




Best Web Hosting Provider In India 2024

Zero Poverty P4 Policy : సీఎం చంద్రబాబు పిలుపుతో పీ4కి అనూహ్య స్పందన – లిఫ్ట్ ఇరిగేషన్ నిర్మాణానికి ముందుకొచ్చిన దాత
Zero Poverty P4 Policy : ఏపీ సీఎం చంద్రబాబు పిలుపుతో జీరో పావర్టీ పీ4 పాలసీకి అనూహ్య స్పందన వస్తుంది. సొంత డబ్బులతో కొమ్మమూరు లిఫ్ట్ ఇరిగేషన్ నిర్మాణానికి ప్రసాద్ సీడ్స్ సంసిద్ధత వ్యక్తం చేశారు. రైతుల కోసం లిఫ్ట్ నిర్మాణానికి ముందుకొచ్చిన ప్రసాద్ ఔదారాన్ని సీఎం చంద్రబాబు అభినందించారు.

Zero Poverty P4 Policy : అట్టడుగున ఉన్న పేదల అభ్యున్నతికి ఏపీ ప్రభుత్వం తలపెట్టిన పీ4 కార్యక్రమానికి అనూహ్య స్పందన వస్తోంది. ముఖ్యమంత్రి పిలుపు మేరకు… పేదలకు చేయూతను అందించేలా పీ4 కార్యక్రమంలో భాగస్వాములు అయ్యేందుకు సంపన్నవర్గాలు ముందుకొస్తున్నాయి. ఇప్పటికే పలువురు పారిశ్రామిక వేత్తలు మార్గదర్శకులుగా ఉండి…బంగారు కుటుంబాలకు సాయంగా నిలుస్తున్నారు. ఈ క్రమంలో ఏకంగా సొంత నిధులతో ఒక లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ నిర్మించి ఇవ్వడానికి గుంటూరు జిల్లాలో ఒక పారిశ్రామిక వేత్త ముందుకు వచ్చారు.
గుంటూరు జిల్లా కాకమాను మండలంలో రైతులు సాగునీటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కొమ్మమూరు కెనాల్ ద్వారా నీటి సౌకర్యం ఉన్నా… చివరి భూములకు నీరు అందడం లేదు. ఇక్కడ లిఫ్ట్ నిర్మిస్తే ఈ ప్రాంత రైతుల కష్టాలు తీరతాయి. దీంతో ఈ సమస్యను పరిష్కరించడానికి పీ4పై సీఎం ఇచ్చిన పిలుపును అందుకుని ప్రసాద్ సీడ్స్ అధినేత ప్రసాద్ ముందుకు వచ్చారు.
తమ సొంతూరులో రైతులు సాగునీటి ఎద్దడిని ఎదుర్కోవడం ప్రముఖ విత్తన తయారీ సంస్థ ‘ప్రసాద్ సీడ్స్’ యాజమాన్యాన్ని కదిలించింది. సమస్య పరిష్కారం కోసం లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు నిర్మించేందుకు ప్రభుత్వంతో భాగస్వాములు అవుతామని ఈ మేరకు ప్రసాద్ సీడ్స్ చైర్మన్ కారుమంచి ప్రసాద్ ముఖ్యమంత్రిని కలిసి వివరించారు.
కొమ్మమూరు లిఫ్ట్ ఇరిగేషన్ స్కీం నిర్మాణానికి రూ.10 కోట్లు వితరణ ఇస్తామని చెప్పారు. తద్వారా తమ సొంతూరు కాకుమాను గ్రామంతో పాటు ఆ చుట్టుపక్కల గ్రామాల్లో సాగు నీటి సమస్య పరిష్కారం అవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
ప్రసాద్ వితరణ ఎంతోమందికి స్ఫూర్తి
కారుమంచి ప్రసాద్ సూచించిన విధంగా కొమ్మమూరు ప్రాంతంలో లిఫ్ట్ ఇరిగేషన్ స్కీంకు డీపీఆర్ సిద్ధం చేసి, త్వరగా అనుమతులు ఇవ్వాలని జలవనరుల శాఖ అధికారులను సీఎం చంద్రబాబు ఆదేశించారు. అధికారులు సమన్వయం చేసుకుంటూ ప్రసాద్ అందించే ఆర్థిక సాయం ద్వారా లిఫ్ట్ నిర్మాణం చేపట్టాలని సూచించారు. సొంత గ్రామంలో రైతులకు మేలు చేసేందుకు పెద్దమనసుతో ప్రసాద్ ముందుకు రావడాన్ని సీఎం అభినందించారు. తాను ఏ ఆలోచనతో అయితే పీ4 విధానాన్ని ప్రకటించానో…. దాన్ని అర్థం చేసుకుని వివిధ వర్గాల ప్రజలు ముందుకు రావడం తనకు ఎంతో సంతృప్తిని ఇస్తోందని సీఎం అభిప్రాయ పడ్డారు.
4 దశాబ్దాలుగా సీడ్స్ బిజినెస్
గుంటూరు జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గం కాకుమాను గ్రామానికి చెందిన కారుమంచి ప్రసాద్ 4 దశాబ్దాలుగా విత్తన వ్యాపారంలో ఉన్నారు. 1995 నుంచి ఆ ప్రాంతంలో అభివృద్ది కార్యక్రమాలకు ఆయన సహాయం చేస్తూ వస్తున్నారు. పెదనందిపాడు లిఫ్ట్ స్కీంను పూర్తి చేయడానికి 1995లో ఆయన ఆర్థిక సాయం అందించారు.
కొమ్మమూరు లిఫ్ట్ ఇలా
43 కి.మీ పొడవున్న కొమ్మమూరు కాలువలో చివరి 10 కి.మీ. మేర భూములకు ఎన్నాళ్లగానో సాగునీరు సరిగ్గా అందడం లేదు. ఈ సమస్య పరిష్కారానికి కాకమాను దగ్గర కొమ్మమూరు కాలువపై లిఫ్ట్ ను నిర్మించాల్సి ఉంది. ఈ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు సాకారమైతే కాకమాను, బీకే పాలెం, అప్పాపురం, గరికపాడు, కొండపాతూరు గ్రామాల్లోని సుమారు 5,315 ఎకరాలకు పుష్కళంగా నీరు అందుతుంది. అలాగే కాకమాను మండలంలో ప్రజలకు తాగునీటి సమస్య తీరుతుంది. లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు నుంచి 10 కి.మీ. పొడవునా చివరి ఆయకట్టు వరకు 100 క్యూసెక్కుల నీరు ప్రవహించేలా 100 అడుగుల వెడల్పుతో కాలువ అభివృద్ధి చేయాల్సి ఉంటుంది. వ్యక్తిగతంగా ఈ ప్రాజెక్టుకు సాయం చేసేందుకు ప్రసాద్ ముందుకు రావడంతో ప్రభుత్వం కూడా అవసరమైన నిధులు వెచ్చించి పనులు పూర్తి చేయనుంది.
సంబంధిత కథనం
టాపిక్