Sleeping Rules: నిద్ర విషయంలో పెద్దలు చెప్పే మాటలను కొట్టి పారేయకండి.. వాటి వెనకున్న శాస్త్రీయ కారణాలేంటో తెలుసుకోండి!

Best Web Hosting Provider In India 2024

Sleeping Rules: నిద్ర విషయంలో పెద్దలు చెప్పే మాటలను కొట్టి పారేయకండి.. వాటి వెనకున్న శాస్త్రీయ కారణాలేంటో తెలుసుకోండి!

Ramya Sri Marka HT Telugu
Published Apr 05, 2025 08:30 PM IST

Sleeping Rules According to Veda’s: తల అటు పెట్టి నిద్రపోవద్దు, తడి కాళ్లతో పడుకోకూడదు అంటూ పెద్దలు నిద్రకు సంబంధించి కొన్ని ప్రత్యేక నియమాలను చెబుతుంటారు. ఇవి కేవలం ఉట్టి మాటలు కాదండోయ్.. వీటి వెనక ఆరోగ్యంపై ప్రభావం చూపే రహస్యాలు ఉన్నాయి. శాస్త్రీయ కారణాలు కూడా ఉన్నాయి. అవేంటో తెలుసుకుందాం రండి.

ఆరోగ్యంగా ఉండటం కోసం పాటించాల్సిన నిద్ర నియమాలేంటి
ఆరోగ్యంగా ఉండటం కోసం పాటించాల్సిన నిద్ర నియమాలేంటి (shutterstock)

నిద్ర గురించి ఇంట్లో పెద్దలు చాలా విషయాలను చెబుతుంటారు. తల అటు పెట్టద్దు, తడి కాళ్లతో పడుకోవద్దు, మెడమీద మోచేతులు ఉంచద్దు అంటే. వీటిని ఉట్టి మాటలుగా తీసి పారేస్తుంటాం. నిజానికి ఇవి కేవలం ఉట్టి మాటలు కాదంట. వీటి వెనక శాస్త్రీయ కారణలెన్నో దాగి ఉన్నాయట. అవి మన ఆరోగ్యంపై తీవ్ర ప్రభావాన్ని చూపుతాయట. అవేంటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం రండి.

ఆరోగ్యంగా ఉండటానికి వేదాలలో అనేక నియమాలు ఉన్నాయి. అవి శాస్త్రీయంగా కూడా నిరూపించబడ్డాయి. ఇందులో సరైన ఆహారాలను తినడం, స్వచ్ఛమైన నీటిని త్రాగడం లాగే, చక్కటి నిద్రకు కూడా కొన్ని నియమాలు ఉన్నాయి. వీటిని పాటించకపోవడం వల్ల అనేక ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి. ఈమధ్య కాలంలో చాలా మందిని నిద్రలేమి సమస్యలు ఇబ్బంది పెడుతున్నాయి. రాత్రి నిద్ర రాకపోవడం అనేది అది పెద్ద సమస్యగా మారింది. ఈ సమస్య నుండి బయటపడాలంటే శాస్త్రాలలో చెప్పినట్లుగా నిద్రించండి. ఇవి మిమ్మల్ని ప్రశాంతంగా నిద్రపోయేలా చేసి ఆరోగ్యంగా ఉంచేందుకు సహాయపడతాయని వేదాలు చెబుతున్నాయి.

1. ఉత్తర దిశగా తల వైపు నిద్రించకూడదు

వేదాలలో ఉత్తర దిశగా తల పెట్టి నిద్రించకూడదని ఉంటుంది. దీనికి శాస్త్రీయ కారణం కూడా ఉంది. అదేంటో తెలుసుకుందాం.

నిజానికి, భూమికి రెండు అయస్కాంత క్షేత్రాలు ఉన్నాయి. దక్షిణ, ఉత్తర ధృవాలు. ఒక వ్యక్తి ఉత్తర దిశగా తల పెట్టి నిద్రిస్తే, శరీర అయస్కాంత క్షేత్రం అస్తవ్యస్తమవుతుంది. దీని వల్ల రక్తం అస్తవ్యస్తంగా ప్రవహిస్తుంది. ఫలితంగా గుండె సమస్యలు వస్తాయి.

మరో కారణం రక్తంలో ఐరన్ పరిమాణం. ఉత్తర దిశగా తల పెట్టి నిద్రించడం వల్ల భూమి అయస్కాంత ధృవం ఇనుమును ఆకర్షిస్తుంది. ఇది మెదడులో పేరుకుపోతుంది, దీని వల్ల చాలా మందికి తలనొప్పి సమస్య వస్తుంది.

2. తడి కాళ్ళతో నిద్రించకూడదు

అత్రి స్మృతిలో కాళ్ళు తడిగా ఉంచుకొని నిద్రించకూడదని పేర్కొని ఉంటుంది. అలా చేస్తే ధన నష్టం జరుగుతుందని చెబుతారు. దీన్ని శాస్త్రీయంగా చూస్తే,

తడి కాళ్ళతో పడకపై పడుకోవడం వల్ల కాళ్ళలో శిలీంధ్రాలు, బ్యాక్టీరియా పెరగడానికి అవకాశం ఉంటుంది. దీని వల్ల ఇన్ఫెక్షన్ ప్రమాదం ఉంటుంది. అథ్లెట్ ఫుట్ వచ్చే ప్రమాదం కూడా ఉంటుంది. అథ్లెట్స్ ఫుట్ (టినియా పెడిస్) అనేది శిలీంధ్రాల ద్వారా వచ్చే చర్మపు ఇన్ఫెక్షన్. ఇది సాధారణంగా పాదాల వేళ్ళ మధ్య మొదలవుతుంది, దురద, పొలుసులు లేవడం, మంట వంటి లక్షణాలతో వస్తుంది.

