Test OTT Movie Review: ఓటీటీలో డైరెక్ట్ స్ట్రీమింగ్‍కు వచ్చిన మాధవన్, సిద్ధార్థ్, నయనతార సినిమా మెప్పించేలా ఉందా!

Best Web Hosting Provider In India 2024

Test OTT Movie Review: ఓటీటీలో డైరెక్ట్ స్ట్రీమింగ్‍కు వచ్చిన మాధవన్, సిద్ధార్థ్, నయనతార సినిమా మెప్పించేలా ఉందా!

Chatakonda Krishna Prakash HT Telugu
Published Apr 05, 2025 09:55 AM IST

Test Movie Review OTT: టెస్ట్ సినిమా నేరుగా ఓటీటీలో స్ట్రీమింగ్‍కు వచ్చింది. మంచి అంచనాలతో ఈ స్పోర్ట్స్ డ్రామా మూవీ అడుగుపెట్టింది. మరి ఈ చిత్రం ఎలా ఉంది, ఆసక్తికరంగా సాగిందా అనే విషయాలను ఈ రివ్యూలో చూడండి.

టెస్ట్ సినిమా రివ్యూ
టెస్ట్ సినిమా రివ్యూ

ప్రధాన నటీనటులు: మాధవన్, సిద్ధార్థ్, నయనతార, మీరా జాస్మిన్, లిరిశ్ కుమార్, కాళీ వెంకట్, ఆడుకాలం మురుగదాస్ తదితరులు

కథ: ఎస్. సుమన్ కుమార్, సంగీతం: శక్తిశ్రీ గోపాలన్, సినిమాటోగ్రఫీ: విరాజ్ సింగ్ గోహిల్

నిర్మాతలు: చక్రవర్తి రామచంద్ర, శశికాంత్

దర్శకత్వం: ఎస్.శశికాంత్

సిద్ధార్థ్, మాధవన్, నయనతార లాంటి ముగ్గురు స్టార్స్ కలిసి నటించిన టెస్ట్ చిత్రం నేరుగా నెట్‍ఫ్లిక్స్ ఓటీటీలో స్ట్రీమింగ్‍కు వస్తుండడంతో చాలా ఆసక్తి రేగింది. తమిళంలో రూపొందిన ఈ సిరీస్ తెలుగు, కన్నడ, మలయాళం, హిందీలోనూ శుక్రవారం (ఏప్రిల్ 4) స్ట్రీమింగ్‍కు వచ్చింది. నెట్‍ఫ్లిక్స్ ఫస్ట్ తమిళ్ ఒరిజినల్ మూవీగా ఇది నిలిచింది. మరి ఈ స్పోర్ట్స్ థ్రిల్లర్ మూవీ ఆసక్తికరంగా సాగి అంచనాలను అందుకుందా.. మెప్పించాలా ఉందా అనేది ఈ రివ్యూలో తెలుసుకోండి.

కథ ఇలా..

భారత సీనియర్ స్టార్ క్రికెటర్ అర్జున్ (సిద్ధార్థ్) రెండేళ్లుగా సరైన ఫామ్‍లో ఉండడు. దీంతో రిటైర్మెంట్ తీసుకోవాలని సెలెక్షన్ కమిటీ, బోర్డ్ అతడిపై ఒత్తిడి తెస్తుంది. అయితే, భారత్, పాకిస్థాన్ మధ్య జరిగే టెస్టు మ్యాచ్‍లో తాను ఆడి తీరాల్సిందేనని సెలెక్టర్లకు అర్జున్ తేల్చిచెబుతాడు. అతడి కెరీర్‌కు చావోరేవో అయిన ఆ మ్యాచ్‍లో అర్జున్‍కు అవకాశం దక్కుతుంది.

సారా అలియాజ్ శరవణన్ (మాధవన్) హైడ్రో ఫ్యుయెల్ ప్రాజెక్ట్ కోసం ప్రభుత్వ అనుమతి, నిధుల కోసం ప్రయత్నిస్తుంటాడు. అతడి భార్య కుముద (నయనతార) ఐవీఎఫ్ ద్వారా సంతానాన్ని పొందాలని అనుకుంటుంది. సారా మాత్రం ప్రాజెక్ట్ ఒత్తిడిలో ఉంటాడు. ఈ క్రమంలోనే రూ.50లక్షల అప్పు కష్టాలు కూడా అతడిని వెంటాడుతాయి. తీవ్ర ఇబ్బందుల్లో పడిపోతాడు. ఈ క్రమంలోనే ఇండియా, పాకిస్థాన్ మ్యాచ్ మొదలవుతుంది.

