




Best Web Hosting Provider In India 2024

సీతారాముల అనుబంధం నుంచి నేటి భార్యాభర్తలు నేర్చుకోవాల్సిన అంశాలు ఇవిగో, ఇలా ఉంటే విడాకులే ఉండవు
ఆదర్శ దంపతులు అంటే సీతారాములనే చెప్పుకుంటారు. ప్రతి భార్యా భర్తలు సీతారాముల్లాగా ఉంటే వారి మధ్య విడాకులు వంటి సమస్య రాదని అంటారు. సీతారాములను చూసి ప్రతి భార్యాభర్త ఏం తెలుసుకోవాలో ఇక్కడ ఇచ్చాము.

పెళ్లికి శుభలేఖ ఎంతో ముఖ్యం. ప్రతి శుభలేఖలో కూడా సీతారాముల కళ్యాణాన్ని ఒక శ్లోకం రూపంలో రాస్తారు. భార్యాభర్తలు అంటే అందరికీ గుర్తొచ్చేది సీతారాములే. సీతారాముల్లాంటి భార్యాభర్తలు అని అన్యోన్యమైన జంటను చూసి చెబుతూ ఉంటారు. సీతారాముల్లాంటి గుణాలు భార్యాభర్తల్లో ఉంటే ఆ సంసారం పచ్చగా ఉంటుందని ఎప్పటికీ విడిపోరని కూడా చెప్పుకుంటూ ఉంటారు.
ఆదర్శ దాంపత్యానికి సీతారాములు ఎలా ఉదాహరణగా మారారు? వారి నుంచి నేటి భార్యాభర్తలు తెలుసుకోవలసిన నేర్చుకోవాల్సిన అంశాలు ఏమిటో ఇక్కడ వివరించాము. ప్రతి దంపతులకు సీతారాములు ఆదర్శనీయం. శ్రీరాముడి జీవితంలో ముఖ్యమైన స్త్రీ.. సీతమ్మ.
భార్యంటే సీతమ్మే
భర్త ఎక్కడుంటే భార్య కూడా అక్కడే ఉండాలని, అదే సతీ ధర్మమని ఈ లోకానికి చాటి చెప్పింది సీతమ్మ. అందుకే ఆమె ఆదర్శమూర్తిగా మారింది. రామాయణంలో అరణ్యవాసానికి భర్తతోపాటు బయలుదేరినప్పుడు ఆమెను ఆపాడు రాముడు. యువరాణి అయినా సీత అడవిలో చెప్పులు లేకుండా, మండుటెండలో, వానలో జీవించలేదని తాను మాత్రమే అడవికి వెళతానని సీతను అంతఃపురంలోనే ఉండమని హితోపదేశం చేశాడు రాముడు. కానీ సీతమ్మ అందుకు ఒప్పుకోలేదు. పెళ్లి అయిన తర్వాత కష్టనష్టాల్లో భర్త వెంటే భార్య నడవాలని రాముడికి హితోపదేశం చేసింది సీత.
తన సౌఖ్యం కోసం అంతపురంలో ఉండిపోలేదు, కష్టాలు ఉంటాయని తెలిసి కూడా రాముడి వెంటే నడిచింది. ఇప్పటికీ ఎంతోమంది భర్తలు తగినంత సంపాదించడం లేదని, తమకు సకల సౌకర్యాలు కల్పించడం లేదని, తమ కోరికలు తీర్చడం లేదని విడాకులు ఇచ్చేవారు ఉన్నారు. అలాంటి భార్యలు సీతమ్మను చూసి ఎంతో నేర్చుకోవాలి. సీతమ్మ తన భర్త సౌఖ్యమే తన సౌఖ్యం అనుకుంది. అతడి కష్టమే తన కష్టం అనుకుంది. ఆయనతోనే తన జీవితాన్ని పెనవేసుకొంది. అందుకే అడవిలో కూడా ఆనందంగా జీవించింది.
రాముడితో పాటు వనవాసమే కాదు, ఎన్నో రోజులు ఉపవాసం కూడా చేసింది. సీతమ్మ అనేక కష్టాలను ఓర్చి రాముడు వెంటే నడిచింది. రాముడు రథమైతే… సీతమ్మ ఆ రథ చక్రాలుగా మారి నడిపించింది.
వనవాస సమయంలో రావణుడు ఆమెను ఎత్తుకెళ్లి తన రాజ్యానికే మహారాణిని చేస్తానని చెప్పాడు. ఆమెకు ఎన్నో ఆశలు చూపించాడు. అయినా కూడా పర పురుషుడిని కొన చూపుతో కూడా చూడలేదు సీతమ్మ. తన భర్తనే తలుచుకుంటూ ఆయన రాక కోసమే వేచి ఉంది. ఆయన రాకపోతే తనకు తానే ఆహుతి చేసుకోవాలనుకుంది. కానీ రావణుడి వైపు కన్నెత్తి కూడా చూడాలనుకోలేదు. అందుకే ఆమెను పతివ్రతగా చెబుతారు. అలాంటి పాతివ్రత్యాన్ని కలిగి ఉన్న భార్య దొరకడం భర్త అదృష్టంగానే చెప్పుకోవాలి.
రాముడి నుంచి ఏం నేర్చుకోవాలి?
రాముడు కూడా తన భార్యకు ఎంతో విలువ ఇచ్చాడు. తన తల్లికి ఎంత ప్రాధాన్యత ఇచ్చాడో సీతమ్మకు కూడా అంతే ఇచ్చాడు. ఆమె కష్టం పడకుండా చూసేందుకు ప్రయత్నించాడు రాముడు. మహిళను చులకనగా ఎప్పుడూ చూడలేదు. భార్యాభర్తలు ఇద్దరు సమానమేనని శ్రీరాముడు చాటి చెప్పాడు. సీతమ్మ చెప్పిన మాటలను, హితోపదేశాలను శ్రద్ధగా వినేవాడు. ఆమె తన మంచికే చెబుతుందని నమ్మేవాడు.
భార్యను దూషించడం, అపహాస్యం చేయడం, ఆమెను శారీరకంగా బాధ పెట్టడం వంటివి శ్రీరాముడు ఏనాడు చేయలేదు. అందుకే ఆయన ఆదర్శ భర్తగా మారాడు. వివాహ బంధంలో సీతారాముల ఉన్న భార్యాభర్తలకు ఎలాంటి సమస్యలు రావు. ఒకవేళ వచ్చినా కూడా వారిద్దరూ కలిసి పరిష్కరించుకోగలుగుతారు. ఇదే మనకు సీతారాముల అనుబంధం చెబుతోంది. భారతీయ కుటుంబ వ్యవస్థలో సీతారాముల ప్రస్తావన వస్తూనే ఉంటుంది. ఎప్పటికైనా వారిద్దరే ఆదర్శ దాంపత్యానికి అర్థంగా ఉంటారు.
సంబంధిత కథనం
టాపిక్