Sri rama Navami Prasadam Recipes: శ్రీరామ నవమికి చలిమిడి చేస్తున్నారా? చలిమిడి ఇలా రెండు పద్ధతుల్లో చేయొచ్చు

Best Web Hosting Provider In India 2024

Sri rama Navami Prasadam Recipes: శ్రీరామ నవమికి చలిమిడి చేస్తున్నారా? చలిమిడి ఇలా రెండు పద్ధతుల్లో చేయొచ్చు

Haritha Chappa HT Telugu
Published Apr 05, 2025 11:30 AM IST

Sri rama Navami Prasadam Recipes: పెళ్లంటే చలిమిడి ఉండాల్సిందే. ఇక శ్రీరామనవమికి సీతారాముల కళ్యాణంలో చలిమిడి ప్రధాన వంటకం. దీని రెసిపీ ఎలాగో తెలుసుకోండి.

చలిమిడి రెసిపీ
చలిమిడి రెసిపీ (Youtube)

చలిమిడి పేరు చెబితే అందరికీ గుర్తొచ్చేది వివాహ సందర్భాలే. శ్రీరామనవమికి సీతారాముల కళ్యాణం కూడా వైభవంగా జరుగుతుంది. ఆ వివాహం మహోత్సవంలో ప్రసాదంగా చలిమిడి ఉండాల్సిందే. వడపప్పు, పానకంతో జతగా చలిమిడిని కూడా పక్కన పెడతారు.

ఈ మూడు ప్రసాదాలు అక్కడ ఉంటేనే వివాహంలో ఏ లోపం రాకుండా ఉంటుంది. మీరు కూడా శ్రీరామ నవమికి చలిమిడి చేసేందుకు సిద్ధమవుతున్నారా? ఇక్కడ మేము చలిమిడి రెసిపీ ఇచ్చాము. దీన్ని రెండు రకాలుగా చేసుకోవచ్చు. వీటిని పచ్చి చలిమిడి, పాకం చలిమిడి అని రెండు రకాలుగా పిలుస్తారు. మీకు ఏది నచ్చితే అది వండుకోండి.

తెలుగు వారి సంప్రదాయాల్లో చలిమిడికి ఎంతో ప్రాధాన్యత ఉంది. వివాహం అయ్యాక కూతురిని అత్తవారింటికి పంపేటప్పుడు ఆమెతోపాటు చలిమిడి కుండను కూడా పెడతారు. ఆ చలిమిడిని చుట్టుపక్కల వారికి పంచుతారు. అలాగే గర్భవతి అయ్యాక కూడా పుట్టింటి వారు చలిమిడి కూతురికి పంపిస్తారు.

ఇలా చలిమిడి పెట్టడం వల్ల పొట్ట చల్లదనం ఉంటుందని… అది పుట్టింటికే కాదు అత్తింటికి కూడా ఎంతో మేలు చేస్తుందని చెబుతారు. శ్రీరామనవమికి చలిమిడి చేయాలనుకుంటున్న వారు ఇక్కడ మేము చెప్పిన రెండు పద్ధతుల్లో ఏదో ఒక పద్ధతిలో వండుకోవచ్చు.

పచ్చి చలిమిడి రెసిపీ

పచ్చి చలిమిడి తయారీ చాలా సులువుగా ఉంటుంది. దీన్ని వండుకోవడం పెద్దగా కష్టపడక్కర్లేదు. మీరు పచ్చి చలిమిడి చేయాలనుకుంటే ముందుగానే బియ్యాన్ని నీటిలో నానబెట్టుకోండి. నాలుగైదు గంటలు బియ్యం నానబెట్టాక… ఆ నీరును ఒంపేసి బియ్యాన్ని వేరు చెయ్యండి. బియ్యం తడి ఆరి కాస్త పొడిపొడిగా మారినప్పుడు పిండి పట్టించండి. ఇప్పుడు జల్లెడతో ఆ బియ్యం పిండిని జల్లించండి. ఉండలు లేకుండా మిగతా పొడిని తీసుకోండి. మరోపక్క స్టవ్ మీద కళాయి పెట్టి నెయ్యిని వేసి ఆ నెయ్యిలో పచ్చి కొబ్బరి ముక్కలను వేసి వేయించండి. వాటిని తీసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు బెల్లం తురుమును రెడీ చేసుకోండి. ఒక కప్పు బియ్యం పిండికి మీకు అర కప్పు బెల్లం సరిపోతుంది. మీరు ఎంత బియ్యప్పిండిని తీసుకున్నారో దాన్ని బట్టి బెల్లం తురుమును కూడా సిద్ధం చేసుకోండి. ఇప్పుడు బియ్యపు పిండిని ఒక గిన్నెలో వేసి బెల్లం పొడిని వేసి బాగా కలపండి. కాస్త నీళ్లు వేస్తూ అది ముద్దగా అయ్యేలా చేసుకోండి. ఇప్పుడు ఇందులోనే వేయించుకున్న కొబ్బరి ముక్కలు, నెయ్యి కూడా వేసి బాగా కలపండి. అంతే పచ్చి చలిమిడి రెడీ అయిపోతుంది. ఇది చాలా రుచిగా ఉంటుంది. కాకపోతే బెల్లాన్ని పొడి రూపంలో తీసుకోవాలి. ముద్దముద్దగా ఉండే బెల్లం ఉపయోగపడదు.