తన అప్పులను తీర్చుకునేందుకు భారత్, పాక్ మ్యాచ్‍ను వాడుకోవాలని సారా నిర్ణయించుకుంటాడు. ఈ క్రమంలో అతడు చేసే పని అర్జున్‍ను ఇబ్బందుల్లోకి నెడుతుంది. స్పాట్ ఫిక్సింగ్ అనుమానంతో పోలీసులు విచారణ చేస్తుంటారు. అసలు సారా ఏం చేశాడు? అర్జున్‍కు అతడి వల్ల ఎలాంటి సవాళ్లు ఎదురయ్యాయి? ఫామ్‍లోకి వచ్చి ఆ మ్యాచ్‍ను అర్జున్ గెలిపించాడా? అర్జున్, సారా, కుముదకు ఎలా సంబంధం ఉంది? కష్టాల నుంచి సారా, కుముద బయటపడ్డారా అనే అంశాలు టెస్ట్ చిత్రంలో ఉంటాయి.

ఆరంభం ఆసక్తికరంగా..

ఫామ్ కోల్పోయి రిటైర్మెంట్ ఒత్తిడిలో ఉన్న సీనియర్ క్రికెటర్, తన ఆవిష్కరణకు అనుమతి పొందేందుకు కష్టాలను ఎదుర్కొనే శాస్త్రవేత్త, ఐవీఎఫ్ ద్వారా సంతానాన్ని పొందాలని పరితపించే గృహిణి.. కష్టాలు ఎదురైనప్పుడు వారిలోని గ్రే షేడ్స్ ఎలా బయటికి వచ్చాయనే అంశాల చుట్టూ టెస్ట్ మూవీ సాగుతుంది. ముగ్గురికి జీవితంలో కీలకమైన చివరి పరీక్ష అనే కోణంలో ఈ స్టోరీ ఉంటుంది. ఈ మూడు పాత్రలను బాగా రాసుకున్నారు రచయిత సుమన్ కుమార్. కథను మాత్రం ఆ స్థాయిలో బలంగా తీర్చిదిద్దలేదు. ఆ ముగ్గురు ఎదుర్కొనే సవాళ్లు, మానసిక సంఘర్షణను సినిమా ఆరంభంలో ఆసక్తికరంగా చూపించారు దర్శకుడు శశికాంత్. ప్రధాన క్యారెక్టర్లను బాగా ఎస్టాబ్లిష్ చేశారు. కథలోకి తీసుకెళ్లేందుకు మంచి సెటప్ చేసుకున్నారు.

గతితప్పిన కథనం

మూవీ సాగుతున్న కొద్ది కథనం గతి తప్పిపోతుంది. సీన్లు రిపీట్ అయినట్టు అనిపిస్తుంది. మ్యాచ్ స్పాట్ ఫిక్సింగ్ తతంగం మొదలయ్యాక చిత్రం ఏ మాత్రం ఇంట్రెస్టింగ్‍గా సాగదు. సాగదీసినట్టుగా అనిపిస్తుంది. సెకండాఫ్‍ను ఇంట్రెస్టింగ్‍గా మలచలేకపోయారు దర్శకుడు. మ్యాచ్ చుట్టూ చాలా స్కోప్ ఉన్నా ఉపయోగించుకోలేకపోయారని అనిపిస్తుంద. ఫిక్సింగ్ తతంగం మొదలయ్యాక ఈ స్పోర్ట్స్ డ్రామా మూవీ థ్రిల్లర్‌లా మారుతుంది. కానీ ఏ మాత్రం థ్రిల్ ఇవ్వదు. ట్విస్టులు, టర్నులు ఉండవు. అప్పుల గొడవ రిపీటెడ్‍గా అనిపిస్తుంది. నరేషన్ కూడా గ్రిప్పింగ్‍గా ఉండదు. స్క్రీన్‍ప్లే చప్పగా సాగుతుంది. ఓ దశ దాటిన తర్వాత సహనానికి టెస్ట్ పెట్టినట్టు అవుతుంది.

