



Best Web Hosting Provider In India 2024

Warangal Airport : మామునూరు ఎయిర్ పోర్టు భూసేకరణకు తొలగని అడ్డంకులు – భూనిర్వాసితులతో చర్చలు విఫలం..!
Warangal Mamunur Airport : మామునూరు ఎయిర్ పోర్టు భూసేకరణకు అడ్డంకులు తొలగటం లేదు. తాజాగా భూనిర్వాసితులతో అధికారులు జరిపిన చర్చలు విఫలమయ్యాయి. రైతులు, అధికారుల మధ్య సయోధ్య కుదరకపోవటంతో… మిగిలిపోయిన భూసేకరణ ప్రక్రియ మరికొంత ఆలస్యమయ్యే అవకాశం ఉంది.

వరంగల్ మామునూరు ఎయిర్ పోర్టు భూముల వ్యవహారం కొలిక్కిరాలేదు. భూసేకరణ నిమిత్తం గురువారం ఉదయం వరంగల్ అడిషనల్ కలెక్టర్ సంధ్యారాణి, ఆర్డీవో సత్యపాల్, ఇతర అధికారులు వరంగల్ జిల్లా కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాలులో రైతులతో సమావేశం కాగా.. ఆఫీసర్లు, రైతుల మధ్య సయోధ్య కుదరలేదు. పరిహారం విషయంలో రైతులు తగ్గకపోవడంతో చర్చలు కాస్త విఫలమయ్యాయి. దీంతో వరంగల్ మామునూరు ఎయిర్ పోర్టుకు కావాల్సిన భూసేకరణ విషయంలో ఆఫీసర్లు తలలు పట్టుకోవాలసిన పరిస్థితి నెలకొంది.
253 ఎకరాలు అవసరం
మామునూరు ఎయిర్ పోర్టు పునరుద్ధరణకు 253 ఎకరాలు అవసరం కాగా.. ఆ భూమిని సేకరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం గతేడాది నవంబర్ 17న రూ.205 కోట్లు విడుదల చేస్తూ జీవో ఇచ్చింది. ఈ మేరకు మామునూరు ఎయిర్ పోర్టు సమీపంలోని గుంటూరుపల్లి, నక్కలపల్లి, గాడిపల్లి గ్రామాల శివారులో భూమిని సేకరించేందుకు ఆఫీసర్లు కసరత్తు చేశారు. ఈ మేరకు దాదాపు 233 మందికి చెందిన 253 ఎకరాలను గుర్తించి, ఇటీవలే సర్వే కూడా పూర్తి చేశారు. ఇంతవరకు బాగానే ఉన్నా.. ఆ భూములకు పరిహారం చెల్లింపు విషయంలో మాత్రం రైతులు మాత్రం తగ్గడం లేదు.
ఎకరాకు రూ.2 కోట్లు డిమాండ్
ఎయిర్ పోర్టు పునరుద్ధరణకు కావాల్సిన భూమిలో నక్కలపల్లి, గుంటూరుపల్లి, గాడిపల్లి గ్రామాలకు చెందిన 233 మంది రైతులకు సంబంధించిన వ్యవసాయం, అసైన్డ్ భూములు, లే అవుట్ ప్లాట్లు, 13 నివాస గృహాలున్నాయి. దీంతో భూ సేకరణ ప్రక్రియలో భాగంగా కొద్దిరోజుల కిందట జిల్లా మంత్రి కొండా సురేఖ, ఎంపీ కడియం కావ్య, పరకాల, వర్ధన్నపేట ఎమ్మెల్యేలు రేవూరి ప్రకాశ్ రెడ్డి, కేఆర్ నాగరాజు, తదితర నేతలు, ఆఫీసర్లతో కలిసి గతేడాది నవంబర్ 7న ఆ మూడు గ్రామాల రైతులు, ప్రజలతో సమావేశం అయ్యారు.