3. మురికి పడకపై నిద్రించకూడదు

పడకపై కూర్చుని ఆహారం తినకూడదు. మంచం మీద తలదువ్వుకోకూడదు. మురికి మంచం మీద నిద్రపోవద్దు ఇలాంటి మాటలన్నీ మీ పెద్దల నోట మీరు చాలా సార్లు వినే ఉంటారు. దీనికి వెనకున్న శాస్త్రీయ కారణం ఏంటంటే..

దుమ్ము, ధూళి, వెంట్రుకలు వంటివి ఉన్న మంచం మీద పడుకోవడం వల్ల నిద్ర సరిగ్గా పట్టదు. చర్మపు చికాకులు కలుగుతాయి. వాటి మీద ఉండే బ్యాక్టీరియా మీ నిద్రను అస్తవ్యస్తం చేయడమే కాకుండా.. రకరకాల అనారోగ్యం బారిన పడేలా చేస్తుంది.

4. పూర్తిగా చీకటి గదిలో నిద్రించకూడదు

పద్మపురాణంలో పూర్తిగా చీకటిగా ఉండే గదిలో నిద్రించకూడదనే నియమం ఉంటుంది. పరిశోధనల ప్రకారం.. పూర్తి చీకటి గదిలో నిద్రించడం అనేది సర్కాడియన్ రిథమ్‌ను సరిగ్గా ఉంచుతుంది. కానీ చాలా మందికి చీకటిలో భయం ఉంటుంది. ఇలాంటి వారు మసక వెలుతురులో నిద్రించడం వల్ల గాఢంగా నిద్రపోతారు.

5. మెడపై చేతులు ఉంచుకొని నిద్రించకూడదు

పెద్దలు మెడపై చేతులు ఉంచుకొని నిద్రించకూడదని చెబుతుంటారు. దీని వల్ల భయంకరమైన కలలు వస్తాయి, నిద్ర చెడిపోతుంది అంటారు. దీన్ని శాస్త్రీయంగా చెప్పాలంటే..

మెడపై చేతులు ఉంచడం వల్ల అనవసరమైన ఒత్తిడి ఏర్పడుతుంది. నిద్రిస్తున్నప్పుడు మన గుండె, ఊపిరితిత్తులు, మెదడు నెమ్మదిగా పనిచేస్తాయి. మెడపై చేతులు ఉంచినప్పుడు గుండె అస్తవ్యస్తమవుతుంది, అది కొట్టుకునే వేగం పెరుగుతుంది. విశ్రాంతి స్థితిలో ఉన్న మెదడు మెడపై చేతులు ఉంచడం వల్ల డిస్టర్బ్ అవతుంది. భావోద్వేగ అసమతుల్యతకు కారణమవుతుంది. దీని వల్ల పీడకలలు వస్తుంటాయి.

చూశారు కదా. పెద్దలు చెప్పే ప్రతి మాటకు ఒక కారణం ఉంటుందని అర్థం అయ్యే ఉంటుంది. కాబట్టి ఇప్పటి నుంచి అమ్మమ్మలు, నానమ్మలు చెప్పిన మాటలను ఉట్టి మాటలుగా తీసి పారేకండి. వారు చెప్పలేకపోయినా దాని వెనకు ఏదో ఒక శాస్త్రీయ కారణం ఉండే ఉంటుందని గ్రహించండి. పోయేదేముంది అనుకుని వారి మాటను వినేయండి.

గమనిక : ఈ కథనంలో మీకు అందించిన సమాచారం, సూచనలు పూర్తిగా నిజమైనది, ఖచ్చితమైనది అని మేము చెప్పలేము. నిపుణుల అభిప్రాలయను క్రోడీకరించి మాత్రమే ఈ సూచనలు అందిస్తున్నాం. వీటిని పాటించే ముందు ఖచ్చితంగా సంబంధిత రంగంలోని నిపుణుల సలహా తీసుకోవడం మంచిది.

Ramya Sri Marka

eMail
మార్క రమ్యశ్రీ హిందుస్తాన్ టైమ్స్‌ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్. ఇక్కడ లైఫ్‌స్టైల్, ఆస్ట్రాలజీ వార్తలు రాస్తున్నారు. గతంలో ఈనాడు, టీన్యూస్, ఈటీవీ భారత్ వంటి సంస్థల్లో కంటెంట్ రైటర్‌గా పనిచేశారు.జర్నలిజంలో ఎనిమిదేశ్లకు పైగా అనుభవం ఉంది. కాకతీయ యూనివర్సిటీలో మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం పీజీ చేశారు. 2024 నవంబరులో హెచ్.టి తెలుగులో చేరారు.

సంబంధిత కథనం

Source / Credits

Best Web Hosting Provider In India 2024