Indian killed in Canada : కెనడాలో దారుణం- కత్తి దాడి ఘటనలో భారతీయుడు మృతి

Best Web Hosting Provider In India 2024


Indian killed in Canada : కెనడాలో దారుణం- కత్తి దాడి ఘటనలో భారతీయుడు మృతి

Sharath Chitturi HT Telugu
Published Apr 05, 2025 10:15 AM IST

Indian killed in Canada : కెనడాలో జరిగిన ఒక కత్తి దాడి ఘటనలో ఒక భారతీయుడు మరణించాడు. ఈ ఘటనకు సంబంధించిన ఒక అనుమానితుడిని పోలీసులు అరెస్టు చేశారు. కాగా మరణించిన భారతీయుడి వివరాలను పోలీసులు ఇంకా వెల్లడించలేదు.

కెనడాలో భారతీయుడి హత్య- కారణం ఏంటి?
కెనడాలో భారతీయుడి హత్య- కారణం ఏంటి? (Pixabay/Representative)

కెనడాలో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. ఒట్టావాలో జరిగిన ఒక కత్తి దాడి ఘటనలో ఒక భారతీయుడు మరణించాడు. ఈ విషయాన్ని కెనడాలోని భారత రాయబార కార్యాలయం శనివారం ఉదయం వెల్లడించింది.

అసలేం జరిగింది..?

ఒట్టావా డౌన్​టౌన్​కు తూర్పున, సుమారు 40 కిలోమీటర్ల దూరంలో ఉన్న రాక్​ల్యాండ్​లోని​ లాలోండే స్ట్రీట్ సమీపంలో శుక్రవారం మధ్యాహ్నం 3 గంటలకు (స్థానిక కాలమానం ప్రకారం) ఈ సంఘటన జరిగిందని ఒంటారియో ప్రావిన్షియల్ పోలీసులు రేడియో-కెనడాకు తెలిపారు. కాగా భారతీయుడిపై కత్తిదాడి ఎందుకు, ఎలా జరిగింది? దీనికి అసలు కారణం ఏంటి? వంటి వివరాలు తెలియరాలేదు. కానీ ఒక అనుమానితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు కెనడాలోని భారత రాయబార కార్యాలయం తెలిపింది.

“ఒట్టావా సమీపంలోని రాక్​ల్యాండ్​లో ఓ భారతీయుడు కత్తిపోట్లకు గురై మరణించడం మమ్మల్ని తీవ్రంగా కలచివేసింది. ఓ అనుమానితుడిని అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు. మృతుల కుటుంబాలకు అన్ని రకాల సహాయ సహకారాలు అందించేందుకు స్థానిక కమ్యూనిటీ అసోసియేషన్ ద్వారా సంప్రదింపులు జరుపుతున్నాం,” అని కెనడాలోని భారత రాయబార కార్యాలయం తెలిపింది.

కెనడియన్ న్యూస్ బ్రాడ్​కాస్టర్ సీబీసీ న్యూస్ ప్రకారం.. క్లారెన్స్-రాక్ ల్యాండ్​లో ఒకరు మరణించారు. మరొక వ్యక్తిని అరెస్టు చేశారు. భారత రాయబార కార్యాలయం ఎక్స్​లో తన పోస్ట్​లో ప్రస్తావించిన సంఘటన ఇదేనా అనేది స్పష్టంగా తెలియదు.

మరణానికి గల కారణాన్ని లేదా కస్టడీలో ఉన్న వ్యక్తి ఏవైనా అభియోగాలను ఎదుర్కొంటాడా అనే విషయాన్ని పోలీసులు ఇంకా వెల్లడించలేదని సీబీసీ న్యూస్ నివేదిక తెలిపింది.

కత్తి దాడి ఘటనలో మరణించిన వ్యక్తి వివరాలను కూడా అధికారులు అధికారికంగా వెల్లడిచాల్సి ఉంది.

తదుపరి వివరాలను రాబోయే ప్రకటనలో వెల్లడిస్తామని అధికారులు రేడియో-కెనడాకు తెలియజేశారు.

తాజా ఘటనతో భారత సమాజంలో భయాందోళనలు పెరిగాయి. ఈ నేపథ్యంలో ఒంటారియో ప్రావిన్షియల్ పోలీసులు భద్రతను పెంచుతున్నట్టు రాక్​ల్యాండ్ నివాసితులకు స్పష్టం చేశారు.

కెనడాలోని దేవాలయంపై దాడి..!

భారతీయులపైనే కాదు కెనడాలో దేవాలయాలపై దాడులు కూడా ఇటీవలి కాలంలో విపరీతంగా పెరుగుతున్నాయి. ఇద్దరు వ్యక్తులు ఓ ఆలయంపై దాడి చేసిన ఘటన గ్రేటర్​ టొరంటో ఏరియా (జీటీఏ)లో వెలుగులోకి వచ్చింది.

ఆ ఇద్దరు వ్యక్తులు గత ఆదివారం తెల్లవారుజామున ప్రాంతంలో పబ్​లో నుంచి బయటకు వచ్చి, సమీపంలోని ఆలయానికి నడుచుకుంటూ వెళ్లారు. ఆలయం వద్ద ఉన్న సీసీటీవీ ఫుటేజీ ప్రకారం ఆ ఇద్దరు ఆలయం ముందు ఉన్న చిహ్నాలపై దాడి చేసి, వాటిని ధ్వంసం చేశారు.

ఈ ఘటనపై స్పందించిన అధికారులు.. అనుమానితుల దృశ్యాలను విడుదల చేశారు. వారిని పట్టుకుంటామని హామీనిచ్చారు.

Sharath Chitturi

TwittereMail
శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్​ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. జర్నలిజంలో 6 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది.

సంబంధిత కథనం

జాతీయ, అంతర్జాతీయ తాజా వార్తలను మన తెలుగు హిందుస్తాన్ టైమ్స్ న్యూస్ సైట్‌లోని జాతీయ అంతర్జాతీయ సెక్షన్‌లో చూడవచ్చు.

Best Web Hosting Provider In India 2024


Source link