



Best Web Hosting Provider In India 2024

Telangana Cabinet Expansion : కేబినెట్ విస్తరణపై ఆశలు – ఆ జిల్లా నేతల ప్రయత్నాలు ఫలించేనా..?
Telangana cabinet expansion : తెలంగాణ కేబినెట్ విస్తరణపై సందిగ్ధత కొనసాగుతూనే ఉంది. ఉగాది నాటికి విస్తరణ ఉంటుందని భావించినప్పటికీ… అలా జరగలేదు. ఆశావహులు ఎవరికి వారుగా ప్రయత్నాలు చేస్తుండటంతో… తుది జాబితాపై అధినాయకత్వం ఆచితూచీ వ్యవహరిస్తోంది.

తెలంగాణ మంత్రివర్గ విస్తరణ అప్పుడు.. ఇప్పుడూ అంటూ చాలా రోజులుగా ప్రచారం జరుగుతోంది. దీంతో ఆశావహులు పార్టీ పెద్దలను ప్రసన్నం చేసుకునే పనిలో బిజీగా ఉంటున్నారు. 15 నెలలు దాటినా ఇంకా పూర్తిస్థాయి మంత్రివర్గం కొలువుదీరలేదు. ప్రభుత్వం ఏర్పాటైన నాటి నుంచి విస్తరణపై ఊహాగానాలు వినిపిస్తూనే ఉన్నప్పటికీ… ఖరారు మాత్రం కావటం లేదు.
తాజాగా ఉగాదిలోపే ప్రక్రియ పూర్తవుతుందన్న చర్చ జోరుగా వినిపించింది. ఆరు స్థానాలు ఖాళీగా ఉండగా… ప్రస్తుత విస్తరణలో నాలుగు బెర్తులను భర్తీ చేస్తారని వార్తలు వచ్చాయి. అంతేకాదు… వాకిటి శ్రీహరి, కోమటిరెడ్డి రాజ్ గోపాల్ రెడ్డి, వివేక్, సుదర్శన్ రెడ్డితో పాటు పలువురు పేర్లు ప్రధానంగా తెరపైకి కూడా వచ్చాయి. ఇదిలా ఉన్నప్పటికీ… పలువురు ఆశావహులు మాత్రం గట్టిగా ప్రయత్నాలు చేస్తున్నారు. ఢిల్లీకి వెళ్లి పార్టీ పెద్దలను కలిసి… పరిస్థితులను వివరించే ప్రయత్నం చేశారు. దీంతో ఈ ప్రక్రియ మరోసారి ఆలస్యం కాబోతుందన్న చర్చ వినిపిస్తోంది.
రంగారెడ్డి జిల్లా నేతల ప్రయత్నాలు…!
తాజాగా విస్తరణపై రంగారెడ్డి జిల్లా నేతలు గట్టి ఆశలు పెంచుకున్నారు. ఉమ్మడి రంగారెడ్డి జిల్లా నుంచి ఒక్కరికైనా అవకాశం ఇవ్వాలని కోరుతున్నారు. ఒక్కొక్కరిగా కాదు… అందరూ కలిసి పార్టీ పెద్దలను కూడా కలిసి విజ్ఞప్తి చేస్తున్నారు. ఇటీవలే ఢిల్లీకి వెళ్లిన జిల్లా ఎమ్మెల్యేలు… పార్టీ పెద్దలను కలిశారు. ఉమ్మడి రంగారెడ్డి జిల్లా నుంచి ఒక్కరు కూడా మంత్రి లేరని… తప్పనిసరిగా విస్తరణలో అవకాశం కల్పించాలని కోరారు.
ఇదిలా ఉంటే పార్టీ సీనియర్ నేత, జానారెడ్డి కూడా కేబినెట్ విస్తరణపై అధినాయకత్వానికి లేఖ రాశారు. మంత్రివర్గ విస్తరణలో రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాల నుంచి ప్రాతినిథ్యం వహిస్తున్న ప్రజాప్రతినిధులకు ఛాన్స్ ఇవ్వాలని కోరారు. దీంతో రంగారెడ్డి జిల్లా నేతల్లో ఎవరికి అవకాశం ఉండబోతుందన్న చర్చ జోరుగా జరుగుతోంది.
ఇబ్రహీంపట్నం నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన మల్‌రెడ్డి రంగారెడ్డి గట్టిగా మంత్రి పదవి కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. తనకు అవకాశం ఇవ్వకపోతే… అవసరమైతే రాజీనామా కూడా చేస్తానంటూ కూడా వ్యాఖ్యలు చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఆయనే కాదు… రామ్మోహన్‌రెడ్డి, మనోహర్‌రెడ్డి, గడ్డం ప్రసాద్ కుమార్ తో పాటు మరో ఎమ్మెల్యే కూడా మంత్రి పదవిని ఆశిస్తున్నారు.
ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో 14 అసెంబ్లీ స్థానాలు ఉండగా.. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో నాలుగు చోట్ల కాంగ్రెస్ గెలిచింది. వీరిలో మల్‌రెడ్డి రంగారెడ్డి (ఇబ్రహీంపట్నం), టి.రామ్మోహన్‌రెడ్డి (పరిగి), మనోహర్‌రెడ్డి (తాండూరు),ప్రసాద్‌కుమార్ (వికారాబాద్) ఉన్నారు. వికారాబాద్ నుంచి గెలిచిన గడ్డం ప్రసాద్ కుమార్‌కు స్పీకర్ స్థానం దక్కింది. అయితే మంత్రివర్గంలో మాత్రం ఎవరికి దక్కలేదు. దీంతో తమ జిల్లాకు ఎలాగైనా మంత్రి పదవి ఇవ్వాలని గెలిచిన ఎమ్మెల్యేలు కోరుతున్నారు. గ్రేటర్ హైదరాబాద్ లో కీలకమైన రంగారెడ్డి జిల్లాను విస్మరించటం సరికాదన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు.
తెలంగాణ కేబినెట్ విస్తరణపై అన్ని కోణాల్లో కాంగ్రెస్ అధినాయకత్వం కసరత్తు చేస్తోంది. ప్రధానంగా సామాజిక సమీకరణాలను పరిగణలోకి తీసుకోవటంతో పాటు సీనియార్టీని కూడా పరిశీలిస్తోంది. ఈ నేపథ్యంలో… ఉమ్మడి రంగారెడ్డి జిల్లా నుంచి గెలిచిన ఎమ్మెల్యేల్లో ఒక్కరికైనా మంత్రిపదవి వరిస్తుందా..? లేదా…? అన్నట్లు టాక్ ఆఫ్ ది పాలిటిక్స్ గా మారింది…!
సంబంధిత కథనం
టాపిక్