




Best Web Hosting Provider In India 2024

Sircilla District : ప్రభుత్వ పాఠశాలలో క్షుద్రపూజల కలకలం – బలిచ్చేందుకు యత్నం….!
రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో ప్రభుత్వ పాఠశాలలో క్షుద్రపూజలు కలకలం సృష్టిస్తున్నాయి. పసుపు కుంకుమ్మ చల్లి గొర్రెను బలిచ్చేందుకు యత్నించగా మీడియా రాకతో తప్పించుకున్నారు నిర్వాహకులు. విచారణ పేరుతో అధికారులు జరిగిన తప్పిదాన్ని కప్పిపుచ్చుకునే ప్రయత్నం చేస్తున్నారు.

చదువులమ్మ ఒడి సర్కార్ బడి మూడనమ్మకాలకు వేధికయ్యింది. సిరిసిల్లలో కుసుమ రామయ్య జడ్పీ బాలుర ఉన్నత పాఠశాలలో పంతుళ్ళు అనాలోచితంగా క్షుద్రపూజలు నిర్వహించారు. పసుపుకుంకుమ చల్లి అగర్ బత్తుల పొగేసి గొర్రెను బలిచ్చేందుకు సిద్దమయ్యారు.
తెల్లవారుజామున ఐదు గంటలకు స్కూల్ గేట్ తెరిచి మనుషుల అలికిడి వినిపించడంతో అటుగా వెళ్ళిన మీడియా ప్రతినిధులకు బడిలో జరిగే మూడనమ్మకాల ముసుగులో క్షుద్రపూజల తతంగం బయటపడింది. స్కూల్ లో ఇదేం పని అని అడిగితే వాస్తు దోషం కోసం పూజలు చేస్తున్నట్లు రికార్డు అసిస్టెంట్ వెంకటేశం చెప్పి అక్కడి నుంచి తప్పించుకుని పారిపోయాడు.
గొర్రెను పట్టుకొచ్చి బలిచ్చేందుకు యత్నించిన ఇద్దరు ఆ ప్రయత్నం విరమించుకుని అక్కడి నుంచి గొర్రెతో సహా వెళ్ళిపోయారు. మీడియా ప్రతినిధులు డిఈవోకు సమాచారం ఇవ్వడంతో పాఠశాలకు ఎంఈవో రఘుపతి పాఠశాలకు చేరుకుని విచారణ జరిపిస్తామని తెలిపారు. తెల్లవారుజామున స్కూల్ గేట్ తీయడంపై స్కూల్ ప్రారంభం అయిన తర్వాత విచారణ జరిపి చర్యలు తీసుకుంటామని చెప్పి అక్కడి నుంచి నిష్క్రమించారు.
తప్పించుకునే ప్రయత్నం…
క్షుద్రపూజలతో గొర్రెను బలిచ్చేందుకు యత్నించిన పాఠశాల ప్రధానోపాద్యాయులను మీడియా ప్రతినిధులు ప్రశ్నిస్తే తనకేమి తెలియదని తప్పించుకున్నారు. పాఠశాలను సందర్శించి విచారణ జరుపుతామన్న ఎంఈవో రఘుప….తి స్కూల్ ఓపెన్ చేసిన తర్వాత అటువైపు కన్నెతి చూడకపోవగా మీడియాకు ముఖం చాటేశారు. డిఈవో దృష్టికి తీసుకెళ్ళితే విచారణ జరిపి చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.
వాస్తు దోషం పేరిట పూజలు…
విద్యాబుద్దులు నేర్పాల్సిన పాఠశాలలో వాస్తు దోషం పేరిట క్షుద్రపూజలకు సిద్దమైనట్లు ప్రచారం జరుగుతుంది. గత పిబ్రవరి నెలలో పాఠశాలలో పనిచేసే ఉద్యోగి ప్రవీణ్ గుండెపోటుతో ప్రాణాలు కోల్పోవడంతో వాస్తు దోషం తోనే ఆ ఘటన చోటుచేసుకుందని బావిస్తున్నారు. వాస్తు పూజలపేరుతో గొర్రెను బలిచ్చేందుకు యత్నించినట్లు స్థానికులు చెబుతున్నారు.
విద్యాబుద్ధులు నేర్పాల్సిన పాఠశాలలో వాస్తు దోషం అంటూ గొర్రెను బలిచ్చే ప్రయత్నం చేయడంపై సర్వత్రా ఆందోళన వ్యక్తం అవుతుంది. మూడనమ్మకంతో పూజల పేరిట గొర్రెను బలిచ్చేందుకు యత్నించిన వారిపై చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.
రిపోర్టింగ్ కె.వి.రెడ్డి ఉమ్మడి కరీంనగర్ జిల్లా కరస్పాండెంట్ హిందుస్థాన్ టైమ్స్ తెలుగు.
టాపిక్