ఈ సందర్భంగా తమకు భూమికి బదులు భూమి ఇవ్వాల్సిందేనని అక్కడి రైతులు డిమాండ్ చేశారు. కానీ అది సాధ్యమయ్యే పని కాదని, మార్కెట్ రేట్ కు అనుగుణంగా పరిహారం చెల్లిస్తామంటూ అధికారులు సర్వే పూర్తి చేశారు. ఈ నేపథ్యంలో పరిహారం చెల్లింపు విషయం కూడా పలుమార్లు రైతులతో సమావేశం అయ్యారు. ఈ మేరకు అక్కడున్న వ్యాల్యూను బట్టి ఎకరాకు రూ.2 కోట్లు పరిహారం చెల్లించాలని రైతులు పట్టుబడుతున్నారు. కానీ అధికారులు మాత్రం రైతులు అడిగినంత పరిహారం ఇవ్వలేక పలుమార్లు చర్చలు జరిపి, రూ.30 లక్షల వరకు పరిహారానికి ఒప్పించే ప్రయత్నం చేశారు. ఇందుకు రైతులు ఒప్పుకోకపోవడంతో భూ సేకరణ ప్రక్రియ ముందుకు సాగడం లేదు.
మరోమారు చర్చలు విఫలం
ప్రభుత్వం మామునూరు ఎయిర్ పోర్టు పునరుద్ధరణను ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న నేపథ్యంలో భూసేకరణ ప్రక్రియ పూర్తి చేయాల్సిందిగా ఆఫీసర్లకు ఆదేశాలు వచ్చాయి. దీంతో గురువారం ఉదయం వరంగల్ అడిషనల్ కలెక్టర్ సంధ్యారాణి, ఆర్డీవో సత్యపాల్ రెడ్డి, ఇతర అధికారులు ఎయిర్ పోర్టు భూనిర్వాసిత రైతులతో సమావేశమయ్యారు.
గుంటూరుపల్లి, నక్కలపల్లి, గాడిపల్లి గ్రామాలకు చెందిన దాదాపు 60 మంది రైతులతో వరంగల్ కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాలులో సుమారు రెండు గంటల పాటు చర్చలు జరిపారు. కొన్నిచోట్లా ఎకరాకు రూ.60 లక్షలు, మరికొన్ని చోట్ల రూ.50 లక్షల వరకు పరిహారం ఇస్తామని ఆఫీసర్లు రైతులకు చెప్పగా.. తమకు ఎకరాకు రూ.2 కోట్లకు తగ్గకుండా పరిహారం చెల్లించాల్సిందేనని రైతులు పట్టుబట్టారు. దీంతో చర్చలు ముందుకు సాగని పరిస్థితి నెలకొంది. చివరకు చేసేదేమీ లేక సఫలం కాకుండానే చర్చలను మధ్యలోనే ముగించేశారు.
రూ.2 కోట్లు, ఉద్యోగాలు ఇవ్వాలి: రైతులు
మామునూరు ఎయిర్ పోర్టు కోసం భూములు ఇచ్చే రైతులకు ఎకరాకు రూ.2 కోట్ల పరిహారంతో పాటు వారి కుటుంబ సభ్యులకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలని భూనిర్వాసిత రైతులు డిమాండ్ చేశారు. అధికారులతో చర్చల విఫలం అనంతరం వారు మీడియాతో మాట్లాడారు. ఎయిర్ పోర్టు కోసం తమ జీవనాధారమైన భూములు కోల్పోవాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు.
తమకు భూమికి బదులు భూమి ఇవ్వాలని, లేదంటే ఎకరాలకు రూ.2కోట్లకు తగ్గకుండా పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో తాము ఎయిర్ పోర్టు పునరుద్ధరణకు భూములు ఇవ్వబోమని స్పష్టం చేశారు. ఇదిలాఉంటే ప్రభుత్వం ఎయిర్ పోర్టు అంశాన్ని సీరియస్ గా తీసుకుంటుంటే.. భూసేకరణ అంశం అధికారులకు సవాల్ గా మారింది. మరి రైతులకు డిమాండ్ కు ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటుందో చూడాలి.
(రిపోర్టింగ్: హిందుస్తాన్ టైమ్స్ తెలుగు, ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రతినిధి).
సంబంధిత కథనం
టాపిక్