యాపారం. జనాల ఆలోచనతో ఆడుకొని డబ్బు చేసుకుంటున్నారు. అంతే” అని ఆయన అన్నారు.
ఎల్2: ఎంపురాన్ బాక్సాఫీస్ రికార్డు
ఓవైపు ఈ వివాదం కొనసాగుతున్నా.. ఎల్2: ఎంపురాన్ మూవీ బాక్సాఫీస్ రికార్డులు క్రియేట్ చేస్తూనే ఉంది. ఏడో రోజు ఈ సినిమా ఇండియాలో మొత్తంగా రూ.84.25 కోట్ల నెట్ కలెక్షన్లు సాధించింది. ఇక ప్రపంచవ్యాప్తంగా ఈ మొత్తం రూ.239.7 కోట్లకు చేరింది. ఈ రూ.200 కోట్ల మార్క్ ను ఈ సినిమా కేవలం 5 రోజుల్లోనే దాటింది.
ప్రస్తుతానికి అత్యధిక వసూళ్లు సాధించిన మలయాళ మూవీగా ఉన్న మంజుమ్మెల్ బాయ్స్ రికార్డు కూడా ఎల్2 ఎంపురాన్ మూవీ బ్రేక్ చేసేలా ఉంది. ఆ మూవీ రూ.240.5 కోట్లు వసూలు చేసింది. మలయాళంలో రూ.200 కోట్ల మార్క్ దాటిన తొలి సినిమా అదే. ఇప్పుడు ఎల్2: ఎంపురాన్ కూడా రూ.200 కోట్ల మార్క్ అందుకుంది.
సంబంధిత కథనం