




Best Web Hosting Provider In India 2024

Medical Tests After 30: ముప్పై ఏళ్ళు దాటిన మహిళలు తప్పక చేయించుకోవాల్సిన వైద్య పరీక్షలు ఇవి ? నిర్లక్ష్యం చేయకండి!
Medical Tests After 30: మహిళలు ముప్పై ఏళ్లు దాటిన తర్వాత కొన్ని వైద్య పరీక్షలు తప్పక చేయించుకోవాలని మీకు తెలుసా? వీటిని నిర్లక్ష్యం చేస్తే ప్రాణాంతక వ్యాధుల ప్రమాదం ఉందని నిపుణులు చెబుతున్నారు. అవేంటో తెలుసుకుని ఆరోగ్యాన్ని కాపాడుకోండి.

వయసు పెరిగే కొద్దీ మన ఆరోగ్యంలో చాలా మార్పులు కనిపిస్తుంటాయి. శరీరం సున్నితంగా మారడంతో పాటు మనకు తెలియకుండానే కొన్ని వ్యాధులు మొదలైపోతాయి. ఈ మార్పులు పురుషులతో పాటు మహిళల్లోనూ సమానంగా కనిపించినా, మహిళల్లో కొన్ని వ్యాధుల తీవ్రత ఎక్కువగా ఉంటుందట. వాస్తవానికి, జీవసంబంధమైన తేడాలు, లింగ అసమానతలు మహిళల్లో అనేక వ్యాధులు, ఇన్ఫెక్షన్ల ప్రమాదాన్ని పెంచుతాయి.
ప్రపంచ ఆరోగ్య సంస్థ నివేదిక ప్రకారం, కౌమార బాలికలు, యువతులలో వారితో సమాన వయస్సున్న పురుషులతో పోలిస్తే HIV సంక్రమణ ప్రమాదం రెట్టింపుగా ఉందట. 10 మందిలో 1 మహిళకు 60 ఏళ్ళు నిండేలోపే కనీసం ఒకసారైనా థైరాయిడ్ సమస్య వచ్చే అవకాశం ఉందని సూచిస్తున్నాయి. అదేవిధంగా, ప్రతి సంవత్సరం 20-40 శాతం మరణాలు రక్తహీనత కారణంగానే సంభవిస్తున్నాయి. అందుకే, వైద్యులు 30 నుండి 40 ఏళ్ళ వయస్సు గల మహిళలు కొన్ని వైద్య పరీక్షలు తప్పనిసరిగా చేయించుకోవాలని నిపుణులు సలహాలిస్తున్నారు.
పాప్ స్మీయర్, HPV టెస్ట్
శరీరంలో అసాధారణ కణాలు పెరిగితే సర్వైకల్ క్యాన్సర్ (గర్భాశయ గ్రీవా క్యాన్సర్) ప్రమాదం పెరుగుతుంది. అందుకే, లైంగికంగా చురుకుగా ఉన్న మహిళలు మూడు నుండి ఐదు సంవత్సరాల వ్యవధిలో ఈ పరీక్ష చేయించుకోవాలి. తద్వారా సర్వైకల్ క్యాన్సర్ నుండి రక్షణ పొందవచ్చు. నిపుణులు 21-65 ఏళ్ళ వయస్సు గలవారికి ప్రతి మూడు సంవత్సరాలకు ఒకసారి ఈ పరీక్ష చేయించుకోమని సలహా ఇస్తున్నారు.
థైరాయిడ్ ఫంక్షన్ టెస్ట్ TFT, CBC
మన శరీరంలో ఉన్న థైరాయిడ్ గ్రంథిలో అసమతుల్యత హైపర్ థైరాయిడిజం లేదా హైపో థైరాయిడిజం వంటి తీవ్రమైన సమస్యలకు దారి తీస్తుంది. అదేవిధంగా, రక్తహీనత అనేది చాలా మంది మహిళలు ఎదుర్కొనే వ్యాధి. TFT అనే పరీక్ష థైరాయిడ్ స్థితిని అంచనా వేస్తుంది. CBC (సంపూర్ణ రక్త గణన) సహాయంతో రక్తహీనతను గుర్తించవచ్చు. అలసట, కారణం లేకుండా బరువు పెరగడం లేదా తగ్గడం, జుట్టు రాలడం వంటి లక్షణాలు కనిపిస్తే ఈ పరీక్ష తప్పనిసరిగా చేయించుకోండి. సాధారణ పరిస్థితుల్లో కూడా ఐదు సంవత్సరాలకు ఒకసారి ఈ పరీక్ష చేయించుకోవడం మంచిది.
మామోగ్రామ్, బ్రెస్ట్ పరీక్ష
