




Best Web Hosting Provider In India 2024

Web Series Review: టచ్ మీ నాట్ రివ్యూ – జియోహాట్‌స్టార్‌లో రిలీజైన తెలుగు క్రైమ్ థ్రిల్లర్ వెబ్‌సిరీస్ ఎలా ఉందంటే?
Web Series Review: తెలుగు వెబ్‌సిరీస్ టచ్ మీ నాట్ జియో హాట్ స్టార్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. నవదీప్, దీక్షిత్ శెట్టి, కోమలి ప్రసాద్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ క్రైమ్ థ్రిల్లర్ వెబ్‌సిరీస్ ఆడియెన్స్‌ను మెప్పించిందా? లేదా? అంటే?

Web Series Review: నవదీప్, దీక్షిత్ శెట్టి, కోమలి ప్రసాద్ ప్రధాన పాత్రల్లో నటించిన తెలుగు వెబ్‌సిరీస్ టచ్ మీ నాట్ జియో హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. క్రైమ్ ఇన్వేస్టిగేట్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ వెబ్ సిరీస్‌కు రమణ తేజ దర్శకత్వం వహించాడు. ఈ సిరీస్ ఎలా ఉందంటే?
రాఘవ్ ఇన్వేస్టిగేషన్…
గోదావరి హాస్పిటల్‌లో జరిగిన అగ్నిప్రమాదంలో చాలా మంది ప్రాణాలు కోల్పోతారు. ఈ కేసును సాల్వ్ చేసే బాధ్యతను ఎస్‌పీ రాఘవ్ (నవదీప్), దేవిక చేపడతారు. వారి ఇన్వేస్టిగేషన్‌లో ఊహించని విషయాలు బయటపడతాయి. ఈ యాక్సిడెంట్‌కు చాలా ఏళ్ల క్రితం మారుతి ఆపార్ట్స్‌మెంట్‌లో జరిగిన మాస్ మర్డర్స్‌కు సంబంధం ఉందని రాఘవ్, దేవిక అనుమానిస్తారు.
మారుతి అపార్ట్స్‌మెంట్ ఘటనలో గాయపడిన రిషికి (దీక్షిత్ శెట్టి) సైకోమెట్రిక్ స్కిల్స్ వస్తాయి. ఎవరి చేతినైనా తాకిన, ఏదైనా వస్తువును ముట్టుకున్న వాటి తాలూకు జ్ఞాపకాలు అతడి కళ్ల ముందు కదలాడుతుంటాయి. కాలేజీలో తనకు పరిచయమైన మేఘను(కోమలి ప్రసాద్) రిషి ప్రేమిస్తాడు. రిషికి చెప్పపెట్టకుండా కాలేజీ వదిలిపెట్టి వెళ్లిపోయిన మేఘ మళ్లీ అతడి ముందుకు పోలీస్ కానిస్టేబుల్‌గా ఎంట్రీ ఇస్తుంది.
మరోవైపు గోదావరి హాస్పిటల్ కేసుకు సంబంధించి రాఘవ్, దేవిక అనుమానించిన వ్యక్తులు దారుణంగా హత్యకు గురవుతారు. అసలు ఈ హత్యలు ఎవరు చేస్తున్నారు? రిషిని ప్రేమించిన మేఘ అతడికి ఎందుకు దూరమైంది? మారుతి అపార్ట్‌మెంట్ కేసుకు మేఘ తండ్రికి ఉన్న సంబంధం ఏమిటి? రాఘవ్‌కు సాయం చేసే క్రమంలో రిషి ఎలా ఇబ్బందుల్లో పడ్డాడు? రాఘవ్‌ను వెంటాడిన మాస్క్ మ్యాన్ ఎవరు? అన్నదే ఈ వెబ్‌సిరీస్ కథ.
సైకో మెట్రిక్ పాయింట్…
టచ్ మీ నాట్.. క్రైమ్ ఇన్వేస్టిగేటివ్ థ్రిల్లర్ కథతో తెరకెక్కిన వెబ్‌సిరీస్ . ఇందులో సైకోమెట్రిక్ అనే కొత్త పాయింట్‌ను టచ్ చేశాడు దర్శకుడు రమణ తేజ. ఒకే తరహాలో రెండు పెద్ద ప్రమాదాలు జరగడం, హంతకుడికి సంబంధించి పోలీసులకు ఒక్క క్లూ దొరక్కపోవడం, అదే ప్రమాదంలో గాయపడ్డ ఓ యువకుడు సైకో మెట్రిక్ స్కిల్స్‌తో ఈ కేసు ఛేదనలో పోలీసులకు సాయం పడటం…పాయింట్ పరంగా చూసుకుంటే టచ్ మీ నాట్ కొత్తగా అనిపిస్తుంది. ఇదేదో రెగ్యులర్ థ్రిల్లర్ సిరీస్ కాదేమో అనే ఫీలింగ్ కలుగుతుంది.
