



Best Web Hosting Provider In India 2024

Bad Coconut water: కొబ్బరినీళ్లు తాగాక మరణించిన ఒక వ్యక్తి, కోకోనట్ వాటర్ తాగే ముందు ఈ జాగ్రత్తలు తీసుకోండి
Bad Coconut water: కొబ్బరి నీళ్లు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. వేసవిలో కొబ్బరినీళ్లు తాగడం ముఖ్యం. ఈ నీరు వడదెబ్బ తగలకుండా మన శరీరాన్ని కాపాడుతుంది. అయితే అదే కొబ్బరినీళ్లు ఒక వ్యక్తి ప్రాణాన్ని తీశాయి. అదెలాగో తెలుసుకోండి.

వేసవిలో కచ్చితంగా తాగాల్సిన పానీయాలలో కొబ్బరి నీళ్లు ఒకటి. ఇవి ఆరోగ్యానికి ఎంతో మంచిది. పైగా చల్లదనాన్ని ఇచ్చి వడదెబ్బ బారిన పడకుండా మనల్ని కాపాడతాయి.
వేసవిలో ఎక్కువ మంది బీచ్ ప్రాంతాలకు వెళ్లేందుకు ఇష్టపడతారు. ఆ బీచ్ల్లో దొరికేవి కొబ్బరి బొండాలే. కొబ్బరి బోండాలను తాగడం వల్ల అలసిపోయిన ప్రాణం లేచి వచ్చినట్టు అనిపిస్తుంది. కానీ ఓ వ్యక్తి కొబ్బరి నీళ్లు తాగిన తర్వాత మెదడు దెబ్బతిని మరణించాడు.
ఈ షాకింగ్ కేసు ఒక్కసారిగా కొబ్బరి నీళ్ళు తాగే వారిలో భయాన్ని పుట్టించింది. అతను మరణించడానికి కారణం చెడిపోయిన కొబ్బరి నీళ్లు తాగడమే. కొన్ని కొబ్బరి బోండాల్లో కూడా నీరు చెడిపోయే అవకాశం ఉంది.
అలాగే బాటిల్స్ లో నింపి తెచ్చుకున్న కొబ్బరి నీళ్ళు కూడా ఎక్కువ కాలం నిల్వ ఉండవు. తెచ్చిన గంటలోపే తాగడం ముఖ్యం. పులిసిపోయి వాటిల్లో బ్యాక్టీరియాలో అభివృద్ధి చెందుతాయి. ఇతను కూడా అలా చెడిపోయిన కొబ్బరి నీళ్లు తాగి కేవలం 26 గంటల్లోనే మరణించాడు.
నివేదికలు చెబుతున్న ప్రకారం ఒక వ్యక్తి కొబ్బరినీళ్ళను తెచ్చుకొని రిఫ్రిజిరేటర్ లో నిల్వ చేసుకున్నాడు. వాటిని నెలరోజుల పాటు తాగుతూ ఉన్నాడు. వాటి రుచి కూడా మారిపోయింది. నెలరోజుల తర్వాత అవి వింత వాసన వేయడంతో కాస్త తాగి ఆపేశాడు. కానీ ఆ కొంచెం కొబ్బరి నీళ్ళు శరీరంలో చేరి ప్రాణాంతకమైన ఫంగల్ ఇన్ఫెక్షన్ కు కారణమయ్యింది.
అతనికి వెంటనే చెమటలు పట్టడం, వాంతులు కావడం జరిగింది. శరీరం తెల్లబడటం ప్రారంభమైంది. ఆసుపత్రిలో చేరాక మెదడు వాపు వచ్చినట్టు వైద్యులు నిర్ధారించారు. 24 గంటల తర్వాత బ్రెయిన్ డెడ్ అయినట్టు ప్రకటించారు. దీన్ని బట్టి పాడైపోయిన కొబ్బరి నీళ్ళు తాగడం ఎంత ప్రమాదకరమో తెలుసుకోండి.
కొబ్బరి నీళ్లను ఎలా నిల్వ చేయాలి?
కొబ్బరినీళ్లను నిల్వ చేయాలి అనుకుంటే తక్కువ ఉష్ణోగ్రతలు అంటే నాలుగు డిగ్రీల నుంచి ఐదు డిగ్రీల వరకు నిల్వ చేసుకోవాలి. కేవలం సాధారణ రిఫ్రిజిరేటర్లో అంటే 19 డిగ్రీలు దగ్గర నిల్వ చేయడం వల్ల ఎలాంటి ఉపయోగం ఉండదు. అందులో శిలీంద్రాలు, బ్యాక్టీరియా పెరిగిపోతుంది. కొబ్బరి నీళ్ళే కాదు కొబ్బరి బోండాలను కూడా తెచ్చి చాలామంది నెల రోజులు పాటు ఇంట్లోనే ఉంచుతూ ఉంటారు. వాటిలో కూడా బ్యాక్టీరియా పేరుకుపోయే అవకాశం ఉంటుంది. చెట్టు నుంచి దించాక ఆ కొబ్బరి బొండంలోని నీటిని రెండు మూడు రోజుల్లోనే తాగేస్తే అవి తాజాగా ఉంటాయి.
కొబ్బరి నీళ్లు తాగేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు
కొబ్బరినీళ్లు తాగేటప్పుడు కొన్ని రకాల జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. తాజా కొబ్బరి బోండాన్నే ఎంచుకోండి. తెరిచి ఉన్న కొబ్బరి బోండాలు లేదా పగిలిపోయిన కొబ్బరి బోండాలను తాగేందుకు ప్రయత్నించకండి. వాటిలో బ్యాక్టీరియా చేరే అవకాశం ఉంటుంది. కొబ్బరి బోండాను ఇంటికి తెచ్చిన తర్వాత అది తక్కువ ఉష్ణోగ్రతల వద్ద నిల్వ చేయండి. అలా చేయడం వల్ల అది ఎక్కువ రోజులు తాజాగా ఉంటుంది. మీకు కొబ్బరి రుచి మారినట్టు లేదా చేతితో తాకినప్పుడు జిగటగా అనిపిస్తే దాన్ని పడేయడం మంచిది. లేకుంటే అది శరీరంలో చేరి తీవ్రమైన వ్యాధులకు కారణం అవుతుంది.
(గమనిక: అధ్యయనాలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ కోసం ఇక్కడ అందిస్తున్నాం. ఇది కేవలం సమాచారం మాత్రమే. ఇది వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి సందేహాలుంటే వెంటనే వైద్యులను సంప్రదించండి.)
సంబంధిత కథనం