మహిళలకు బ్రెస్ట్ క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్ష చేయించుకోవడం చాలా ముఖ్యం. దాని వల్ల ప్రారంభ దశలోనే ఏదైనా ట్యూమర్ లేదా ఇతర అసాధారణ లక్షణాల గురించి తెలుసుకోవచ్చు. అమెరికన్ క్యాన్సర్ సొసైటీ ప్రకారం, 30 ఏళ్ళు దాటిన తర్వాత సంవత్సరానికి ఒకసారి మామోగ్రఫీ, MRI (మ్యాగ్నెటిక్ రెసొనెన్స్ ఇమేజింగ్) చేయించుకోవాలి. అదేవిధంగా, తమ స్తనాలను తరచుగా స్వయంగా పరీక్షించుకోవాలి. తద్వారా మహిళలు ఏదైనా అసాధారణ లక్షణం లేదా గడ్డ గురించి స్టార్టింగ్ స్టేజ్‌లోనే తెలుసుకోవచ్చు.
కొలెస్ట్రాల్, రక్తపోటు పరీక్ష
పెరుగుతున్న వయస్సు మన హృదయ ఆరోగ్యంపై ప్రత్యక్ష ప్రభావాన్ని చూపుతుంది. దీని వలన హృదయ సంబంధిత వ్యాధుల ప్రమాదం పెరుగుతుంది. ప్రస్తుతం మనం పాటిస్తున్న జీవనశైలి, అసమతుల్య ఆహారం, ఒత్తిడి మన హృదయంపై చాలా ప్రతికూల ప్రభావాన్ని చూపుతాయి. కొలెస్ట్రాల్ పరీక్ష, BPపై దృష్టి సారించడం ద్వారా బ్రెయిన్ స్ట్రోక్, మూత్రపిండ వ్యాధులు, హృదయ సంబంధిత వ్యాధుల గురించి తెలుసుకోవచ్చు. సమస్య లేకపోయినా రక్తపోటు పరీక్ష చేయించుకోవడం మంచిదే.
బ్లడ్ గ్లూకోజ్ టెస్ట్
రక్తంలో చక్కెరను పరీక్షించడం వల్ల మధుమేహం ప్రమాదాన్ని ఆరంభ దశలోనే గుర్తించవచ్చు. ఈ పరీక్షను ముఖ్యంగా బరువు ఎక్కువగా ఉన్న లేదా వారసత్వంగా ఎవరికైనా మధుమేహం ఉన్న మహిళలు చేయించుకోవాలి. 35 ఏళ్ళు దాటిన తర్వాత ప్రతి మూడు సంవత్సరాలకు ఒకసారి చక్కెర పరీక్ష చేయించుకోవడం తప్పనిసరి.
లిపిడ్ ప్రొఫైల్
అమెరికన్ హార్ట్ అసోసియేషన్ ప్రకారం, 20 ఏళ్ళు దాటిన తర్వాత ప్రతి 4-6 సంవత్సరాలకు లిపిడ్ ప్రొఫైల్ పరీక్ష చేయించుకోవాలి. దీని ద్వారా శరీరంలో కొలెస్ట్రాల్ స్థాయిల గురించి, హృదయ సంబంధిత వ్యాధుల సంభావ్యత గురించి తెలుసుకోవచ్చు.
ఫెర్టిలిటీ టెస్ట్
30 ఏళ్ళు దాటిన తర్వాత గర్భం దాల్చాలని కోరుకునే మహిళలు తమ స్త్రీ రోగ నిపుణులను సంప్రదించి ఫెర్టిలిటీ టెస్ట్ గురించి సలహా తీసుకోవాలి. దీని ద్వారా గర్భం దాల్చే సామర్థ్యం గురించి తెలుస్తుంది. వాస్తవానికి, మహిళల అండాశయంలో అండాల సంఖ్య 20 ఏళ్ళ వయస్సు చివరి నుండి తగ్గుతూ వస్తుంది. 30 ఏళ్ళ వయస్సు చివరి నాటికి చాలా తగ్గిపోతుంది. దీనివల్ల 30 ఏళ్ళు దాటిన తర్వాత గర్భం దాల్చడంలో సమస్యలు రావచ్చు.
బోన్ డెన్సిటీ టెస్ట్
వయసు పెరిగే కొద్దీ ఎముకలు కాల్షియంను కోల్పోతాయి. వాటి సాంద్రత తగ్గుతుంది. దీని ఫలితంగా ఎముకలు బలహీనపడతాయి. జీవితంలోని వివిధ దశలలో శరీరంలోని హార్మోనల్ మార్పుల కారణంగా ఈ సమస్య పురుషుల కంటే మహిళలకు ఎక్కువగా ఉంటుంది. కానీ, DEXA స్కాన్ అనే పరీక్ష సహాయంతో ఎముకల బలాన్ని పరీక్షించడమే కాకుండా, ఆస్టియోపోరోసిస్ వంటి వ్యాధుల గురించి సకాలంలో తెలుసుకోవచ్చు. నలభై ఏళ్ళు దాటిన తర్వాత ప్రతి ఒకటి లేదా రెండు సంవత్సరాలకు ఒకసారి ఈ పరీక్ష చేయించుకోవాలి.
సంబంధిత కథనం