………………………………………………………………………….

పాకం చలిమిడి ఎలా చేయాలి?

పాకం చలిమిడి చేయడానికి ఎక్కువ సమయం పడుతుంది. పచ్చి చలిమిడిలాగా వెంట వెంటనే చేయలేరు. దీని రెసిపీ ఇక్కడ ఇచ్చాము.

పాకం చలిమిడి రెసిపీకి కావలసిన పదార్థాలు

బియ్యము – రెండు కప్పులు

బెల్లం – అర కప్పు

నెయ్యి – నాలుగు స్పూన్లు

గసగసాలు – ఒక స్పూను

పచ్చికొబ్బరి ముక్కలు – అరకప్పు

పాకం చలిమిడి రెసిపీ

1. ముందుగానే బియ్యాన్ని నీళ్లలో నానబెట్టి నాలుగు గంటల పాటు వదిలేయాలి.

2. తర్వాత నీళ్లను ఒంపేసి ఆ బియ్యాన్ని ఒక వస్త్రంపై ఆరబెట్టాలి.

3. ఎండలో ఆరబెట్టాల్సిన అవసరం లేదు. ఫ్యాన్ కింద ఆరబెడితే అవి 70 శాతం వరకు ఆరిపోతాయి.

4. ఆ తరువాత ఆ తడిబియాన్ని పిండి చేసుకోవాలి. దీన్నే తడి బియ్యప్పిండి అంటారు.

5. ఇప్పుడు స్టవ్ మీద పెద్ద గిన్నె పెట్టి బెల్లం నీళ్లు పోసి మరిగించాలి.

6. బెల్లం పాకంలా అయ్యే వరకు మరిగించుకోవాలి. బెల్లం పాకం అయ్యాక అందులో నెయ్యి వేయాలి.

7. తర్వాత బియ్యప్పిండిని కొంచెంగా వేస్తూ గరిటతో కలుపుతూనే ఉండాలి. ఉండలు కట్టకుండా చూసుకోవాలి.

8. మరోపక్క స్టవ్ మీద కళాయి పెట్టి నెయ్యి వేసి అందులో పచ్చి కొబ్బరి ముక్కలు, గసగసాలు వేయించాలి.

9. అలాగే జీడిపప్పులను కూడా వేయించి పక్కన పెట్టుకోవాలి.

10. ఇప్పుడు బెల్లం, బియ్యప్పిండి కలుపుతున్న మిశ్రమంలోనే ఈ గసగసాలు, కొబ్బరి ముక్కలు, జీడిపప్పులు వేసి బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసేయాలి.

11. దీన్ని చిన్న మంట మీద చేయాలి. లేకపోతే పాకం చలిమిడి త్వరగా గట్టిగా మారిపోతుంది. లేదా మాడిపోయే అవకాశం ఉంటుంది.

ఈ పాకం చలిమిడి రెసిపీ కొంచెం కష్టంగా అనిపించిన చాలా రుచిగా ఉంటుంది. పైగా ఆరోగ్యానికి కూడా ఎంతో మంచిది. మీకు పచ్చి చలిమిడి, పాకం చలిమిడి ఈ రెండిట్లో ఏది సులువుగా అనిపిస్తే… అది ఈ శ్రీరామనవమికి వెళ్లేందుకు ప్రయత్నించండి.

Haritha Chappa

TwittereMail
హరిత హిందూస్తాన్ టైమ్స్‌లో చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్లో పీజీ పూర్తి చేశారు. ఈనాడు, తెలుగు సమయం, ఆంధ్రజ్యోతి, ఏబీపీ నెట్‌వర్క్‌లలో పని చేశారు. ప్రింట్, డిజిటల్ జర్నలిజంలో 17 ఏళ్ల అనుభవం ఉంది. 2023 డిసెంబరు నుంచి హిందూస్థాన్ టైమ్స్‌లో ఆస్ట్రాలజీ, లైఫ్‌స్టైల్ సెక్షన్ల బాధ్యతలు చూస్తున్నారు.

సంబంధిత కథనం

Source / Credits

Best Web Hosting Provider In India 2024