కామెడీగా…
రాతలో ఉన్న ఫ్రెష్‌నెస్ తీతలో కనిపించలేదు. సైకోమెట్రిక్ అనే పాయింట్‌ను దర్శకుడు సరిగ్గా వాడుకోలేకపోయాడు. కథను నిలబెట్టాల్సిన ఈ ట్రాక్ మొత్తం కామెడీగా మారిపోయింది. క్రైమ్ ఇన్వేస్టిగేషన్ థ్రిల్లర్ కథలు ఊహలకు అందని ట్విస్ట్‌లతో రేసీగా సాగాలి. అలాంటి స్పీడు ఈ సిరీస్‌లో కనిపించదు. ఆరంభ సన్నివేశాలు ఆకట్టుకుంటాయి. ఆ తర్వాతే దర్శకుడు గాడితప్పిన ఫీలింగ్ కలుగుతుంది. ఓ వైపు దేవిక, రాఘవ్ ఇన్వేస్టిగేషన్‌తో పాటు మరోవైపు రిషి, మేఘ లవ్ ట్రాక్ కూడా సాగతీత వ్యవహారంలా అనిపిస్తుంది. డైలాగ్స్ తోనే చాలా వరకు కథను నడిపించడం ఆకట్టుకోదు.
అక్కడే ఎండ్…
కథ ఎక్కడైతే మొదలవుతుందో…అదే పాయింట్ వద్ద ఎండ్ చేసినట్లుగా అనిపిస్తుంది. ఇంచు కూడా ముందుకు కదలని ఫీలింగ్ కలుగుతుంది. సెకండ్ సీజన్‌పై ఆసక్తిని పంచేలా ఎండింగ్‌లో ఏదైనా సర్‌ప్రైజ్ ఎలిమెంట్ ఉండేలా చూసుకుంటే బాగుండేది.
నవదీప్….
పోలీస్ ఆఫీసర్ రాఘవ్‌గా ఓ సీరియల్ రోల్‌లో నవదీప్ కనిపించాడు. సిరీస్ మొత్తం ఒకే ఎక్స్‌ప్రెషన్‌తో సెటిల్డ్ యాక్టింగ్ కనబరిచాడు. దసరా ఫేమ్ దీక్షిత్ శెట్టి ఈ సిరీస్‌లో ఫుల్ లెంగ్త్ రోల్ దొరికింది. నవదీప్ కంటే అతడే ఎక్కువగా స్క్రీన్‌పై కనిపిస్తాడు. సైకోమెట్రిక్ స్కిల్స్ ఉన్న రిషి అనే యువకుడి పాత్రకు న్యాయం చేశాడు. కామెడీతో నవ్వించాడు.
చేయని తప్పుకు శిక్ష అనుభవిస్తున్న తండ్రి కోసం తాపత్రయపడే యువతిగా కోమలి ప్రసాద్ ఎమోషనల్ రోల్‌తో ఆకట్టుకుంది. దేవీప్రసాద్, బబ్లూ పృథ్వీరాజ్, అనీష్ కురువిల్లాతో పాటు మిగిలిన వారి నటన కూడా బాగుంది.
మ్యూజిక్‌తోనే థ్రిల్…
మహతి స్వరసాగర్ మ్యూజిక్ ఈ సిరీస్‌కు ప్లస్ పాయింట్‌గా నిలిచింది. మ్యూజిక్‌తోనే థ్రిల్ ఫీల్‌ను ఆడియెన్స్‌లో కలిగించాడు. సినిమాలకు ఏ మాత్రం తీసిపోని విధంగా టచ్ మీ నాట్ ప్రొడక్షన్ వాల్యూస్ ఉన్నాయి. ప్రతిభావంతులైన ఆర్టిస్టులు ఉన్నారు. కానీ దర్శకుడు వారిని సరిగ్గా వాడుకోలేకపోయాడు అనిపిస్తుంది.
కన్ఫ్యూజన్…
టచ్ మీ నాట్ కన్ఫ్యూజింగ్‌గా సాగే క్రైమ్ ఇన్వేస్టిగేటివ్ థ్రిల్లర్ సిరీస్. పాయింట్ కొత్తదే కానీ దానిని స్క్రీన్‌పైకి తీసుకురావడంలో దర్శకుడు తడబడిపోయాడు. నవదీప్, దీక్షిత్ శెట్టి తో పాటు మిగిలిన వారి యాక్టింగ్ కోసం ఓ సారి సిరీస్‌ను చూడొచ్చు.
సంబంధిత కథనం