సారా అలియాజ్ శవరణన్ పాత్ర నెగెటివ్ టర్న్ తీసుకోవడం తప్ప సెకండాఫ్‍లో పెద్దగా ఇంట్రెస్టింగ్ విషయాలు ఉండవు. ఒకే తీరులో ఫ్లాట్‍గా చిత్రం సాగుతుంది. క్లైమాక్స్ కూడా ఊహించినట్టుగానే ముగుస్తుంది. కథాబలం కూడా రానురాను లోపిస్తుంది. సినిమాను డ్రాగ్ చేసినట్టుగా అనిపిస్తుంది.

నటీనటుల పర్ఫార్మెన్స్.. ఇదే హైలైట్

టెస్ట్ సినిమాకు మాధవన్, సిద్ధార్థ్, నయనతార యాక్టింగ్ పర్ఫార్మెన్స్ బలంగా నిలిచింది. తన ప్రాజెక్ట్ కోసం పరితపించే శాస్త్రవేత్తగా, సవాళ్లను ఎదుర్కొనే ఫ్యామిలీ మ్యాన్‍ శవరణ్‍గా మాధవన్ మెప్పించారు. నెగెటివ్ షేడ్‍లోనూ ఆయన యాక్టింగ్ భేష్ అనిపిస్తుంది. సిద్ధార్థ్ కూడా క్రికెటర్ అర్జున్ పాత్రను అలవోకగా పోషించారు. ఎమోషనల్ సీన్లలోనూ తన మార్క్ చూపించారు. నయనతార కూడా తన నటనతో ఆకట్టుకున్నారు. ఈ ముగ్గురు ఈ సినిమాను తమ భుజాలపై మోశారు. సిద్ధార్థ్ భార్య పాత్ర చేసిన మీరా జాస్మీన్ కూడా తన పాత్రకు న్యాయం చేశారు. సిద్ధార్థ్ కొడుకుగా నటించిన బాలనటుడు కూడా మెప్పించారు.

సాంకేతిక విభాగం

మరింత బలమైన కథ ఉండి ఉంటే యాక్టింగ్ పర్ఫార్మెన్స్‌ల వల్ల టెస్ట్ మరింత మెప్పించేది. కానీ రచయిత సుమన్ కుమార్ స్టోరీ పూర్తిస్థాయిలో మెప్పించలేదు. దర్శకుడు శశికాంత్ ఆరంభంలో ఓకే ఆ తర్వాత అతడి నరేషన్ తేలిపోయింది. ఈ సినిమా రన్‍టైమ్ సుమారు 2 గంటల 25 నిమిషాలు ఉంది. పెద్దగా ట్విస్టు లేకపోవటం, ఫ్లాట్ నరేషన్‍తో మరింత లాంగ్‍గా అనిపిస్తుంది. ఎడిటర్ టీఎస్ సురేశ్ కొన్ని రిపీటెడ్ సీన్లను కట్ చేయాల్సింది. శక్తిశ్రీ గోపాలన్ సంగీతం ఓకే అనిపిస్తుంది. సినిమాటోగ్రఫర్ విరాజ్ సింగ్ కెమెరా పనితనం బాగానే ఉంది.

మొత్తంగా..

టెస్ట్ చిత్రం ఆరంభంలో ఆసక్తికరంగా అనిపించినా.. కాసేపటి తర్వాత లాగ్ చేసిన ఫీలింగ్ వస్తుంది. అయితే, మాధవన్, సిద్ధార్థ్, నయనతార పర్ఫార్మెన్స్ మాత్రం సినిమా ఆసాంతం ఆకట్టుకునేలా ఉంటుంది. ఈ సినిమా థ్రిల్లర్ టర్న్ తీసుకున్నా.. రెండో అర్ధభాగంలో మరీ ఆసక్తికరంగా అనిపించదు. అయితే, ఆ ముగ్గురి నటన కోసం ఈ చిత్రాన్ని ఓసారి చూడొచ్చు. నెట్‍ఫ్లిక్స్ ఓటీటీలో టెస్ట్ మూవీ స్ట్రీమింగ్ అవుతోంది.

రేటింగ్: 2.5/5

Chatakonda Krishna Prakash

TwittereMail
చాటకొండ కృష్ణ ప్రకాశ్.. హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. ఇక్కడ ప్రస్తుతం ఎంటర్‌టైన్‍మెంట్, స్పోర్ట్స్ వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. జర్నలిజంలో 7 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2022 నవంబర్‌లో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు.

సంబంధిత కథనం

Best Web Hosting Provider In India 2024

Source / Credits

Best Web Hosting Provider In India 2024